Share News

పదేపదే వినతులు రాకూడదు

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:26 PM

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమానికి పదే పదే అవే వినతులు వస్తున్నాయని, క్షేత్ర స్థాయిలో వాటిపై అధికారులు దృష్టిసారించి పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ పీ శ్రీనివాసులు అన్నారు.

పదేపదే వినతులు రాకూడదు
అర్జీలను స్వీకరిస్తున్న జేసీ శ్రీనివాసులు

క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలి

జేసీ శ్రీనివాసులు

మీకోసంకు రాని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక

మార్కాపురం కలెక్టరేట్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమానికి పదే పదే అవే వినతులు వస్తున్నాయని, క్షేత్ర స్థాయిలో వాటిపై అధికారులు దృష్టిసారించి పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ పీ శ్రీనివాసులు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో జరిగిన మీకోసంలో ఆయన ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. మొత్తం 93 అర్జీలు రాగా, వాటిలో 39 రెవెన్యూకు సంబంధించినవి, మిగిలిన 54 ఫిర్యాదులు వివిధ సమస్యలపై వచ్చాయి. కార్యక్రమానికి జిల్లా అధికారులంతా హాజరు కావాల్సి ఉండగా చాలా శాఖల నుంచి అధికారులు కనిపించలేదు. ఆ శాఖలకు చెందిన సమస్యలపై మాట్లాడేందుకు ప్రయత్నించిన జేసీకి అధికారుల గైర్హాజరైనట్లు అర్ధమైంది. హాజరుకాని అధికారులపై చర్య లు తప్పవని ఆయన హెచ్చరించారు. పట్టణంలోని ఎస్సీ కాంప్లెక్స్‌ గదుల్లో దళితులకు అన్యాయం జరిగిందని దళిత నాయకులు జాన్‌ డేవిడ్‌, పిల్లి సుబ్బులు వినతిపత్రం సమర్పించారు. ఒకే కుటుంబానికి చెందిన వారికి మూడు గదులు కేటాయించరని చెప్పారు. గతేడాది నవంబర్‌ 26న ఐదు గదులకు దరఖాస్తులు కోసం ప్రకటన మాత్రమే చేశారని, నేటికీ అతీగతీ లేకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. గ్యాస్‌ కొరతను తీర్చాలని మార్కాపురంలోని హోటల్‌, స్వీట్‌ షాపుల యజమానులు జేసీకి వినతిపత్రం ఇచ్చారు. పెద్దారవీడు మండలం ఏనుగుల దిన్నెపాడు గ్రామంలో గాలెయ్యకు చెందిన సర్వే నెంబర్‌ 46లో గల 10.17 ఎకరాల భూమిని తెలంగాణకు చెందిన ఆలపాటి కృష్ణవేణి పేరుతో అక్రమంగా ఆన్‌లైన్‌ చేశారని ఫిర్యాదు చేశారు. ఇడుపూరుకు చెందిన మల్లయ్యది ఆత్మహత్య కాదని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు జేసీకి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు పి. ప్రభాకర్‌, శివరామిరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 11:26 PM