తొమ్మిదేళ్లుగా రిజిస్ట్రేషన్‌లు నిలిచాయి!
ABN , Publish Date - Feb 01 , 2026 | 02:14 AM
నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములకు విముక్తి కల్పించకపోవడంతో ఏడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2016లో మండలంలోని తాళ్లూరు, బొద్దికూరపాడు, నాగంబొట్లపాలెం, లక్కవరం, రామభద్రాపురం, సోమవరప్పాడు, బెల్లంకొండవారిపాలెం, శివరాంపురంలో గ్రామకంఠంకు చెందిన పలు సర్వే నంబర్లలోని గృహాలను దేవుని ఆస్తి అన్నట్లుగా దేవదాయశాఖ అధికారులు 22(ఏ) నిషేధిత జాబితాలోకి చేర్చ డంతో సమస్య జఠిలమైంది.
నిషేధిత జాబితాలో చేర్చిన దేవదాయ శాఖ
ప్రజా ప్రభుత్వంపై ఏడు గ్రామాల ప్రజల ఆశలు
తాళ్లూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములకు విముక్తి కల్పించకపోవడంతో ఏడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2016లో మండలంలోని తాళ్లూరు, బొద్దికూరపాడు, నాగంబొట్లపాలెం, లక్కవరం, రామభద్రాపురం, సోమవరప్పాడు, బెల్లంకొండవారిపాలెం, శివరాంపురంలో గ్రామకంఠంకు చెందిన పలు సర్వే నంబర్లలోని గృహాలను దేవుని ఆస్తి అన్నట్లుగా దేవదాయశాఖ అధికారులు 22(ఏ) నిషేధిత జాబితాలోకి చేర్చ డంతో సమస్య జఠిలమైంది. తాళ్లూరులోని గ్రామ కంఠం సర్వే నంబర్ 268లోని ఆస్తులు శ్రీవేణుగోపాల, రామలింగేశ్వరస్వామి, శ్రీఆంజనేయస్వాము లివిగా, నాగంబొట్లపాలెం గ్రామకంఠం 505 సర్వే నంబర్‌లోని ఆస్తులను శ్రీసీతారామస్వామి, బెల్లంకొండవారిపాలెం గ్రామకంఠం 9 సర్వే నంబర్‌లోని ఆస్తులను సీతారామస్వామి ఆస్తులుగా నమోదు చేశారు. అలాగే బొద్దికూరపాడు గ్రామకంఠ సర్వే నంబర్ 114లోని ఆస్తులను శ్రీసోమేశ్వర, జ్వాలాముఖి అమ్మవార్లు, అదేగ్రామంలో 115లోని గ్రామకంఠ ఆస్తులను శ్రీమాధవస్వామి, లక్కవరం గ్రామకంఠం 193/3 శ్రీమల్లేశ్వర వీరభద్రయ్య, శ్రీరామలింగేశ్వరస్వాముల స్వాముల ఆస్తులుగా చేర్చారు. సోమవరప్పాడు గ్రామకంఠం సర్వే నంబర్16లోని ఆస్తులను శ్రీవీరాంజనేయ స్వామి, శివరాంపురం గ్రామకంఠం సర్వే నంబర్ 110లోని ఆస్తులను శ్రీవేణుగోపాల, ప్రతాపఆంజనేయస్వామి పేర్లమీద పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో నమోదు చేశారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేస్తూ దేవదాయశాఖ అధికారులు దర్శి సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయానికి లిఖితపూర్వకంగా నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా పట్టా భూముల క్రయవిక్రయాలు సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలో నిలిచిపోయాయి.
సర్వే చేసి పంపినా మార్చలేదు
ప్రజల పట్టా భూములను దేవుని ఆస్తి అన్నట్లుగా దేవదాయశాఖ అధికారులు 22(ఏ) నిషేధిత చట్టం జాబితాలో చేర్చడంవల్ల జరుగుతున్న కష్టనష్టాలను గుర్తించిన ప్రజాప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. 22(ఏ)జాబితా నుంచి గ్రామకంఠం భూములను తొలగించింది. దీంతో ఏడు గ్రామాలకు చెందిన పట్టాభూమి హక్కుదారులు తమ సమస్య పరిష్కారమవుతుందని ఆశించారు. ఆ దిశగా దేవదాయ, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నిర్వహించిన రెవెన్యూ గ్రామ సదస్సుల్లో ఆయా గ్రామాల ప్రజలు తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని లిఖితపూర్వక ఫిర్యాదుచేశారు. దీంతో తహసీల్దార్, మండల సర్వేయర్, వీఆర్‌వో, విలేజ్ సర్వేయర్లు ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఆలయ విస్తీర్ణాలను సర్వే చేసి సబ్ డివిజన్ చేశారు. మిగిలిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని జిల్లా అధికారులకు గతేడాది ఫిబ్రవరిలో నివేదికలు అందజేశారు. ఇప్పటివరకు పట్టా భూములు నిషేధిత జాబితా నుంచి తొలగలేదు. దీంతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. సొంత భూములు 22(ఏ) నిషేధిత జాబితాలో ఉండటంతో తీవ్రఇబ్బందులు పడుతున్నామని ఆయాగ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని 22-ఏ నిషేధిత జాబితా నుంచి తమ సొంత ఆస్తులకు విమక్తి కల్గించాలని ఏడు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.