Share News

ఉద్యోగుల విభజనకు వడివడిగా అడుగులు

ABN , Publish Date - Aug 20 , 2026 | 02:15 AM

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు వడివడిగా అడుగులు పడు తున్నాయి. జిల్లా సహకార శాఖలో ఆ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఉద్యోగుల స్థాయిని బట్టి ఆయా పోస్టులను జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌, రాష్ట్రస్థాయిగా గుర్తింపు పూర్తయింది.

ఉద్యోగుల విభజనకు వడివడిగా అడుగులు
ఒంగోలులోని డీసీవో కార్యాలయం

సహకార శాఖలో ప్రక్రియ పూర్తి

కేటాయింపు ఉత్తర్వుల విడుదలే తరువాయి

ఒంగోలు విద్య, ఆగస్టు 19 (ఆంధ్ర జ్యోతి) : రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు వడివడిగా అడుగులు పడు తున్నాయి. జిల్లా సహకార శాఖలో ఆ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఉద్యోగుల స్థాయిని బట్టి ఆయా పోస్టులను జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌, రాష్ట్రస్థాయిగా గుర్తింపు పూర్తయింది. జిల్లా సహకార అధికారి (డీసీవో), జిల్లా సహకార ఆడిట్‌ అధికారి కార్యాలయాలకు కొత్త కేడర్‌ స్ట్రెంగ్త్‌ను ప్రభుత్వం ప్రకటించింది. డివిజన్‌, సబ్‌ డివిజన్‌ స్థాయి కార్యాలయాలకు ఇప్పటికే ఉన్న స్ట్రెంగ్త్‌ను కొనసాగిస్తున్నట్లు సహకార సంఘాల కమిషనర్‌ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగుల సీనియారిటీ జాబితాలు కూడా ఖరారు కావడంతో తమను ఏ జిల్లాకు కేటాయించాలో వారు ఆప్షన్లు కూడా ఇచ్చారు. వీరిని ఆయా జిల్లాలు, జోనల్‌, మల్టీ జోన్లకు కేటాయిస్తూ రిజిస్ట్రార్‌ జారీచేసే ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాను 2022లో ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలుగా విభజించారు. అప్పట్లో జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిదిని ప్రకాశంలో, కందుకూరును నెల్లూరులో, చీరాల, పర్చూరు, అద్దంకి నియోజక వర్గాలను బాపట్ల జిల్లాలో కలిపారు. ప్రస్తుతం పాత 26 జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ఆ మేరకు అధికారులు, సిబ్బందిని దామాషా ప్రకారం విభజిస్తున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. సీనియారిటీపాటు 70శాతం అంగవైకల్యం ఉన్న వారికి, మానసిక ఎదుగుదల లేని పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, క్యాన్సర్‌, మేజర్‌ న్యూరో, వివిధ రకాల సర్జరీలు చేయించుకున్న అధికారులు, సిబ్బందికి కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తారు.

పోస్టుల వర్గీకరణ ఇలా..

సహకార శాఖలోని పోస్టులను జిల్లా, జోనల్‌, మల్టీ జోన్‌, రాష్ట్రస్థాయి పోస్టులుగా వర్గీకరించారు. ఇప్పటివరకు జోనల్‌ స్థాయి పోస్టుగా ఉన్న డిప్యూటీ రిజిస్ట్రార్‌(డీఆర్‌)ను మల్టీజోన్‌ పోస్టుగా అప్‌గ్రేడ్‌ చేశారు. సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌, జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పోస్టులను జోనల్‌ పోస్టులుగా గుర్తించారు. జూనియర్‌ ఆఫీసు అసిస్టెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, మసాల్జి, వాచ్‌మెన్‌ పోస్టులను జిల్లాస్థాయి పోస్టులుగా గుర్తించారు. జిల్లా సహకారాధికారి, జిల్లా సహకార ఆడిట్‌ అధికారి కార్యాలయాలకు రిజిస్ట్రార్‌ కొత్త క్యాడర్‌ స్ట్రెంగ్త్‌ను ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు 14 జూనియర్‌ ఆఫీసు అసిస్టెంట్‌, 16 ఆఫీసు సబార్డినేట్‌, 2 వాచ్‌మెన్‌ పోస్టులను కేటాయించారు. డీసీవో కార్యాలయానికి మూడు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, ఒక జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌, రెండు జూనియర్‌ ఆఫీసు సబార్డినేట్‌, మూడు ఆఫీసు సబార్డినేట్‌, ఒకటి వాచ్‌మెన్‌, ఒకటి సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌, జాయింట్‌ రిజిస్ట్రార్‌ ఒకటి కలిపి 12మందిని కేటాయించారు. డీసీవో కార్యాలయానికి ఒక డిప్యూటీ రిజిస్ట్రార్‌, రెండు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, రెండు జూనియర్‌ ఇన్‌స్పెక్టర్లు, ఒక జూనియర్‌ ఆఫీసు అసిస్టెంట్‌, మూడు ఆఫీసు సబార్డినేట్‌, ఒక సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ కలిపి పది పోస్టులు ఇచ్చారు. దీంతో విభజన ఉత్తర్వుల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

Updated Date - Aug 20 , 2026 | 02:15 AM