Share News

మూగజీవాలకు ఊరట

ABN , Publish Date - Mar 29 , 2026 | 02:37 AM

వేసవిలో మూగజీవాలకు ఎట్టకేలకు ఊరట దక్కింది. పల్లెపండుగ కింద నిర్మించిన నీటి తొట్టెలు వాటి దాహార్తిని తీరుస్తున్నాయి. ఎండలు మండుతున్న సమయంలో పశువులు, గొర్రెలు, ఇతర పశుసంపద తాగేందుకు నీరు కూడా దొరక్క తల్లడిల్లడం, వాటి పరిస్థితిని చూసి పశుపోష కులు ఆవేదన చెందడం పూర్వ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిత్యకృత్యం.

మూగజీవాలకు ఊరట
అర్ధవీడు మండలం బసిరెడ్డిపల్లిలో నీటి తొట్టె వద్ద దాహార్తిని తీర్చుకుంటున్న గొర్రెల మంద

వేసవిలో దాహార్తిని తీర్చేందుకు పల్లె పండుగ కింద నీటి తొట్టెలు

ఉపాధి హామీ పథకం నిధులతో పూర్వ జిల్లాలో 1,057 నిర్మాణం

పశ్చిమ ప్రాంతంలో అధికం

పలుచోట్ల ట్యాంకర్లతో నీటి సరఫరా

పశువులు, గొర్రెలకు లభిస్తున్న నీరు

పశుపోషకులకు ఎంతో ఉపయుక్తం

ఒంగోలు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : వేసవిలో మూగజీవాలకు ఎట్టకేలకు ఊరట దక్కింది. పల్లెపండుగ కింద నిర్మించిన నీటి తొట్టెలు వాటి దాహార్తిని తీరుస్తున్నాయి. ఎండలు మండుతున్న సమయంలో పశువులు, గొర్రెలు, ఇతర పశుసంపద తాగేందుకు నీరు కూడా దొరక్క తల్లడిల్లడం, వాటి పరిస్థితిని చూసి పశుపోష కులు ఆవేదన చెందడం పూర్వ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిత్యకృత్యం. ప్రస్తుతం ఏర్పా టైన మార్కా పురం జిల్లాలో ఆ పరిస్థితి మరింత అధికం. అలాంటి మూగజీవాలకు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పొలాల్లో ప్రత్యేకించి చెరువులు, కుంటలు ఉండని ప్రాంతాలు, వాగులు, వంకలు ప్రవాహాలు లేని చోట్ల నిర్మించిన తొట్టెలు ఎంతో ఉపయోగపడు తున్నాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం పల్లెపండుగ నీటి తొట్టెలు మూగజీవాలకు బాగా ఉపయోగపడుతున్నాయి. వీటికి స్థానికంగా వేసిన బోర్లు, పంట కుంటల ద్వారా.. కొన్నిచోట్ల ట్యాంకర్ల ద్వారా అధికారులు నీరు సరఫరా చేసి నింపుతుండటంతో పొలాల్లో తిరిగే పశువుల, గొర్రెలు, మేకలు దాహార్తిని తీర్చుకుంటున్నాయి. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కోటా నిధులతో నీటి తొట్టెలను పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా డ్వామా పర్యవేక్షణలో నిర్మించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉంది. చాలాచోట్ల బోర్లు అడుగంటి, బావులు ఎండిపోయి, రక్షిత నీటి పథకాలు సైతం పనిచేయని పరిస్థితి నెలకొంది. నాటి ప్రకాశం జిల్లా పశ్చిమప్రాంతంగా ఉన్న ప్రస్తుత మార్కాపురం జిల్లాతోపాటు వర్షాధార ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ప్రభుత్వం ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నీటిసరఫరాకు చర్యలు చేపట్టింది.

వేసవి వేళ నీటి కష్టాలు

కోట్లాది రూపాయాలు ఖర్చుచేసి ప్రజా అవసరాలకు నీటి సరఫరా చేస్తుండగా పశువుల నీటి ఇక్కట్ల అంశం తెరపైకి వచ్చింది. దీంతో పశువులకు కూడా నీటిని అందించేందుకు అవసరమైన గ్రామాల్లో అధికంగా ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. దాని వల్ల ఇళ్ల వద్ద పశువులు ఉన్నప్పుడు ఏదో ఒకస్థాయిలో నీటి సమస్యకు ఉపశమనం కలుగుతున్నప్పటికీ పగటిపూట పొలాలకు మేత కోసం వెళ్లేవాటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నీరన్నది పొలాల్లో దొరకని పరిస్థితి అనేక ప్రాంతాల్లో ఉంది. ఎండ తీవ్రత వేళ నీటి కోసం పశుసంపద పడుతున్న అగచాట్లు, పోషకుల ఆవేదన చెందడాన్ని ప్రభుత్వం గుర్తించింది. పొలాల్లో, పొలాలకు రాకపోకలు సాగించే డొంకలు, రోడ్ల పక్కన, అలాగే నీరు లేకుండా ఎండిపోయిన కుంటల పరిసరాల్లో తొట్టెలు నిర్మించి వాటికి నీటి సరఫరా చేయడం ద్వారా మూగజీవాల దాహార్తిని తీర్చాలని నిర్ణయించింది. అందుకోసం పల్లెపండుగ పనుల్లో భాగంగా ఉపాధి పథకం మెటీరియల్‌ కోటా నిధులను ప్రజోపకరమైన పనులకు వినియోగించడంలో ముందుచూపుతో వ్యవహరించే సీఎం చంద్రబాబునాయుడు దూరదృష్టితో ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఆ శాఖకు చెందిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి పథకం మెటీరియల్‌ నిధులతో నీటి తొట్టెల నిర్మాణానికి చర్యలు చేపట్టారు.

ఉమ్మడి జిల్లాలో 1,057 తొట్టెల నిర్మాణం

ఒక్కో నీటి తొట్టె నిర్మాణానికి ప్రభుత్వం రూ.20వేలు కేటాయించింది. పూర్వపు ప్రకాశం జిల్లాలో ఉన్న 38 మండలాల్లోని 527 గ్రామాల్లో 1,057 తొట్టెలను నిర్మించారు. వాటిలో అధికంగా పశ్చిమప్రాంతంలోనే ఉన్నాయి. గరిష్ఠంగా ఎర్రగొండపాలెం మండలంలో 71 నిర్మించారు. వెలిగండ్లలో 49, పొదిలిలో 48, పుల్లలచెరువులో 47, దొనకొండ, పెద్దారవీడు, పీసీపల్లి, ముండ్లమూరు, కనిగిరి, అర్ధవీడు, మార్కాపురం, త్రిపురాంతకం తదితర మండలాల్లో 40 కన్నా అధికంగా ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడి అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. నిర్మాణాలు చేపట్టినప్పుడు కొన్ని గ్రామాల్లో మాత్రమే వేసవిలో వినియోగంలోకి రాగా ఈ ఏడాది ఎండలు పెరుగుతున్న తరుణంలో వాటి వినియోగంపై అధికారులు దృష్టి సారించారు. పూర్తిస్థాయిలో నీటి తొట్టెల వినియోగం జరిగేలా నాలుగైదు రోజుల నుంచి పర్యవేక్షిస్తున్నారు. కొన్నింటికి బోర్లు, పంపులతో నీటి సరఫరాకు అవకాశం ఉండగా మరికొన్నింటిని ట్యాంకర్ల ద్వారా నింపుతున్నారు. దీంతో గేదెలతోపాటు గొర్రెలు, ఇతర పశుసంపద పొలాల్లో మేతకు వెళ్లిన సమయంలో దాహార్తి తీర్చుకొని ఉపశమనం పొందుతున్నాయి. గతంలో మూగజీవాలకు నీరు దొరక్క వాటి పరిస్థితిని చూసి ఆవేదన చెందే పశుపోషకులు ప్రస్తుత పరిస్థితితో ఊరట చెందుతున్నారు.

Updated Date - Mar 29 , 2026 | 02:38 AM