నేటి నుంచి రేషన్
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:22 AM
జిల్లాలో బుధవారం నుంచి రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభంకానుంది. అందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.
మర్రిపూడి మండలం మినహా
మిగిలిన చోట్లకు సరుకులు సరఫరా
ఇప్పటికే వృద్ధులు, దివ్యాంగులకు పంపిణీ పూర్తి
ఈసారీ కందిపప్పు లేనట్లే
బియ్యం, చక్కెరకే పరిమితం
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో బుధవారం నుంచి రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభంకానుంది. అందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రకాశం జిల్లాలో 1,045 రేషన్ షాపుల పరిధిలో 5,16,806 కార్డుదారులు ఉండగా వారికి సరుకుల అందజేతకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాలో 60ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే వెళ్లి సరుకులను డీలర్లు పంపిణీ చేశారు. బుధవారం నుంచి రేషన్‌షాపుల ద్వారా ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయంలో కార్డుదారులకు ఈ సరుకులు ఇస్తారు. కార్డుదారులకు బియ్యం, చక్కెరతోపాటు ఒంగోలులో గోధుమపిండి, పరిమితి ప్రాంతాల్లో జొన్నలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు బియ్యం, చక్కెరను పౌరసరఫరల శాఖ అధికారులు సరఫరా చేశారు. కొండపి నియోజకవర్గ పరిధిలోని మర్రిపూడి మండలానికి బియ్యం సరఫరా ఇంకా జరగలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాగా ఉన్నప్పుడు పొదిలి ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి అక్కడికి బియ్యం రవాణా జరిగేది. ప్రస్తుతం పొదిలి మార్కాపురం జిల్లా పరిధిలోకి వెళ్లడంతో మర్రిపూడి మండలాన్ని చీమకుర్తి ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో కలిపారు. దాని వల్ల ఆ మండలానికి సరుకులు రవాణా జాప్యమైంది. బుధ, గురువారాల్లో ఆ మండలానికి కూడా బియ్యం చేరే అవకాశం ఉంది. కార్డుదారులకు గత కొంతకాలం నుంచి కందిపప్పు సరఫరా లేకుండా పోయింది. ఏ నెలకానెల కందిపప్పు ఇస్తారని ప్రచారం జరుగుతున్నా రేషన్ షాపులకు మాత్రం కేటాయింపు లేదు.