మహానాడుకు ముస్తాబు
ABN , Publish Date - May 27 , 2026 | 03:30 AM
తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఇటు ప్రకాశం, అటు మార్కాపురం జిల్లాలోని తమ్ముళ్లు సిద్ధమయ్యారు. పండుగ వాతావరణంలో కార్యక్రమం జరిగేలా అన్ని ప్రాంతాలను ముస్తాబు చేశారు.
క్లస్టర్ స్థాయిలో నేడు, రేపు కార్యక్రమాలు
ప్రకాశంలో 65, మార్కాపురం జిల్లాలో 43 చోట్ల నిర్వహణ
కేంద్ర కార్యాలయం నుంచి వర్చువల్‌గా అధినేతతో సహా అందరి ప్రసంగాలు
అన్ని క్లస్టర్ల వద్దకు హాజరయ్యేలా కీలక నేతల షెడ్యూల్
ఒంగోలు, మే 26 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఇటు ప్రకాశం, అటు మార్కాపురం జిల్లాలోని తమ్ముళ్లు సిద్ధమయ్యారు. పండుగ వాతావరణంలో కార్యక్రమం జరిగేలా అన్ని ప్రాంతాలను ముస్తాబు చేశారు. గతానికి భిన్నంగా ఈసారి మహానాడును క్లస్టర్ స్థాయిలో కార్యకర్తలు హాజరయ్యేలా అధిష్ఠానం నిర్ణయించడంతో తదనుగుణంగా ఆయా నియోజకవర్గాల్లో చర్యలు చేపట్టారు. ప్రకాశంలో 65 క్లస్టర్లు, మార్కాపురం జిల్లాలో 43 క్టస్టర్లు ఉన్నాయి. ఈనెల 27, 28 తేదీల్లో రెండు రోజులపాటు సాగే మహానాడుకు మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌తోపాటు మొత్తం పొలిట్ బ్యూరో జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. తొలిరోజైన బుధవారం ఉదయం పార్టీ జెండా ఆవిష్కరణ, ఎన్టీఆర్‌కు నివాళి, ప్రతినిధుల నమోదు, జాతీయ అధ్యక్షుడి ప్రసంగం ఉంటాయి. రెండో రోజైన గురువారం ఎన్టీఆర్ జయంతి వేడుకలతోపాటు వివిధ రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, వాటి ఫలితాలను విశ్లేషిస్తూ తీర్మానాలు, చర్చలు జరగనున్నాయి.
సభల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
కేంద్ర కార్యాలయంలో మహానాడు కార్యక్రమం జరిగే సమయంలో క్లస్టర్ల వారీ ఏర్పాటుచేసిన ప్రత్యేక ప్రాంగణాల నుంచి కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇప్పటికే టీడీపీలో క్లస్టర్ల వ్యవస్థను పటిష్టంగా అమలు చేస్తున్నారు. తదనుగుణంగానే ప్రస్తుతం స్థానికంగా క్లస్టర్ల వారీ ప్రత్యేకంగా మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లాలో సగటున 20వేల నుంచి 25వేల ఓటర్లకు ఒక క్లస్టర్ చొప్పున ఆరు నియోజకవర్గాల పరిధిలో 65 క్లస్టర్లు ఉన్నాయి. ఒంగోలు నియోజకవర్గంలో 12 క్లస్టర్లు ఉండగా ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలో 11, కొండపిలో 10, కందుకూరులో 10, అద్దంకిలో 12, దర్శి నియోజకవర్గం 10 క్లస్టర్లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలు, కొన్ని మండల కేంద్రాల్లో అందుబాటులో ఉన్న కల్యాణ మండపాలు, ఇతర హాళ్లను తీసుకొని ఆ క్లస్టర్ పరిధిలో కార్యకర్తలందరూ అక్కడి నుంచి మహానాడుకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. అలాంటి హాళ్లు అందుబాటులో లేని చోట ఆయా క్లస్టర్లలోని అన్ని గ్రామాలకు కూడలిగా ఉండే కీలకమైన గ్రామంలో బహిరంగ ప్రదేశాల్లో సభ నిర్వహణ కోసం ప్రత్యేక చర్యలు తీసకున్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కార్యక్రమం కొనసాగనుండటం, ఎండల తీవ్రత నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు
పార్టీ ఆదేశాల మేరకు ఆయా క్లస్టర్ల స్థాయిలో నిర్వహించే మహానాడుకు ఆ పరిధిలోని కుటుంబ సాధికార సభ్యులు(కేఎస్‌ఎస్), పోలింగ్ బూత్‌లు, యూనిట్ ఇన్‌చార్జిలు హాజరుకావాలి. వారితోపాటు ఈ బాధ్యతల్లో లేని ఆ ప్రాంతానికి చెందిన వివిధస్థాయి మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ, వార్డు కమిటీల అధ్యక్షులు ఇతరత్రా అందరూ రావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఉదయం 9 గంటలకల్లా సమావేశ ప్రాంగణం వద్ద నుంచి మైటీడీపీ యాప్‌లో హాజరు నమోదు చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఇళ్ల వద్ద నుంచి లేదా మరోచోట ఉండి హాజరైనట్లు నమోదుకు అవకాశం లేకుండా వారికి సంబంధించిన క్లస్టర్ సభాప్రాంగణానికి వంద మీటర్లలోపు మాత్రమే యాప్‌లో నమోదు జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక వందల సంఖ్యలో పార్టీశ్రేణులు క్లస్టర్ స్థాయి కార్యక్రమానికి హాజరుకానుండగా అందరూ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమన్ని ప్రత్యక్షంగా వీక్షించేలా అన్నిచోట్ల భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, పసుపు తోరణాలతో ముస్తాబు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ బోజనాలు, అల్పాహారం ఎండలకు ఇబ్బందిపడకుండా మజ్జిగ, చల్లటి మంచినీరు వంటి వాటిని అవసరానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం వారంరోజులుగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల నేతృత్వంలో మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జిలతో పలు దఫాలుగా సమీక్షలు చేసి అప్రమత్తం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ సభ్యులు ఒకరిని అధిష్ఠానం పరిశీలకులుగా నియమించారు. వారు కూడా వచ్చి నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించారు.
మార్కాపురం జిల్లాలో 43 క్లస్టర్లు
మార్కాపురం జిల్లాలో పసుపు పండుగకు అంతా సిద్ధమైంది. టీడీపీ డిజిటల్ మహానాడుకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. క్లస్టర్ ఇన్‌చార్జిలు తమ పరిధిలోని పార్టీ శ్రేణులను ప్రత్యేకంగా ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలో 11 క్లస్టర్లు, కనిగిరిలో 11, గిద్దలూరులో 10, ఎర్రగొండపాలెంలో 11 మొత్తం 43 క్లస్టర్లు ఉన్నాయి. మహానాడు వీక్షించేందుకు 43 చోట్ల సభా వేదికలను సిద్ధం చేశారు. ఏర్పాట్లను కూడా జిల్లాలోని ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు స్వయంగా పర్యవేక్షించారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పడటం, వెలిగొండ ప్రాజెక్టు పనుల వేగవంతం ఇతర పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఆ ప్రాంత ప్రజల్లో ప్రత్యేకించి టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహంతో మహానాడుకు సిద్ధమయ్యారు.