వైద్యుల పోస్టుల భర్తీకి శ్రీకారం
ABN , Publish Date - May 13 , 2026 | 03:11 AM
ప్రజలకు మెరు గైన వైద్యసేవలు అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా వైద్యుల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఖాళీగా ఉన్న స్థానాల్లో మెడికల్ ఆఫీసర్‌లను నియమిస్తోంది.
వైద్యశాఖలో ఇప్పటికే 13 ఖాళీలు పూర్తి
మరో తొమ్మిది భర్తీ చేసేందుకు చర్యలు
అర్బన్ హెల్త్ సెంటర్‌లలో ఖాళీలపైనా దృష్టి
ఒంగోలు కలెక్టరేట్, మే 12(ఆంధ్రజ్యోతి) : ప్రజలకు మెరు గైన వైద్యసేవలు అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా వైద్యుల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఖాళీగా ఉన్న స్థానాల్లో మెడికల్ ఆఫీసర్‌లను నియమిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 28మంది మెడికల్ ఆఫీసర్లు ఉన్నత విద్య కోసం వెళ్లారు. దీంతో ప్రజలకు వైద్యసేవలు అందించడం ఇబ్బంది కరంగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు పని చేయాల్సి ఉంది. ఒకరు పీహెచ్‌సీలో ఉండి ఓపీలు చూస్తే, మరొకకు ఆ ఆరోగ్య కేంద్రం పరిధిలో అత్యవసర పనులు, ప్రభుత్వం నిర్వహించే వైద్యశిబిరాలను నిర్వహించాల్సి ఉంది. అయితే జిల్లా నుంచి 28మంది వైద్యులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు సెలవుపై వెళ్లడంతో ఆయా పీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇటీవల ప్రభుత్వం మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీలో భాగంగా ప్రకాశం జిల్లాకు 13మందిని కేటాయించింది. వారందరినీ డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఖాళీలు ఉన్న పీహెచ్‌సీలకు నియమించారు. మరో తొమ్మిది మంది జిల్లాకు రావాల్సి ఉంది. ఆ ఖాళీలను కూడా వారంలో భర్తీచేయనున్నట్లు సమాచారం. అర్బన్ హెల్త్ సెంటర్‌లలో ఉన్న ఖాళీలను కూడా వైద్యశాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ఆ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేయనున్నట్లు సమాచారం.