Share News

పురపోరుకు రెఢీ

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:24 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ విషయంలో టీడీపీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. మునిసిపల్‌ ఎన్నికలు ఈ డిసెంబరులోపు జరగవన్న భావనలో వైసీపీ నాయకులు వేచిచేసే ధోరణితో ఉన్నారు.

పురపోరుకు రెఢీ

ఎన్నికలపై ముందస్తు వ్యూహంతో టీడీపీ

రిజర్వేషన్లు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

వాయిదా పడతాయన్న ఆశలో వైసీపీ

జగన్‌ విదేశీ టూర్‌తో పెరిగిన నమ్మకం

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ విషయంలో టీడీపీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. మునిసిపల్‌ ఎన్నికలు ఈ డిసెంబరులోపు జరగవన్న భావనలో వైసీపీ నాయకులు వేచిచేసే ధోరణితో ఉన్నారు. అవి వాయిదాపడతాయని ఆశ పెట్టుకున్నారు. టీడీపీ మాత్రం అవేమీ పట్టించుకోకుండా దూకుడు మీద ఉంది. రిజర్వేషన్లు, తదనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ప్రారంభించింది. దీంతో పురపాలక సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

రాష్ట్రంలో కార్పొరేషన్‌ మేయర్‌, మునిసి పల్‌ చైర్మన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఎన్నికల కమిషన్‌ కూడా అవస రమైన ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబరులో పురపోరు ఉండే అవకాశాలు పూర్తిస్థాయి లో కనిపిస్తున్నాయి. అనివార్య పరిస్థితులు ఎదురైతే నవంబరు మొదటి వారంలోనైనా జరగొచ్చు. అంతకుమించి ఆలస్యమయ్యే అవకాశం లేదు. అదే విషయాన్ని కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న టీడీపీ ఆపార్టీ నేతలకు స్పష్టం చేసింది. అంతేకాక రిజర్వేషను,్ల తదనుగుణంగా అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌కు, కందుకూరు, మార్కాపురం, చీరాల ఏగ్రేడ్‌ మునిసిపాలిటీలకు కిందిస్థాయిలోని అద్దంకి, చీమకుర్తి, దర్శి, కనిగిరి, గిద్దలూరు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందుగా ఈ ఎన్నికల నిర్వహణకే ఎన్నికల కమిషన్‌ కూడా సిద్ధమవడంతో రిజర్వేషన్ల నిర్ధారణ, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది.

రెండు అంశాలపై టీడీపీ కసరత్తు

తెలుగుదేశం పార్టీ అటు రిజర్వేషన్లు ఇటు, అభ్యర్థుల ఎంపికపై వ్యూహాత్మకంగా కసరత్తు చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారుకు ఆపార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమేరకు టీడీపీ అధికారికంగా నియమిం చుకున్న ప్రత్యేక సంస్థ ద్వారా అన్నిచోట్లా ప్రత్యేక సర్వేను చేయించింది. ప్రధానంగా చైర్మన్‌ పదవి ఏ సామాజికవర్గానికి రిజర్వు చేసేందుకు అవకాశం ఉంది, రాజకీయంగా కలిసొచ్చే అవకాశాలేమిటి తదితర అంశాలపై వారు ఒక సర్వే చేశారు. అంతేకాక ఆయా సామాజికవర్గాల వారీగా టీడీపీ తరఫున పోటీకి నిలిపే అవకాశం ఉన్న అభ్యర్థులు ఎవరన్న దానిపై ఒక పరిశీలన చేశారు. ఆ మేరకు అన్ని మునిసిపాలిటీల చైర్మన్ల రిజర్వేషన్లపై ఒక నివేదికను అధిష్ఠానంకు అందించినట్లు తెలిసింది.

