రివర్షన్ టీచర్లకు హైకోర్టులో ఊరట
ABN , Publish Date - Jul 28 , 2026 | 03:04 AM
స్కూలు అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి పొంది వివిధ కారణాలతో రివర్షన్ తీసుకొని మళ్లీ సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హైకోర్టులో ఊరట లభించింది. ఉపాధ్యాయుల జిల్లాల విభజనకు సంబంధించిన సీనియారిటీలో ఎస్జీటీలుగా వీరి మొత్తం సర్వీసులను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
మొత్తం సర్వీసు లెక్కింపునకు ఆదేశాలు
ఒంగోలు విద్య, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : స్కూలు అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి పొంది వివిధ కారణాలతో రివర్షన్ తీసుకొని మళ్లీ సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హైకోర్టులో ఊరట లభించింది. ఉపాధ్యాయుల జిల్లాల విభజనకు సంబంధించిన సీనియారిటీలో ఎస్జీటీలుగా వీరి మొత్తం సర్వీసులను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో జిల్లాలో సీనియారిటీ జాబితాల్లో అట్టడుగున ఉన్న వీరికి న్యాయం జరిగినట్లు అయింది. విచారణను కోర్టు ఆగస్టు 20కి వాయిదా వేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయులను విభజిత జిల్లాలకు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వివిధ జిల్లాలకు కేటాయింపునకు వారు ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులో సీనియారిటీనే ప్రాతిపదికగా తీసుకోమన్నారు. ఈ విషయంలో స్థానికత, ఇతర అంశాలను పక్కనపెట్టారు. విభజనలో కేవలం ఉద్యోగుల లెంగ్త్ ఆఫ్ సర్వీసు (మొత్తం సర్వీసు)ను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఈనేపథ్యంలో మధ్యలో స్కూలు అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి పొంది వివిధ కారణాలతో రివర్షన్ తీసుకొని మళ్లీ ఎస్జీటీలుగా పనిచేస్తున్న వారిని సీనియారిటీ జాబితాల్లో చిట్టచివరన చేర్చారు. పాఠశాల విద్య రాష్ట్ర అధికారులు వీరిని జాబితాల్లో చివరనే చేర్చమన్నారు. దీంతో తమకు జరుగుతున్న అన్యాయంపై వారు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు వీరికి ఊరట కలిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.