పోలింగ్‌కు రెడీ
ABN , Publish Date - Nov 26 , 2026 | 02:49 AM
జిల్లాలో తొలి విడత పంచాయతీ, మలి విడతలో జరుగుతున్న కందుకూరు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం వీటిలో పోలింగ్ జరగనుంది. ఆయా కేంద్రాలకు సిబ్బంది, మెటీరియల్ బుధవారం సాయంత్రానికే చేరింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.
పంచాయతీ తొలి విడత, కందుకూరు మున్సిపల్ పోరు నేడు
77 సర్పంచ్ పదవులు, 610 వార్డు సభ్యులకు ఓటింగ్
కందుకూరులో చైర్మన్, 40వార్డు కౌన్సిలర్లకు ఎన్నిక
విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
కేంద్రాలకు చేరిన సిబ్బంది, మెటీరియల్
పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్
పంచాయతీల్లో మధ్యాహ్నమే కౌంటింగ్
జిల్లాలో తొలి విడత పంచాయతీ, మలి విడతలో జరుగుతున్న కందుకూరు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం వీటిలో పోలింగ్ జరగనుంది. ఆయా కేంద్రాలకు సిబ్బంది, మెటీరియల్ బుధవారం సాయంత్రానికే చేరింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు టంగుటూరులోని పోలింగ్ కేంద్రాలను, అక్కడ ఏర్పాటు చేసిన మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. అలాగే కందుకూరు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.
ఒంగోలు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలివిడత ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లో 8 మండలాల్లోని 139 సర్పంచ్‌లు, వాటి పరిధిలోని 1,394 వార్డుసభ్యుల ఎన్నికలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 58 పంచాయతీలలో సర్పంచ్‌లు, మొత్తం వార్డుసభ్యులు ఏకగ్రీవం కాగా మరో నాలుగుచోట్ల సర్పంచ్‌లు, కొన్ని వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే 62 సర్పంచ్ పదవులు, అలాగే 782 వార్డుసభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇక 77 పంచాయతీలలో సర్పంచ్‌లకు అలాగే నామినేషన్లు దాఖలు కాని నాలుగు వార్డులు పోను మిగిలిన 610 వార్డులకు గురువారం పోలింగ్ జరుగుతోంది. వీటి పరిధిలో మొత్తం 2,00,660 మంది ఓటర్లు ఉండగా 852 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
మండల కేంద్రాలలో బుధవారం ఉదయం రిసె ప్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆయా పోలింగ్ సెంటర్‌లకు సిబ్బందిని, మెటీరియల్‌ను పంపిం చారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు జరుగు తుంది. అనంతరం ఓట్లు లెక్కించి గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డుసభ్యులతో రిటర్నింగ్ అధికారులే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తదనుగుణంగా ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికలు జరుగుతున్న 77 సర్పంచ్ స్థానాలకు 215 మంది, 610 వార్డు సభ్యుల పదవులకు 1,325 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇదిలాఉండగా కందుకూరు మున్సిపాలిటీలో చైర్మన్, 40 వార్డు కౌన్సిలర్ల ఎన్నికకు కూడా గురువారం పోలింగ్ జరగనుంది. అక్కడ మొత్తం 47,471 మంది ఓటర్లు ఉన్నారు. చైర్మన్ స్థానానికి ఏడుగురు, 40వార్డులకు 105 మంది బరిలో ఉన్నారు. మొత్తం 65 పోలింగ్ కేంద్రా లు ఏర్పాటు చేశారు. కందుకూరులో ఉదయం 7 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆయా కేంద్రాలకు బుధవారం సాయంత్రానికే మెటీరియల్‌ను, సిబ్బందిని చేర్చారు.
పరిశీలించిన అధికారులు
ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు నేతృత్వంలో ఆయా శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆర్డీవోల సారథ్యంలో మండలాల్లోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు అలాగే మున్సిపాలిటీలో సబ్ కలెక్టర్ సారథ్యంలో మునిసిపల్ అధికారులు ఎన్నికల నిర్వహణలో నిమగ్నమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు బుధవారం సాయంత్రం టంగుటూరులోని పోలింగ్ కేంద్రాలను, అక్కడ ఏర్పాటు చేసిన మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. అలాగే కందుకూరు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.