ఒంగోలు రిజర్వేషనే కీలకం

ఒంగోలు మేయర్‌ పదవి ఈసారి ఓసీ కేటగిరీలో ఉంచాలన్న నివేదిక టీడీపీ అధిష్ఠానానికి చేరింది. గతంలో ఎస్సీ మహిళకు మేయర్‌ పదవిని కేటాయిం చారు. ఈసారి మారే అవకాశం ఉంది. ఒంగోలు మేయర్‌ పదవిని ఓసీ జనరల్‌ లేక మహిళకు కేటా యిస్తే టీడీపీ నుంచి కాపు సామాజికవర్గం అభ్యర్థిని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో టీడీపీ నుంచి కాపులకు సరైన ప్రాతి నిథ్యం లేదన్న అపోహలు ఉన్న నేపథ్యంలో అధిష్ఠానం ఒంగోలు మేయర్‌ పదవిని వారికి కేటాయించే అంశంపై ప్రత్యేకంగా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఆ పార్టీ అనుబంధ సంస్థ సర్వే నిర్వహించి కాపులలో టీడీపీకి అంకితమై పనిచేసే కొందరి పేర్లు కూడా అధిష్ఠానానికి పంపినట్లు తెలిసింది. ఇక మార్కా పురం మునిసిపాలిటీ గతంలో ఓసీ జనరల్‌ కింద ఉన్నందున తిరిగి అదే కేటగిరీకి రిజర్వు అయ్యే అవకా శాలు తక్కువగా ఉన్నాయి. ఓసీ మహిళ లేక బీసీలకు చైర్మన్‌ స్థానం కేటాయించే అవకాశం ఉందని, ఆ ప్రకా రమే ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది. ఓసీ అయితే ఆర్యవైశ్యులకు, బీసీ అయితే ముస్లింలకు సీటు ఇచ్చే విధంగా ఆ బృందం కొన్ని పేర్లను కూడా ప్రతిపాదించింది. కందుకూరుకు గతంలో ఎన్నికలు జరగనందున అప్పట్లో రిజర్వు అయిన ఓసీ జనరల్‌నే కొనసాగించాలన్న ప్రతిపాదన అధిష్ఠానానికి చేరింది. ఆ మేరకు కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తూ కొన్నిపేర్లు అధిష్ఠానానికి ఇచ్చారు. చీరాల మునిసిపల్‌ చైర్మన్‌ పదవిని ఈసారి ఓసీకి రిజర్వు చేయాలన్న ప్రతిపాదన సిద్ధమైంది. ఆ మేరకు టీడీపీ ఆర్యవైశ్య సామాజికవర్గం నుంచి అభ్యర్థిని రంగంలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అద్దంకి మునిసిపల్‌ చైర్మన్‌ పదవి గతంలో రెండుసార్లు ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఈ పర్యాయం ఓసీ జనరల్‌ లేక బీసీలకు కేటాయించాలన్న ప్రతిపాదన అధిష్ఠానం దృష్టిలో ఉంది. ఓసీ జనరల్‌ అయితే ఆర్యవైశ్యులకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

