చెరువుల అభివృద్ధి చకచకా..
ABN , Publish Date - Aug 06 , 2026 | 03:14 AM
జిల్లాలోని చెరువుల అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. వేసవికి ముందుగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా టెండర్ల ప్రక్రియలో జాప్యమైంది. దీంతో వర్షా కాలాని కంటే ముందు ఈ పనుల పూర్తి ప్రశ్నార్థకంగా కనిపించింది. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వానలు కురవకపోవడంతో ఆటంకం లేకుండా పనులు సాగుతున్నాయి.
వర్షాలు కురవకపోవడంతో ఆటంకం లేకుండా పనులు
ట్రిపుల్ ఆర్ కింద 22 చెరువులకు రూ.13.47 కోట్లు మంజూరు
ఓఅండ్‌ఎం కింద మరో 41 చెరువులకు రూ.5.21కోట్లు
త్వరగా పూర్తి చేసేందుకు ఇరిగేషన్ అధికారుల చర్యలు
మార్కాపురం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని చెరువుల అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. వేసవికి ముందుగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా టెండర్ల ప్రక్రియలో జాప్యమైంది. దీంతో వర్షా కాలాని కంటే ముందు ఈ పనుల పూర్తి ప్రశ్నార్థకంగా కనిపించింది. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వానలు కురవకపోవడంతో ఆటంకం లేకుండా పనులు సాగుతున్నాయి. చెరువు కట్టల పటిష్టత, సప్లై చానళ్ల మరమ్మతులు, ఇతర కాంక్రీట్ పనులు వేగవంతమయ్యాయి. నీటి సంరక్షణపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. చెరువుల మరమ్మతులకు ప్రాధాన్యం ఇచ్చి వేసవిలోనే నిధులను మంజూరు చేసింది. వర్షాకాలంలోపు వాటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే టెండర్ల ప్రక్రియ, కాంట్రాక్టర్‌లతో అగ్రిమెంట్ విషయంలో కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం పనులు ప్రారంభమై వేగంగా జరుగుతున్నాయి. జల సంరక్షణకు దోహదపడే చెరువులను గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. చెరువులు, కాలువలు, కుంటలు దేనికీ ఒక్కపైసా ఇవ్వకుండా నీటి వనరులను నిర్వీర్యం చేసింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలతోపాటు చెరువులు, కాలువల మరమ్మతులు, అభివృద్ధిపై దృష్టి సారించింది. చెరువుల పునరుద్ధరణ ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెంచడం, భూగర్భ జల మట్టం మెరుగుప ర్చాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అందుకోసం ట్రిపు ల్ ఆర్ (రిపేర్, రినోవేషన్, రిస్టొరేషన్) ద్వారా జిల్లాలో 22 చెరువులకు రూ.13.47 కోట్లు మంజూరు చేయగా పనులు జరుగుతున్నాయి. మరో 41 చెరువుల పనులకు ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) కింద రూ.5.25 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి.
ట్రిపుల్ ఆర్ ద్వారా నిధులు మంజూరైన చెరువులు ఇవీ..
ట్రిపుల్ ఆర్ ద్వారా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం చెరువుకు రూ.4.92 కోట్లు, ఎర్రగొండపాలెం మండలం మురారిపల్లె చెరువుకు రూ.1.72 కోట్లు, మార్కాపురం చెరువుకు రూ.1.17 కోట్లు, త్రిపురాంతకం మండలం దూపాడు చెరువుకు రూ.66.50 లక్షలు, పెద్దారవీడు మండలం బద్వీడు చెరువుకు రూ.51 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఎర్రగొండపాలెం చెరువుకు రూ.43 లక్షలు, బోడపాడు బంధనం వాగుకు రూ.23లక్షలు, తంగిరాలపల్లి చెరువుకు రూ.13 లక్షలు, బోడిరెడ్డిపల్లి చెరువుకు రూ. 46.50 లక్షలు, దేవరాజుగట్టు చెరువుకు రూ.15లక్షలు, సానికవరం కోనప్పచెరువుకు రూ.14లక్షలు, పెద్దారవీడు చెరువుకు రూ.25 లక్షలు, త్రిపురాంతకం చెరువుకు రూ.39లక్షలు కేటాయించింది. సోమేపల్లి చెరువుకు రూ.36లక్షలు, లేళ్లపల్లిలోని రుద్రప్ప చెరువుకు రూ.12లక్షలు, కంకణాలపల్లి చెరువుకు రూ.22 లక్షలు, అమానిగుడిపాడు చెరువుకు రూ.25లక్షలు, గంగపాలెం చెరువుకు రూ.28.50లక్షలు, కొలుకుల చెరువుకు రూ.27లక్షలు, పెద్దనాగులవరం చెరువుకు రూ.22.50 లక్షలు, భూపతిపల్లి చెరువుకు రూ.17లక్షలు, పేరూర్ చెరువు (వైడీపాడు)కు రూ.40లక్షలు మంజూరు చేసింది. ఇందులో మురారిపల్లి చెరువుకు టెండరు వేసిన కాంట్రాక్టరు ఇంకా పనులు ప్రారంభించ లేదు. మిగిలిన చెరువుల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి.
ఓఅండ్‌ఎం ద్వారా పనులు ఇలా..
ఓఅండ్‌ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) కార్యక్రమం కింద 41 పనులకు రూ.5.25 కోట్లు మంజూరయ్యాయి. అందులో కనిగిరి నియోజకవర్గంలో హనుమంతునిపాడు చెరువుకు రూ.2 కోట్లు, గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం, బేస్తవారపేట, అర్ధవీడు, గిద్దలూరు, రాచర్ల, కొమరోలులోని మొత్తం 19 చెరువులకు రూ.1.54కోట్లు విడుదలయ్యాయి. మార్కాపురం, తర్లుపాడు మండలాల్లోని 15 చెరువులకు రూ. 75లక్షలు, దోర్నాల చెరువుకు రూ. 50లక్షలతోపాటు బేస్తవారపేట, కంభం మండలాల్లో 5 మీడియం ఇరిగేషన్ చెరువులకు రూ.46లక్షలు కేటాయించారు. పనులు ప్రారంభమై శరవేగంగా జరుగుతున్నాయి. వీటిని త్వరగా పూర్తి చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులు పనులకు అనుకూలంగా ఉండటంతో త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా. త్వరలో వర్షాలు కురిసి సాగుకు అనుకూలంగా మారాలని రైతులు ఎదురుచూస్తున్నారు.