Share News

పొగాకు రైతుకు ఊరట

ABN , Publish Date - Jul 29 , 2026 | 02:56 AM

పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కదిలాయి. ధరల లోటు భర్తీ పేరుతో లోగ్రేడ్‌ పంటకు కిలోకు రూ.20 వంతున ఇవ్వాలని నిర్ణయించాయి. అలాంటి పొగాకు రాష్ట్రంలో 94 మిలియన్‌ కిలోలు ఉన్నట్లు సమాచారం.

పొగాకు రైతుకు ఊరట

లోగ్రేడ్‌కు రూ.188 కోట్లు

కిలోకు రూ.20 వంతున బోనస్‌

ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

94 మిలియన్‌ కిలోలకు ధర లోటు భర్తీ

అన్నిరకాల గ్రేడ్‌లకు బేస్‌ ధరలు

వేలం కేంద్రాల వారీగా పర్యవేక్షణకమిటీలు

కీలకంగా వ్యవహరించిన మంత్రులు డోలా, గొట్టిపాటి

పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కదిలాయి. ధరల లోటు భర్తీ పేరుతో లోగ్రేడ్‌ పంటకు కిలోకు రూ.20 వంతున ఇవ్వాలని నిర్ణయించాయి. అలాంటి పొగాకు రాష్ట్రంలో 94 మిలియన్‌ కిలోలు ఉన్నట్లు సమాచారం. ఆ మొత్తం పంట ద్వారా దాదాపు రూ.188కోట్ల మేర రైతులకు దక్కనుంది. అలాగే మేలు, మీడియం, లోగ్రేడ్‌ వంటి అన్నిరకాలకు బేస్‌ ధరలను కూడా నిర్ణయించారు. అలా రైతులకు మేలు చేకూరేలా చేయడంలో జిల్లా ప్రజాప్రతినిధుల కృషి ఎంతో ఉంది. మొత్తం వ్యవహారంలో జిల్లాకు చెందిన మంత్రులు స్వామి, రవికుమార్‌ కీలకంగా వ్యవహరించారు. సమస్య తన వద్దకు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టారు.

ఒంగోలు, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : తీవ్ర సంక్షోభంలో ఉన్న పొగాకు రైతులకు కొంత మేర ఊరట కలిగించేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల రైతుల వద్ద నిల్వ ఉన్న లోగ్రేడ్‌ పొగాకు పంటకు సుమారు రూ.188కోట్లు బోనస్‌గా దక్కనుంది. ఈ ఏడాది ఆరంభం నుంచే పొగాకు మార్కెట్‌ తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొన్న విష యం విదితమే. గతంలో ఎన్నడూలేని విధంగా సగానికిపైగా బేళ్లు నిత్యం నోబిడ్‌లు కావడంతోపాటు రోజురోజుకూ ధరలు తగ్గిపోతూ అసలు కొనుగోళ్లు జరగవేమో అన్నంత ఆందోళ నకు రైతులు గురయ్యారు. ఆ పరిస్థితిపై ఒకవైపు ఎస్‌కేఎం ఆధ్వర్యంలో రైతుసంఘాల ఆందోళనలు, మరోవైపు వేలం కేంద్ర రైతు కమిటీ ప్రతినిధుల వినతులతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కదిలారు. ప్రధానంగా మంత్రులు డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి గొట్టిపాటి రవికుమార్‌ చొరవ చూపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా సీఎం చంద్రబాబు సత్వరం స్పందించారు.

కేంద్ర మంత్రుల దృష్టికి సమస్య

పొగాకు సమస్యపై దాదాపు 40రోజుల క్రితం స్వయంగా సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన పలు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అవి అమలులోకి రాలేదు. దీంతో కేంద్రమంత్రుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ అంశంపై రాష్ట్ర మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపారు. ఆసమయంలో రైతుల ఇక్కట్లను, మార్కెట్‌ సంక్షోభాన్ని కేంద్రమంత్రులకు వివరించి వారు సానుకూలంగా స్పందించేలా చేయడంలో జిల్లాకు చెందిన మంత్రులు సఫలీకృతులయ్యారు. తదనుగుణంగా కేంద్రప్రభుత్వ వాణిజ్య ఉన్నతాధికారులు ఐదు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చి సీఎంను కలిశారు. ఆ సమయంలో మరోసారి విస్తృత చర్చ సాగింది. పంట ఉత్పత్తి అధికంగా ఉండటం, విదేశీ మార్కెట్‌ సానుకూలంగా లేకపోవడంతో మెరుగైన ధరలు ఇచ్చి కొనేందుకు వ్యాపారులు ముందుకు వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వాలు గుర్తించాయి.

ధర లోటు భర్తీకి బోనస్‌

ధరల లోటు భర్తీ కోసం బోనస్‌, వడ్డీ లేని రుణాలు, ఇతరత్రా అంశాలను పరిశీలనలోకి తీసుకున్నారు. అదేసమయంలో ఇకనుంచి అయినా గ్రేడ్‌లో బేస్‌ ధర (అంతకన్నా తక్కువకు కొనకుండా) నిర్ణయించి, ధర లోటుకు బోనస్‌ ఇవ్వాలని ఆ సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్‌ స్వామి, గొట్టిపాటి పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో మేలురకం కిలో రూ.240, మీడియం గ్రేడ్‌కు రూ.190, లోగ్రేడ్‌కు రూ.110ను బేస్‌ ధరలుగా నిర్ణయించారు. లోగ్రేడ్‌ కొంత మెరుగ్గా ఉండే స్టెమ్‌రకానికి కిలో రూ.160 తగ్గకుండా కూడా నిర్ణయించినట్లు సమాచారం. అదేసమయంలో రైతుల వద్ద నిల్వ ఉన్న పంటలో లోగ్రేడ్‌కు ధర లోటు కింద కిలోకు రూ.20 ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. రాష్ట్రంలో 240 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తి కాగా ఇప్పటి వరకూ వ్యాపారులు సుమారు 40 మిలియన్‌ కిలోలు కొనుగోలు చేశారు. మిగిలిన పంటలో 94 మిలియన్‌ కిలోలు లోగ్రేడ్‌, 60 మిలియన్‌ కిలోలకుపైగా మేలు రకం, మరో 45 మిలియన్‌ కిలోలకు పైన మీడియం గ్రేడ్‌ ఉంటుందని అంచనా వేశారు.

వేలం కేంద్రాల వారీ కమిటీలు

మొత్తం 94 మిలియన్‌ కిలోల లోగ్రేడ్‌కు కిలో రూ.20 వంతున రూ.188 కోట్లు బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే బేస్‌ ధరల పరిశీలన, గ్రేడ్‌ల మార్పు చేయకుండా పర్యవేక్షణకు వేలం కేంద్రాల వారీ కమిటీలు నియమించనున్నారు. వీటిలో పొగాకు బోర్డు అధికారులతోపాటు వ్యవసాయ, మార్కెటింగ్‌ అధికారులు, రైతు, వ్యాపార ప్రతినిధులు ఉండనన్నారు. కాగా పెద్దమొత్తంలో బోనస్‌ రైతులకు దక్కేలా చొరవ తీసుకున్న సీఎంకు జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్‌ స్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేసిన నిరంతర సమీక్షలు, కేంద్రంతో చర్చల వల్ల ఈ మేలు చేకూరిందన్నారు. జిల్లాలోని వేలాది మంది పొగాకు రైతులకు దీని వల్ల ఊరట లభించనుందన్నారు.

Updated Date - Jul 29 , 2026 | 02:56 AM