Share News

మెగా సెగ్రిగేషన్‌ డ్రైవ్‌కు రెడీ

ABN , Publish Date - Sep 19 , 2026 | 03:26 AM

ఒంగోలులో మరో భారీ ప్రజాచైతన్య కార్యక్రమం శనివారం జరగనుంది. మెగా సెగ్రిగేషన్‌ డ్రైవ్‌ పేరుతో నగర పరిధిలోని మొత్తం గృహాలు, వ్యాపార, వాణిజ్య, విద్య, ఇతర సంస్థల నుంచి ఒకే సమయంలో చెత్త సేకరణ చేయనున్నారు.

మెగా సెగ్రిగేషన్‌ డ్రైవ్‌కు రెడీ
ఒంగోలులోని గద్దలగుంట ప్రాంత ప్రజలకు మునిసిపల్‌ సిబ్బందితో కలిసి అవగాహన కల్పిస్తున్నస్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రవి

నేడుఒంగోలులో 80వేలకుపైగా

గృహ, వాణిజ్య సంస్థల నుంచి చెత్త సేకరణ

గంట వ్యవధిలో తడి, పొడి చెత్త

విడివిడిగా సేకరించేలా ఏర్పాట్లు

ముందుగా విభిన్న వర్గాల్లో విస్తృత ప్రచారం

ఇంటింటికీ కరపత్రాలు, కవర్ల పంపిణీ

ఒంగోలులో మరో భారీ ప్రజాచైతన్య కార్యక్రమం శనివారం జరగనుంది. మెగా సెగ్రిగేషన్‌ డ్రైవ్‌ పేరుతో నగర పరిధిలోని మొత్తం గృహాలు, వ్యాపార, వాణిజ్య, విద్య, ఇతర సంస్థల నుంచి ఒకే సమయంలో చెత్త సేకరణ చేయనున్నారు. తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించడం ద్వారా భవిష్యత్‌లో కూడా ప్రజలకు ఇళ్లలో రోజువారీ వచ్చే వ్యర్థ పదార్థాల నిల్వపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం నలుపు, తెలుపు కవర్లు ఇంటింటికీ పంపిణీ చేశారు.

ఒంగోలు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు మునిసిపాలిటీగా ఏర్పడి 150 సంవ త్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్దఎత్తున ఉత్సవాలు ఈ నెలాఖరులో జరగనున్నాయి. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, ప్రస్తుత కార్పొరేషన్‌ స్పెషల్‌ ఆఫీసరైన కలెక్టర్‌ రాజాబాబు నేతృత్వంలో గత మూడు మాసా లుగా ఇందుకు సంబంధించి పలు కార్యక్ర మాలు కొనసాగుతున్నాయి. ఈనెల 27 నుంచి 30 వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 150 ఏళ్ల ఉత్సవాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతోపాటు పారిశుధ్యం, ఆరోగ్యం, పర్యావరణం ఇతరత్రా అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా శనివారం పారిశుధ్యంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నారు. భారీ వ్యర్థాల విభజన (మెగా సెగ్రిగేషన్‌ డ్రైవ్‌) ఏర్పాటు చేశారు. నగరపరిధి లో మొత్తం 80వేలకుపైగా గృహాలు, ఇతర సముదాయాలు, సంస్థలు ఉన్నాయి. వాటన్నిం టి నుంచి ఉదయం 8-9 గంటలలోపు గంట వ్యవధిలో చెత్తను సేకరించనున్నారు. తడి, పొడి చెత్తలను విడివిడిగా సేకరించి నిర్దేశించిన రూట్లలో ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా తరలించనున్నారు. ఇందుకోసం నగరంలో ప్రతి ఇంటికీ శుక్రవారం మునిసిపల్‌ సిబ్బంది అధికారుల పర్యవేక్షణలో వెళ్లి కార్యక్రమంపై అవగాహన కల్పించే కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే తడి చెత్తను ఒక దానిలో, పొడిచెత్తను మరొక దానిలో వేసి ఇవ్వాలని సూచిస్తూ తెలుపు, నలుపు కవర్లను అందజేశారు. బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఈ కార్యక్రమ నమోదుకు చర్యలు చేపట్టారు.

