ఆంక్షల కొరడా
ABN , Publish Date - Jan 28 , 2026 | 02:32 AM
ఉపాధి హామీ మెటీరియల్ కోటాపై కేంద్రం ఆంక్షలు పెట్టింది. ఇప్పటి వరకూ ఆ నిధుల వినియోగంపై ఉన్న నిబంధనలను కఠినతరం చేసింది. పది పనులు మించి జరుగుతున్న గ్రామాల్లో కొత్తవి చేపట్టే అవకాశం లేకుండా చేసింది. అందులో గృహ నిర్మాణం, పండ్ల తోటల పెంపకానికి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఇతర పనులు పెద్దసంఖ్యలోనే ఉండనున్నాయి.
ఉపాధి హామీ మెటీరియల్ కోటాపై కేంద్రం మెలిక
పది పనులు మించితే కొత్తవి కుదరదు
ఇప్పటికే ఒక్కో పంచాయతీలో వందలాది పనులు మంజూరు
తాజాగా రూ.65కోట్లతో రోడ్లు, డ్రెయిన్‌ల నిర్మాణంపై అయోమయం
ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఆంక్షలు
నిధుల వినియోగంపై గందరగోళం
ఉపాధి హామీ మెటీరియల్ కోటాపై కేంద్రం ఆంక్షలు పెట్టింది. ఇప్పటి వరకూ ఆ నిధుల వినియోగంపై ఉన్న నిబంధనలను కఠినతరం చేసింది. పది పనులు మించి జరుగుతున్న గ్రామాల్లో కొత్తవి చేపట్టే అవకాశం లేకుండా చేసింది. అందులో గృహ నిర్మాణం, పండ్ల తోటల పెంపకానికి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఇతర పనులు పెద్దసంఖ్యలోనే ఉండనున్నాయి. ఇప్పటికే ఒక్కో గ్రామంలో వందలాది పనులు మెటీరియల్ కోటా కింద, కూలీలకు ఉపాధి కల్పన కోసం మంజూరు చేశారు. వాటిలో కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. ఇలాంటి సమ యంలో కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇటీవల జిల్లాలో ఉపాధి మెటీరియల్ కోటా కింద మంజూ రు చేసిన రూ.65కోట్ల పనులకు బ్రేక్ పడనుంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే కేంద్రం ఇలాంటి చర్యలు చేపట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒంగోలు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పథకం మెటీరియల్ కోటా నిధులతో చేపట్టే పనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. నిధుల వినియోగంపై కొన్ని కఠిన నిబంధనలు విధించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ఈ తరహా నిబంధనలు విధించడంతో కోట్లాది రూపాయలతో చేపట్టే సీసీరోడ్లు, డ్రెయిన్‌లు ఇతర పనులు చేపట్టడంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు ఉపాధి పథకం ద్వారా కూలీలకు గ్రామాల్లో పనులు కల్పించి వారికి వేతనాలు లభించేలా చూసేవారు. అదేసమయంలో జిల్లా యూనిట్‌గా ఏడాదిలో లభించే వేతన మొత్తంలో మూడింట రెండొంతులు మెటీరియల్ కోటా పనులు మంజూరు చేస్తున్నారు. అలా ఎనిమిది నియోజకవర్గాలతో కూడిన పూర్వపు జిల్లాలో గతేడాది వరకు కూలీలకు పనులు కల్పించడం ద్వారా సుమారు రూ.300 కోట్లు వేతన రూపంలో లభిస్తే మరో రూ.200కోట్లు మెటీరియల్ కోటా కింద దక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.180 కోట్ల మేర మెటీరియల్ కోటా నిధులు అందుబాటులో ఉంటాయని అధికారులు అంచనా వేశారు.
అధికశాతం పురోగతిలో..
