రామాయపట్నం పోర్టు తీరప్రాంత పరిధి కుదింపు
ABN , Publish Date - Jun 24 , 2026 | 02:58 AM
జిల్లాకు తలమానికంగా, ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఆయువుపట్టుగా భావిస్తున్న రామాయపట్నం పోర్టు తీరప్రాంత పరిధిని కుదిస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణ యం తీసుకుంది. మంగళవారం అమరావతిలో జరిగిన కేబినెట్ సమా వేశం పోర్టుపై పలు కీలక తీర్మానాలు చేసింది.
నిర్మాణ, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు ప్రైవేటుకు?
పోర్టు ఆపరేటర్ నియామకానికి మంత్రి మండలి ఆమోదం
ఈ మార్పులతో ప్రత్యేక గుర్తింపు వస్తుందని అభిప్రాయం
కందుకూరు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు తలమానికంగా, ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఆయువుపట్టుగా భావిస్తున్న రామాయపట్నం పోర్టు తీరప్రాంత పరిధిని కుదిస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణ యం తీసుకుంది. మంగళవారం అమరావతిలో జరిగిన కేబినెట్ సమా వేశం పోర్టుపై పలు కీలక తీర్మానాలు చేసింది. పోర్టుకు గతంలో ఉన్న 51 కి.మీల తీరప్రాంత అధికార పరిధిని 15 కి.మీకు కుదించేందుకు వీలుగా గతంలో ఇచ్చిన జీవోలకు సవరణ చేస్తూ గెజిట్ విడుదలకు అనుమతించింది. రమారమి 2,538 ఎకరాల విస్తీర్ణంలో చేస్తున్న రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు గత ప్రభుత్వంలో అరబిందో ఇన్‌ఫ్రా కాంట్రాక్టు సంస్థగా వ్యవహరించగా.. ప్రస్తుతం నిర్మాణ పనుల కాంట్రాక్టు బాధ్యతలను నవయుగ సంస్థ చూస్తున్న విషయం విదితమే. అయితే అనూహ్యంగా రామాయపట్నం పోర్టు డిజైను, అభివృద్ధి నిర్వహణ, పర్యవేక్షణ, ఫైనాన్స్ బాధ్యతలను చూసేందుకు వీలుగా పోర్టు ఆపరేటర్ నియామకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన బిడ్డర్లను ఆకర్షించేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీచేసేందుకు ఏపీ మారిటైమ్ బోర్డుకు అనుమతిచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రప్రభుత్వ ఆధీనంలో బ్యాంకుల ఆర్థిక సహాయంతో నిర్మాణం జరుపుకుంటున్న పోర్టు ప్రైవేటుగా మారేందుకు లైన్‌క్లియర్ అయినట్టు భావిస్తున్నారు. తాజా నిర్ణయాలతో రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా ప్రతిపాదించిన బీపీసీఎల్ భారీ పెట్రోలియం రిఫైనరీ ప్లాంటు, పోర్టు ఆధారిత అనుబంధ పరిశ్రమల స్థాపన వేగవంతమవు తుందని మంత్రిమండలి అభిప్రాయపడింది. ఈ పోర్టు ద్వారా రాబోయే 50 ఏళ్లలో రూ.20వేల కోట్ల పెట్టుబడులకు అవకాశాలు వస్తాయని, 25 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించి స్థానిక ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తోంది. రామాయపట్నం పోర్టుకు ఉన్న రైల్వే, జాతీయ రహదారుల అనుసంధానం వలన సరుకు రవాణా ఖర్చులు తగ్గించడమే గాక సమయం ఆదా అవుతుందని పేర్కొంటోంది. రాష్ట్ర సరిహద్దులోని తెలంగాణ, తూర్పు మహారాష్ట్ర, తూర్పు కర్ణాటకలోని పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానాన్ని మెరుగుపరచడంలో రామాయపట్నం పోర్టు కీలకం కానుందని కేబినెట్ పేర్కొంది.