Share News

ఫెయిలైన వారికి రెమెడియల్‌ క్లాసులు

ABN , Publish Date - May 05 , 2026 | 02:09 AM

ఉమ్మడి జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు సోమవారం నుంచి రెమెడియల్‌ క్లాసులు ప్రారంభించారు. ఈనెల 25 నుంచి మొదలయ్యే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు వారిని సంసిద్ధులను చేయనున్నారు.

ఫెయిలైన వారికి రెమెడియల్‌ క్లాసులు
గిద్దలూరులోని జడ్పీ హైస్కూల్‌లో రెమిడియల్‌ తరగతులను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

సప్లిమెంటరీ పరీక్షలకు సంసిద్ధం

పది విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా బోధన

ఒంగోలు విద్య, మే 4 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు సోమవారం నుంచి రెమెడియల్‌ క్లాసులు ప్రారంభించారు. ఈనెల 25 నుంచి మొదలయ్యే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు వారిని సంసిద్ధులను చేయనున్నారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పదోతరగతి పరీక్షలకు మొత్తం 28,438 మంది హాజరుకాగా 25,857 మంది ఉత్తీర్ణులయ్యారు. 2,581 మంది ఫెయిలయ్యారు. ఉత్తీర్ణులు కాని వారిలో బాలురు 1,490 మంది, బాలికలు 1,091 మంది ఉన్నారు. వీరందరినీ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు ఆయా సబ్జెక్టుల పరీక్షల తేదీల వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులకు రెమిడియల్‌ క్లాసుల నిర్వహణను పాఠశాల విద్య గుంటూరు ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. టీచర్లు అందుబాటులో లేనిచోట్ల సంబంధిత పాఠశాలల హె చ్‌ఎంలు తరగతులు నిర్వహిస్తున్నారు. ఫెయిలైన విద్యార్థులందరూ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా శిక్షణ ఇవ్వాలని మార్కాపురం కలెక్టర్‌ విజయసునీత ఆదేశించారు. శిక్షణ తరగతులను ఆకస్మింగా తనిఖీ చేస్తానని, ప్రతిరోజూ ఎంతమంది హాజరైంది తెలియ జేయాలని ఆదేశించారు.

Updated Date - May 05 , 2026 | 02:10 AM