మెటీరియల్ కోటా నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైయిన్‌లు ఇతర నిర్మాణాలు చేపడతారు. అలాగే ప్రభుత్వ పథకాలైన పండ్లతోటలు, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతలు, పొలాల్లో నీటి కుంటల తవ్వకాలు, గృహ నిర్మాణ పనులు, మినీగోకులాల నిర్మాణాలు ఇలా అనేక పనులు చేస్తారు. ప్రతిపనిని ఒక యూనిట్‌గా తీసుకుం టారు. అలా ఎన్ని పనులు అయినా ఆయా గ్రామాల్లో చేసేవారు. అలాంటిది తాజాగా పది పనులు మించి జరుగుతున్న గ్రామాల్లో కొత్తవి చేపట్టరాదని కేంద్రం ఆంక్షలు విధించింది. అయితే పూర్వపు జిల్లా పరిధిలో అన్ని గ్రామాల్లోనూ అంతకు పదిరెట్లు పనులు మంజూరై ఉన్నాయి. ఉదాహరణకు ఒక గ్రామంలో పది పంట కుంటలు, నాలుగైదు మినీగోకులాలు, రెండు, మూడు సిమెంట్ రోడ్లు, డ్రెయిన్‌లు, ఒక్కో కుటుంబానికి ఇచ్చే ఇంకుడు గంతలు ఇలా పెద్దసంఖ్యలో మంజూరు చేశారు. అలాంటి వాటిలో అధికశాతం పురోగతిలో ఉన్నాయి.
పెండింగ్ బిల్లుల చెల్లింపులు
మరోవైపు గత టీడీపీ ప్రభుత్వ (2024-29) కాలంలో చేసిన పనులకు పెండింగ్ బిల్లులు చెల్లింపు కోసం ఇటీవల కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ పునఃప్రారంభించారు. అందులోనూ వందలాది పనులు నమోదై ఉన్నాయి. అలా ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా పెద్దసంఖ్యలో పనులు మంజూరై ఉన్నాయి. కేంద్రం నిర్ణయంతో తాజాగా జిల్లా యంత్రాంగం మెటీరియల్ కోటా కింద మంజూరు చేసిన పనులు చేపట్టడానికి వీలు కావడం లేదు. గత ఆర్థిక సంవత్సరానికి రూ.180 కోట్ల మెటీరియల్ కోటా నిధులు అందుబాటు అంచనా వేసిన యంత్రాంగం పెండింగ్ బిల్లులకు రూ.65 కోట్లు, పండ్ల తోటలు, హౌసింగ్ ఇతర పథకాల పనులకు రూ.45 కోట్లు పోను రూ.65 కోట్లకు సీసీరోడ్లు, డ్రైన్లు ఇతరత్రా పనులు మంజూరు చేశారు. అందులో ఎనిమిది నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.6కోట్ల వంతున రూ.45 కోట్లు, సీఎం, డిప్యూటీ సీఎం హామీలకు ఇతర ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలకు మరో రూ.20 కోట్లు మంజూరు చేశారు.
ఇలాగైతే మురిగిపోతాయ్
పూర్వపు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోని 171 గ్రామాల్లో పనులు మంజూరు చేయగా తాజాగా కేంద్రం విధించిన ఆంక్షలతో ఏ ఒక్క గ్రామంలోనూ ఆ పనులు చేపట్టే అవకాశం లేకుండాపోయింది. రూ.లక్షతో చేసినా, రూ.10 లక్షలతో చేసినా, రూ.2లక్షలతో నిర్మించే మినీగోకులం అయినా ఒక పనిగా గుర్తించడంతో అయోమయం నెలకొంది. ఏ గ్రామంలో చూసినా పనులు పెద్దసంఖ్యలోనే ఉండటం ఇబ్బందికరంగా మారింది. మంజూరైన పనులలో కొద్దిగా చేసిన వాటిని రద్దుచేసి ఆ స్థానంలో కొత్తవి చేపట్టాలన్నా గతంలో ఒకశాతం చేసిన వాటిని సైతం రద్దుచేసే అవకాశం ఉండగా ప్రస్తుతం 30శాతంపైగా చేసిన వాటిని మాత్రమే పని పూర్తయినట్లుగా నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో తాజాగా మంజూరైన రూ.65కోట్ల పనులపై గందరగోళం ఏర్పడింది. ఆర్థిక సంవత్సరం ముగింపులో ఈ నిబంధనలతో ఆ పనులు చేపట్టలేక మెటీరియల్ కోటా నిఽధులు మురిగిపోయే పరిస్థితి నెలకొంది. కేంద్రం ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది.