Share News

తౌషిక్‌ మృతిపై మళ్లీ దర్యాప్తు

ABN , Publish Date - Apr 05 , 2026 | 02:32 AM

మండలంలోని మూలగుంటపాడు పంచా యతీ పరిధి శ్రీచైతన్య నవోదయ పాఠశాలలో కనిగిరికి చెందిన 6వ తరగతి విద్యార్థి షేక్‌ సయ్యద్‌ తౌషిక్‌ (11) అనుమానాస్పద మృతిపై మళ్లీ దర్యాప్తు ప్రారంభమైంది. ఆ కేసు విచారణలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారంటూ బాలుడి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఏఎస్పీ స్థాయి అధికారికి దర్యాప్తు అప్పగించాలని, కేసును పునర్విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది.

తౌషిక్‌ మృతిపై మళ్లీ దర్యాప్తు
విద్యార్థి మృతి చెందిన స్కూల్‌ పక్కన సీసీ ఫుటేజీని పరిశీలించి వస్తున్న ఏఎస్పీ సౌజన్య

హైకోర్టు ఆదేశాలతో విచారణాధికారిగా నెల్లూరు ఏఎస్పీ నియామకం

వెంటనే రంగంలోకి దిగిన సౌజన్య

స్కూల్‌ యాజమాన్యం, వార్డెన్‌, పోలీసులు, డాక్టర్‌ ఫోన్లు సీజ్‌

సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం

సింగరాయకొండ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మూలగుంటపాడు పంచా యతీ పరిధి శ్రీచైతన్య నవోదయ పాఠశాలలో కనిగిరికి చెందిన 6వ తరగతి విద్యార్థి షేక్‌ సయ్యద్‌ తౌషిక్‌ (11) అనుమానాస్పద మృతిపై మళ్లీ దర్యాప్తు ప్రారంభమైంది. ఆ కేసు విచారణలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారంటూ బాలుడి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఏఎస్పీ స్థాయి అధికారికి దర్యాప్తు అప్పగించాలని, కేసును పునర్విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో వేగంగా కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ జిల్లాలో ప్రస్తుతం ఏఎస్పీ స్థాయి అధికారి లేకపోవడంతో గుంటూరు రేంజ్‌ ఐజీ ఆదేశాల మేరకు నెల్లూరు ఏఎస్పీ సౌజన్యను విచారణాధికారిగా నియమించారు. ఆమె వెంటనే రంగంలోకి దిగారు. విద్యార్థి మృతిచెందిన స్కూల్‌ హాస్టల్‌ను శనివారం పరిశీలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కూల్‌ యాజమాన్యం, వార్డెన్‌లు, ఇరువురు ఇంగ్లీషు టీచర్లు, తౌషిక్‌ స్నేహితులను ఏఎస్పీ సుదీర్ఘంగా విచారించారు. అనంతరం శ్రీచైతన్య పాఠశాల సమీపంలో ఉన్న ఐటీఐ కళాశాల, వివేకానంద హైస్కూల్‌ ప్రాంగణాల్లో ఉన్న సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. తౌషిక్‌ మృతిచెందిన తర్వాత తొలుత తీసుకెళ్లిన స్థానిక ఆర్‌ఎంపీని, ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యుడిని విచారించారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌లకు కూడా సీజ్‌ చేశారు. హైకోర్టు సూచనల మేరకు స్కూల్‌ కరస్పాండెంట్‌ సుజాత, ఆమె భర్త రమణారెడ్డి, కుమారులు, కోడలు, ఇద్దరు వార్డెన్లు, ఇరువురు మహిళా టీచర్లు, సీఐ హజరత్తయ్య, ఎస్సై బి.మహేంద్ర ఫోన్లను ఏఎస్పీ సీజ్‌ చేశారు. అనంతరం విద్యార్థి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన ఒంగోలు రిమ్స్‌కు వెళ్లారు. హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుబ్బారావు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Apr 05 , 2026 | 02:32 AM