కీలక అంశాలతో సిద్ధం
ABN , Publish Date - Sep 10 , 2026 | 03:22 AM
రెండు రోజులపాటు అమరావతిలోని సచివాల యంలో జరగనున్న కలెక్టర్ల సదస్సులో జిల్లాకు చెందిన పలు కీలక అంశాలపై నివేదికలతో కలెక్టర్ రాజాబాబు పాల్గొంటున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్రస్థాయిలో సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తోంది.
అమరావతిలో నేడు, రేపు కలెక్టర్ల సదస్సు
నివేదికలతో హాజరవుతున్న రాజాబాబు
గత సదస్సు అనంతరం పల్లెనిద్ర,
జలధార, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం
రేపు శాంతిభద్రతలపై సమీక్షకు
వెళ్లనున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
ఒంగోలు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : రెండు రోజులపాటు అమరావతిలోని సచివాల యంలో జరగనున్న కలెక్టర్ల సదస్సులో జిల్లాకు చెందిన పలు కీలక అంశాలపై నివేదికలతో కలెక్టర్ రాజాబాబు పాల్గొంటున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్రస్థాయిలో సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తోంది. అలా ఇప్పటి వరకు ఏడుసార్లు ఏర్పాటు చేయగా, ఎనిమిదోసారి బుధ, గురువారాల్లో జరగనుంది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో ప్రభుత్వం తరఫున మొత్తం యం త్రాంగం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అన్నిశాఖల ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాకు చెందిన నివేదికలతో హాజరుకానున్నారు. సమావేశపు అజెండా నాలుగు రోజుల క్రితమే ఉన్నతాధికారుల నుంచి కలెక్టర్లకు అందింది. తదనుగుణంగా జిల్లాలో ఆయా శాఖల ద్వారా అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పురోగతి, తక్షణ, దీర్ఘకాలిక ప్రజా సమస్యలు, ప్రధానంగా జిల్లా ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల మెరుగునకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలతో కలెక్టర్ రాజాబాబు హాజరవుతున్నారు.
నాలుగు రోజులుగా సమీక్షలు
రెండు రోజుల సదస్సులో తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను సీఎం సమీక్షించనున్నారు. అలాగే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విజన్-2047 లక్ష్యాల సాధన ప్రణాళికలు, జిల్లా స్థూల ఉత్పత్తి పెంపు చర్యలు, ప్రజా వినతులు, వివిధ సంక్షేమ పథకాలు, సాగు, తాగునీరు, విద్య, వైద్యం ఇలా అన్ని కీలక శాఖలతోపాటు ప్రస్తుతం ఎల్‌నినోతో నెలకొన్న పరిస్థితులు, దానిని అధిగమించేందుకు చర్యలపై సమీక్షించి ప్రభుత్వపరంగా సూచనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజులుగా జిల్లా అధికారులతో కలెక్టర్ రాజాబాబు సమీక్షించి నివేదికలను రూపొందించారు. వాటిని ముందుగానే ప్రభుత్వానికి పంపారు. అలాగే గత కలెక్టర్ల సదస్సు అనంతరం ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని పల్లెనిద్ర పేరుతో ప్రత్యేకంగా చేపట్టారు. నాలుగు నెలల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మూడు, నాలుగు గ్రామాల్లో నిర్వహించారు.
నియోజకవర్గాల వారీ ప్రత్యేక గ్రీవెన్స్‌లు
నియోజకవర్గాల వారీగా మండల కేంద్రాల్లో ప్రత్యేక గ్రీవెన్స్‌ల నిర్వహణ, స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణతోపాటు పారిశ్రామిక రంగం అభివృద్ధిపై కలెక్టర్ రాజాబాబు దృష్టి సారించారు. అందుకోసం భారీస్థాయిలో బిజినెస్ ఎలైట్ పేరుతో ఒంగోలులో ప్రత్యేక సదస్సును నిర్వహించారు. మరోవైపు జిల్లాకు జలధార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టి నిర్దేశించగా దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఉపాధి పథకం భాగస్వామ్యంతో పెద్దఎత్తున పనులు సాగేలా కృషి చేశారు. ఈ అంశాలన్నింటినీ కూడా సదస్సులో రాజాబాబు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. రెండో రోజైన శుక్రవారం సాయంత్రం రాష్ట్రంలో శాంతిభద్రతలపై జరిగే సమీక్షకు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు హాజరవుతున్నారు. ఇక ప్రభుత్వం తరఫున జిల్లాకు చెందిన ఇరువురు మంత్రులు డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్ రెండు రోజుల సదస్సులో పాల్గొనున్నారు.