స్థానిక సమరానికి సిద్ధం
ABN , Publish Date - Sep 04 , 2026 | 02:41 AM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉండటంతో తదనుగుణ ఏర్పాట్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. దీంతో అధికారిక చర్యలపై ఇటు అర్బన్, అటు జిల్లా, మండల, గ్రామపంచాయతీల్లో ప్రాథమిక ప్రక్రియను అధికారులు చేపట్టారు.
ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ చర్యలు
పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
పంచాయతీల్లో రిజర్వుడ్ కేటగిరీ ఓటర్ల విభజనపై గ్రామసభలు
తాజా క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం దిశానిర్దేశం
ఒంగోలు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉండటంతో తదనుగుణ ఏర్పాట్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. దీంతో అధికారిక చర్యలపై ఇటు అర్బన్, అటు జిల్లా, మండల, గ్రామపంచాయతీల్లో ప్రాథమిక ప్రక్రియను అధికారులు చేపట్టారు. అందులో కీలకమైన ముసాయిదా ఓటర్ల జాబితా, రిజర్వుడు ఓటర్ల గుర్తింపు, వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటివి పూర్తిచేశారు. తదుపరి ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం అర్బన్ స్థానిక సంస్థల్లో వార్డుల వారీ ఓటర్ల జాబితాను ఆయా మునిసిపాలిటీల్లో గురువారం అధికారులు ప్రకటించారు. అదేసమయంలో గ్రామపంచాయతీల్లో గతంలోనే ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రకటించిన అధికారులు ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించి ఆ వివరాలను ప్రకటించి అభ్యంతరాల స్వీకరణకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు.
ముందు మునిసిపల్ ఎన్నికలు
తొలుత మునిసిపల్ తర్వాత జిల్లా, మండల పరిషత్‌లు, అనంతరం గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంకల్పించింది. అందులో పంచాయతీలు, మునిసిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నడుస్తుండగా మండల పరిషత్ ఈనెల 23న, అలాగే జడ్పీ పదవీకాలం ఈనెల 24తో ముగియ నుంది. దీంతో ఒకదాని వెంట ఒకటిగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. తొలి అంకంగా పక్షంరోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు చేశారు. ప్రధానంగా పట్టణాల్లో కార్పొరేషన్ మేయర్లు, మునిసిపల్ చైర్మన్‌ల ఎన్నిక ఇప్పటివరకు పరోక్ష విధానంలో జరుగుతుండగా ఈసారి నేరుగా ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానంలోకి తెచ్చింది. అలాగే జిల్లాల పునర్విభజన ఒకటికి రెండుసార్లు జరిగినా ఇప్పటివరకు ఉమ్మడిగానే జడ్పీలు కొనసాగుతుండగా ఈసారి ఎన్నికలను కొత్త జిల్లాల ప్రాతిపదికన నిర్వహించాలని నిర్ణయించారు.
అన్నిచోట్లా ఎన్నికలు జరగాలి
గురువారం మంత్రివర్గ సమావేశం సందర్భంగా స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబునాయుడు మరింత స్పష్టతను ఇచ్చారు. మొత్తం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగేలా చూడాలని కోర్టు కేసులు ఉన్నవాటికి సంబంధించి వాటి పరిష్కారం, అలాగే ఆయా జిల్లాల్లో అన్ని స్థానాలను కూటమి గెలుపొందేలా చూసే బాధ్యతను జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు అప్పగిస్తూ దిశానిర్దేశం చేశారు. అంతకుముందు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ కూడా సహచర మంత్రులకు ఈ ఎన్నికల విషయమై వివరంగా మాట్లాడినట్లు సమాచారం. అలా అధికారపక్షం స్థానిక ఎన్నికలపై దూకుడుగా వెళ్తుండగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అధికారులు కూడా వేగవంతం చేశారు.
జాబితాల ప్రకటన.. వివరాల సేకరణ
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతంలోనే ఓటర్ల జాబితాలను అధికారులు ప్రకటించారు. ఆ ప్రకారం ప్రస్తుతం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 519 పంచాయతీల్లో 5,212 వార్డులుగా విభజించారు. మొత్తం 10,70,902 మంది ఓటర్లు ఉండగా వారిలో 5,30,734మంది పురుషులు, 5,40,141మంది స్త్రీలు, 27మంది ఇతరులు ఉన్నారు. ఆ మేరకు జాబితాలను ప్రకటించడంతోపాటు వార్డుల వారీ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గుర్తింపును పూర్తిచేసి వివరాలను ప్రకటించారు. అలా ప్రకటించిన అనంతరం ప్రస్తుతం గ్రామసభలను నిర్వహించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభించారు. ఒంగోలు రూరల్ మండలం మండువారిపాలెంలో జరిగిన గ్రామసభలో డీపీవో అనుపమ పాల్గొని పరిశీలించారు. అంతకుముందు ముండ్లమూరులో ఆ మండలంలోని అన్ని పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఇతర పంచాయతీల్లోనూ ఇలాగే గ్రామసభలు జరుగుతున్నాయి.
ముసాయిదా జాబితాల ప్రకటన
పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల పునర్విభజన చేపట్టగా వాటికి అనుగుణంగా గురువారం పలు మునిసిపాలిటీల్లో ఓటర్ల ముసాయిదా జాబితాలను ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు కందుకూరు, అద్దంకి, దర్శి, చీమకుర్తి మునిసిపాలిటీలు ఉన్నాయి. అయితే విలీన గ్రామాల కోర్టు వివాదంతో కందుకూరులో అసలు ప్రక్రియ ప్రారంభం కాలేదు. వార్డుల విభజన తీరుపై కోర్టు కేసులతో ఒంగోలులో జాబితాలు ప్రకటించ లేదు. అద్దంకిలో గతంలో 29,019 మంది ఓటర్లు ఉండగా తాజా ముసాయిదా ప్రకారం 31,895 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఇక చీమకుర్తిలో గతంలో 20 వార్డులు కాగా ప్రస్తుతం 28 వార్డులు, 22,876 మంది ఓటర్లుగా ప్రకటించారు. ఈ ముసాయిదా ప్రకారం వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు గుర్తింపును చేపట్టి అనంతరం వార్డుల రిజర్వేషన్‌లు చేయనున్నారు. మొత్తంగా స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది.