సమస్యలను వేగంగా పరిష్కరించండి
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:05 AM
జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషిచేయాలని కలెక్టర్ విజయసునీత ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
కంభం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషిచేయాలని కలెక్టర్ విజయసునీత ఆదేశించారు. శుక్రవారం అర్ధవీడు మండలం ఎంపీడీవో కార్యాలయ సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలలో ఎక్కువ భాగం భూ సమస్యలపై ఇవ్వడంపై స్పందించిన కలెక్టర్ రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సమస్యలపై క్షేత్రస్థాయికి వెళ్లి స్వయంగా పరిశీలించి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన పాలన అందించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలు వినిపించిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డితోపాటు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.