మిగిలిన మునిసిపాలిటీలపైనా పరిశీలన

చీమకుర్తి మునిసిపల్‌ చైర్మన్‌ పదవి ఓసీ జనరల్‌, కానిపక్షంలో ఎస్టీకి కేటాయించాలన్న ప్రతిపాదన అధిష్ఠానంకు చేరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఎస్సీ అయినందున అక్కడ కమ్మ అభ్యర్థిని రంగంలోకి దించాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది. అయితే అక్కడ ఆ సామాజికవర్గంలో గ్రూపుల ప్రభావం అధికంగా ఉంది. ఏ ఇద్దరు నాయకులు కలిసి ఒక బాటలో నడిచే ప్రసక్తే లేదు. దీంతో ఓసీ జనరల్‌ కింద వస్తే ఆర్యవైశ్య సామాజిక అభ్యర్థిని రంగంలో దించాలని ఆ పార్టీలోని నియోజకవర్గ స్థాయి నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కమ్మ సామాజికవర్గ నాయకులందరినీ ఏకతాటిపై నడిపే ప్రయత్నాలకు కొందరు శ్రీకారం పలికారు. కనిగిరి మునిసిపల్‌ చైర్మన్‌ పదవి గతంలో బీసీకి కేటాయించినందున ఈసారీ ఓసీ జనరల్‌ కింద రిజర్వు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీసీ మహిళకు రిజర్వు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ముస్లిం, ఆర్యవైశ్యుల్లో టీడీపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. దర్శి మునిసిపల్‌ చైర్మన్‌ పదవి గతంలో ఓసీ జనరల్‌ కింద ఉన్నందున ఈ పర్యాయం ఓసీ మహిళ లేక బీసీలకు రిజర్వు చేసే అంశంపై పరిశీలన జరుగుతోంది. ఓసీకి రిజర్వు అయితే తిరిగి నారపుశెట్టి పాపారావు కుటుంబీకులనే రంగంలోకి దించాలని టీడీపీ భావిస్తోంది. బీసీలకు రిజర్వు అయితే యాదవ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. పొదిలి నగర పంచాయతీకి కోర్టు అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో చైర్మన్‌ పదవి ఎస్సీలకు రిజర్వు అయినప్పటికీ ఎన్నికలు జరగనందున ఈ పర్యాయం అదే రిజర్వేషన్‌ కొనసాగే అవకాశం ఉంది. టీడీపీ నుంచి ఒకే ఒక పేరు అధిష్ఠానం పరిశీలిస్తుండటం గమనార్హం. గిద్దలూరు మునిసిపల్‌ చైర్మన్‌ పదవి గత రెండుసార్లు బీసీ జనరల్‌కు రిజర్వు అయినందున ఈ పర్యాయం ఓసీ జనరల్‌కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీలకు రిజర్వు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఓసీకి కేటాయిస్తే మొదటి ప్రాధాన్యం కాపులకు, ఆపై ఆర్యవైశ్యులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో టీడీపీ అధిష్ఠానం ఆయా సామాజిక వర్గాల వారీ అభ్యర్థులపై పరిశీలన ప్రారంభించింది.

చివర్లో ఎమ్మెల్యేలతో చర్చలు

రిజర్వేషన్లు, తదనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన టీడీపీ అధిష్ఠానం ఆఖరులో స్థానిక ఎమ్మెల్యే, పార్టీ ఇన్‌చార్జులతో చర్చించి ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇటు రిజర్వేషన్లు, అటు అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జుల అభిప్రాయం కీలకం కాబోతుంది. ఆయితే ఆర్థిక వనరులే ప్రామాణికంగా కొత్త వారిని రంగంలోకి దించాలంటే కుదరదన్న సంకేతం అధిష్ఠానం ఇప్పటికే ఇచ్చింది.

కోర్టు నిర్ణయాలపై వైసీపీ ఆశలు

స్థానిక ఎన్నికలు ఈ ఏడాదిలో జరగవని, వచ్చే మార్చిలో ఉండొచ్చని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. హైకోర్టులో సానుకూల నిర్ణయాలు రాకపోతే సుప్రీం కోర్టుకెళ్లాలన్న ఉద్దేశంతో వైసీపీ అధిష్ఠానం ఉందని, అందువలన జాప్యం జరగవచ్చన్న ఆశతో ఉన్నారు. పైపెచ్చు ఆ పార్టీ అధినేత జగన్‌ త్వరలో విదేశీ పర్యటనకు వెళ్తుండటం కూడా శ్రేణుల్లో ఎన్నికలు వాయిదాపడే అంశంపై స్పష్టత పెంచింది. అయితే కొందరు నాయకులు మాత్రం ఎందుకైనా మంచిదని అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. మార్కాపురం నుంచి పోటీకి సిద్ధం కావాలని సూచిస్తూ ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి రాంబాబు కొందరు నేతలను కదిలించడం విశేషం. కందుకూరులో వైసీపీ నేతలు ఎన్నికలను అడ్డుకునే విషయంలో ఏకాభిప్రాయంతో ప్రయత్నాలు చేస్తున్నారు. చీరాలలో కాంగ్రెస్‌ నుంచి అభ్యర్థిని రంగంలోకి దించేందుకు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కసరత్తు ప్రారంభించారు. ఒంగోలులో కొందరు అభ్యర్థులకు ఆ పార్టీ ఇన్‌చార్జి రవిబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఎన్నికలు ఇప్పుడు జరగవన్న ఆశాభావం ఉన్నప్పటికీ తమవంతు జాగ్రత్తలో కొందరు వైసీపీ నాయకులు ఉన్నట్లు వెల్లడవుతోంది.

Updated Date - Sep 26 , 2026 | 03:24 AM