పర్యవేక్షణకు డివిజన్‌కో సీనియర్‌ అధికారి

నగరంలో ఐదు శానిటేషన్‌ డివిజన్లు, ఆ పరిధిలో 70 స్వర్ణ వార్డు కార్యాలయాలు ఉన్నాయి. దీంతో ఒక్కో డివిజన్‌కు ఒక సీనియర్‌ అధికారిని పర్యవేక్షకునిగా నియమించారు. వారి పరిధిలో మునిసిపల్‌ స్వర్ణ వార్డు ఉద్యోగులు, మెప్మా ఆర్పీలు, ఇతర శాఖల ఉద్యోగులు, సిబ్బందిని వీధుల వారీ పర్యవేక్షకులుగా పెట్టారు. ఇక నగరంలో 800 మంది పారిశుధ్య కార్మికులు ఉండగా బయటి నుంచి మరో 400 మందిని కూడా పిలిపించి గంట వ్యవధిలో చెత్త సేకరణకు వీలుగా ప్రతి 50 కుటుంబాలకు ఒకరికి బాధ్యత అప్పగించారు. గత వారం రోజులుగా వివిధ స్థాయిల్లోని ఉద్యోగులు, సిబ్బందికి ఈ అంశంపై అవగాహన కల్పించేలా సమావేశాలు, కార్యక్రమాలను నిర్వహించారు.

విస్తృత అవగాహన కోసం ప్రచారం

మరోవైపు నగర ప్రజల్లో విస్తృత అవగాహన కోసం వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాలను కూడా చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. వీధి వీధినా ఆటోలలో మైక్‌ ద్వారా, సోషల్‌ మీడియా వేదికగా ప్రచారంతోపాటు వాట్సప్‌ డీపీలు, ఫోన్‌లలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ వాయిస్‌తో సందేశాలు పంపించారు. చెత్త నుంచి సంపద తయారీ లక్ష్యంగా ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ముందుచూపుతో ఇప్పటికే ఊరూరా ప్రత్యేక కేంద్రాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఒంగోలు నగరంలో లభించే చెత్తతో సంపద తయారీ యూనిట్‌ను కలెక్టర్‌ రాజాబాబు చొరవతో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. దీనిపై ఇటీవల కలెక్టర్ల సదస్సులో ప్రత్యేక ప్రజెంటేషన్‌ కూడా కలెక్టర్‌ రాజాబాబు ఇచ్చారు.

మన ఒంగోలు- మన బాధ్యత

నగరంలో ప్రస్తుతం సుమారు వంద టన్నుల చెత్త రోజువారీ వస్తుండగా అందులో 75 టన్నుల తడి చెత్త ఉంటోంది. దీనితో సంపద తయారు చేయవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలకు తడి, పొడి చెత్తపై విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా శనివారం ఒంగోలు నగరంలో నిర్వహిస్తున్న మెగా సెగ్రిగేషన్‌ డ్రైవ్‌లో నగర ప్రజలంతా పాల్గొనాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ కోరారు. నగరంలోని అన్ని కుటుంబాలకు ముందుగా ఇచ్చిన తెలుపు, నలుపు బ్యాగులలో విడివిడిగా తడి, పొడి చెత్తలను చేర్చి ఇళ్లకు వచ్చిన సిబ్బందికి అందివ్వాలన్నారు. 150 ఏళ్ల ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మన ఒంగోలు-మన బాధ్యత నినాదంతో పాల్గొనాలని కోరారు. నగరంలో పరిశుభ్రత మెరుగు కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని సూచించారు.

Updated Date - Sep 19 , 2026 | 03:26 AM