రెండో విడత పరిహారానికి సిద్ధం
ABN , Publish Date - Jul 29 , 2026 | 02:52 AM
వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం రెండో విడత చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. నిర్వాసితుల కోసం ప్రభుత్వం రూ.950కోట్లను కేటాయించడంతోపాటు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్ వద్దకు వచ్చి తొలి విడత పరిహారాన్ని నెల క్రితం నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశారు.
ఆన్‌లైన్‌లో వెలిగొండ నిర్వాసిత కుటుంబాల నమోదు
ఇటీవల 2,557 మంది ఖాతాల్లో పరిహారం జమ
మిగిలిన వారి వివరాలు అప్‌లోడ్ చేస్తున్న అధికారులు
మార్కాపురం, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం రెండో విడత చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. నిర్వాసితుల కోసం ప్రభుత్వం రూ.950కోట్లను కేటాయించడంతోపాటు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్ వద్దకు వచ్చి తొలి విడత పరిహారాన్ని నెల క్రితం నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశారు. ఇందులో భాగంగా 2,557 కుటుంబాలకు రూ.301 కోట్లు అందాయి. రెండో విడత పరిహారం చెల్లించేందుకు మిగిలిన నిర్వాసిత కుటుంబాల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులకు సంకేతాలు రావడంతో ఆప్రక్రియను ముమ్మరం చేశారు. ఈ నెల 26 నాటికి 2,478 కుటుంబాలకుసంబంధించిన వివరాలను అధికారులు అప్‌లోడ్ చేశారు. మరో 921 కుటుంబాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించారు. రెండు రోజుల్లో ఆ వివరాలను కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. మిగిలిన 1,365 కుటుంబాలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, ఇతర వివరాలు సమగ్రంగా లేకపోవడంతో వాటిని ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచారు. ఆ వివరాలు అంది అప్‌లోడ్ చేయగానే వారి ఖాతాల్లో పరిహారం జమయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. సీఎం చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం తొలి విడత రూ.301 కోట్ల నగదు జమ కావడంతో మిగిలిన మొత్తం కూడా తమకు త్వరలోనే అందుతుందన్న నమ్మకాన్ని నిర్వాసితులు వ్యక్తం చేస్తున్నారు.