పొగాకు రైతులకు ఊరట
ABN , Publish Date - Sep 23 , 2026 | 02:44 AM
తీవ్ర ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న పొగాకు రైతులకు కాస్తంత ఊరట కలగనుంది. ఈ సీజన్‌లో అనుమతికి మించి ఉత్పత్తి చేసిన పంటను అపరాధ రుసుం లేకుండా కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది.
ఈ సీజన్‌కు అపరాధ రుసుం లేకుండానే కొనుగోలుకు ఓకే
రాష్ట్ర ప్రభుత్వ సూచనలపై కేంద్రం సానుకూల స్పందన
మంత్రులు అచ్చెన్నాయుడు, బాలవీరాంజనేయస్వామిలను
కలిసి కృతజ్ఞతలు తెలిపిన రైతు ప్రతినిధులు
ఒంగోలు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : తీవ్ర ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న పొగాకు రైతులకు కాస్తంత ఊరట కలగనుంది. ఈ సీజన్‌లో అనుమతికి మించి ఉత్పత్తి చేసిన పంటను అపరాధ రుసుం లేకుండా కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. దీనిపై రైతుల్లో నెలకొన్న ఆందోళన, అలజడిని గుర్తించి గత రెండేళ్ల వలే ఈ ఏడాది కూడా అపరాధ రుసుం లేకుండా కొనాలని రాష్ట్రప్రభుత్వం తరఫున మంత్రులు పొగాకు బోర్డుకు సూచించారు. తదనుగుణంగా బోర్డు అధికారులు కేంద్రానికి నివేదించగా అందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ అంగీకరించింది. అఽధికారికంగా కేంద్రం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉండగా మంగళవారం కొండపి మండలం పెద్దకండ్లగుంటలో జరిగిన సభలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అపరాధ రుసుం రద్దు అంశాన్ని ప్రకటించడంతో రైతులు ఊరట చెందుతున్నారు.
మంత్రుల కృషితో కదలిక
ఈ ఏడాది మార్కెట్ తీరు, అధిక పంట ఉత్పత్తి కారణంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితితో కేంద్రం అధిక పంట ఉత్పత్తిపై భారీగా పెనాల్టీలు విధించాలన్న నిర్ణయానికి వచ్చిన విషయం విదితమే. వచ్చే సీజన్‌కు పంట ఉత్పత్తిని గణనీయంగా తగ్గించడంతోపాటు పెనాల్టీలు ఈ సీజన్ నుంచే అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలను బోర్డును కోరింది. తదనుగుణంగా గతనెల రెండో వారంలోనే అధికోత్పత్తిపై సుమారు 10శాతం పెనాల్టీలు విధింపు ప్రతిపాదనలను బోర్డు అదికారులు సిద్ధం చేశారు. ఆ సమాచారంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రులు స్వామి, గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. రాష్ట్రప్రభుత్వం ద్వారా బోర్డు అధికారులతో మాట్లాడి అపరాధ రుసుం లేకుండానే కొనుగోలుకు ప్రతిపాదనలు పంపించారు. అయితే నెల గడిచినా దానిపై కేంద్రం నుంచి స్పష్టత రాలేదు. ఈ లోపు దక్షిణాదిలో అధికారిక పంట కొనుగోలు పూర్తయి మూడు కేంద్రాలలో వేలం ఆగిపోవడం, మరో రెండింటిలో కూడా అదే పరిస్థితి ఏర్పడనుందన్న విషయాన్ని వెలుగులోకి తెస్తూ ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో మరో సంక్షోభం పేరుతో ప్రచురించిన కథనంతో ఇటు రాష్ట్రప్రభుత్వం, అటు బోర్డు అధికారులు కదిలి పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర అంగీకారంపై హర్షం
ఈ నేపథ్యంలో అపరాధ రుసుం లేకుండానే ఈ సీజన్‌లో కూడా పొగాకు కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. ఈమేరకు కేంద్రం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు బోర్డు అధికారులకు సమాచారం అందింది. అదే విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కొండపి పర్యటనలో ప్రకటించారు. ఇదిలాఉండగా అపరాధ రుసుం లేకుండా కొనుగోలుకు కేంద్రం అంగీకరించేలా రాష్ట్రప్రభుత్వం, మంత్రులు చేసిన కృషికి రైతుప్రతినిదులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వివిధ వేలం కేంద్రాలకు చెందిన పొగాకు రైతు ప్రతినిదులు మంగళవారం తూర్పునాయుడుపాలెంలో మంత్రులు అచ్చెన్నాయుడు, డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బుచ్చయ్య చౌదరిలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎరువులు, బ్యాంకు రుణాలు ఇతర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.