సర్పంచ్‌లకు ఉపశమనం
ABN , Publish Date - Feb 21 , 2026 | 01:59 AM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 15వ ఆర్థికసంఘం నిధులను వినియోగించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సర్పంచ్‌ల పదవీకాలం ముగింపు దశకు రావడం, రాష్ట్రవ్యాప్తంగా ఆర్థికసంఘం నిధులను ఇష్టారీతిన ఖర్చుచేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఇటీవల ఆంక్షలు విధించింది.
15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అవకాశం
ఎం.బుక్ నమోదు చేసిన పనులకు చెల్లింపులు
గతంలో మాదిరిగా ఓచర్లతో బిల్లులకు అవకాశం ఇవ్వని ప్రభుత్వం
డిప్యూటీ ఎంపీడీవోల పరిశీలన తర్వాతే చెల్లింపు
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 15వ ఆర్థికసంఘం నిధులను వినియోగించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సర్పంచ్‌ల పదవీకాలం ముగింపు దశకు రావడం, రాష్ట్రవ్యాప్తంగా ఆర్థికసంఘం నిధులను ఇష్టారీతిన ఖర్చుచేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఇటీవల ఆంక్షలు విధించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిధుల వినియోగ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ ఆంక్షలను సడలించింది. ఏప్రిల్ 2వతేదీన సర్పంచ్‌ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో పంచాయతీల్లో ఆర్థికసంఘం నిఽధులు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రధానంగా పారిశుధ్య నిర్వహణకు, చెత్తసంపద కేంద్రాలకు, కార్మికులు(గ్రీన్ అంబాసిడర్లు)కు జీతాలు, విద్యుత్ బిల్లులు, తాగునీటి సరఫరాకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ఇప్పటికే పంచాయతీల్లో సర్పంచ్‌లు పలురకాల పనులను చేపట్టారు. కేంద్రప్రభుత్వం 15వ ఆర్థికసంఘం నిధులను ఉమ్మడి జిల్లాకు సుమారు రూ.40కోట్లకుపైగా వచ్చాయి. పంచాయతీల్లో పనులు చేసిన తర్వాత ఇంజనీరింగ్ అధికారులు మెజర్‌మెంట్స్ బుక్స్(ఎం.బుక్) నమోదుచేస్తే అటువంటి బిల్లులు చెల్లింపులు చేయాల్సి ఉంది. అందుకు భిన్నంగా బిల్లులు చెల్లింపులు చేస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఆ పనులు కూడా జనవరిలో జరిగిన పంచాయతీ సమావేశాల్లో చేసిన తీర్మానాల మేరకే నిధులను వినియోగించుకోవాలి. అందుకు భిన్నంగా వినియోగిస్తే పంచాయతీ కార్యదర్శులే బాధ్యత వహించాల్సి వస్తుంది. గతంలో పంచాయతీల్లో చేసిన పనులకు వోచర్ల ద్వారా బిల్లులు చెల్లించేవారు. అయితే ఇప్పుడు మండలస్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసినట్లు సమాచారం. బిల్లులు చెల్లింపుల సమయంలో మండల స్థాయిలో ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు పరిశీలన చేయాలి. ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాలతో సర్పంచ్‌లకు భారీఊరట కలగనుంది.