త్వరలో టీచర్ల పునర్విభజన
ABN , Publish Date - Mar 22 , 2026 | 01:36 AM
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పునర్విభజన (హేతుబద్ధీకరణ), బదిలీలకు ప్రభుత్వం తొలి అడుగు వేసింది. వెంటనే ఈ ప్రక్రియ ను చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది.
విద్యాశాఖ అధికారుల కసరత్తు
మార్చి 1 నాటికి ప్రామాణికం
ఒంగోలు విద్య, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఉపాధ్యాయుల పునర్విభజన (హేతుబద్ధీకరణ), బదిలీలకు ప్రభుత్వం తొలి అడుగు వేసింది. వెంటనే ఈ ప్రక్రియ ను చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది. ప్రభుత్వం గత సంవత్సరం అమలులోకి తెచ్చిన రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం-25 ప్రకారం ఏటా బదిలీలు చేపట్టాల్సి ఉంది. అంతకు ముందు విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని పాఠశాలల్లో టీచర్ల పునర్విభజనను చేపట్టి అవసరం ఉన్న స్కూళ్లకు సర్దుబాటు చేయాలి. బదిలీల నియంత్రణ చట్టంలో ఈ నిబంధన ప్రకారం ముందుగా పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల పునర్విభజనకు కసరత్తు ప్రారంభించింది. అందుకోసం ఈనెల 23న పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య, పనిచేస్తున్న టీచర్ల వివరాలతో డీఈవో కార్యాలయాల్లోని ఎస్‌ఎస్‌వో, ఏపీవోలను పంపాలని విద్యాశాఖ అదనపు డైరెక్టర్ సుబ్బారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుల పునర్విభజనకు మార్చి 1 నాటి విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్చి 1 నాటికి పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య, టీచర్ల వివరాలతో ఏఎస్‌వో, ఏపీవోలు సమావేశానికి హాజరుకావాల్సి ఉంటుంది. ఆ సమావేశంలో పాఠశాలల్లో టీచర్ల క్యాడర్ స్ర్టెంత్‌ను ధ్రువీకరిస్తారు.