ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు
ABN , Publish Date - Jul 25 , 2026 | 02:30 AM
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. వాతావర ణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా రకరకాల అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఈనెల 1వతేదీ నుంచి 24వతేదీ వరకు జిల్లావ్యాప్తంగా వివిధ రకాల వ్యాధులు 827 నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
జిల్లాలో 24 రోజుల్లో 827 కేసులు నమోదు
ప్రైవేటు వైద్యశాలలంటే భయపడుతున్న ప్రజలు
టెస్టుల పేరుతో ఖర్చు భరించలేని పరిస్థితి
మెడికల్ షాపుల్లోనే కొనుగోలుకు ప్రాధాన్యం
ఒంగోలు కలెక్టరేట్, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. వాతావర ణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా రకరకాల అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఈనెల 1వతేదీ నుంచి 24వతేదీ వరకు జిల్లావ్యాప్తంగా వివిధ రకాల వ్యాధులు 827 నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అవన్నీ ప్రభుత్వ వైద్యశాలల్లో నమోదైనవే. ఇక ప్రైవేటు ఆసుపత్రులు, జిల్లావ్యాప్తంగా ఆర్‌ఎంపీలు, పీఎంపీల వద్ద అంతకు రెట్టింపు కేసులు ఉంటున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకూ డయోరియా కేసులు 281, టైఫాయిడ్ 72, వైరల్ ఫీవర్లు 438, గుండె సంబంధిత అలసటలు 15, పుడ్‌పాయిజన్ 19, డెంగ్యూ కేసులు రెండు నమోదయ్యాయి. ఇవి ఎక్కువగా దర్శి, చీమకుర్తి, కొత్తపట్నం, టంగుటూరు, ఈతముక్కల, ఒంగోలు, కందుకూరు ప్రాంతాల్లో నమోదై నట్లు వైద్యశాఖ లెక్కల ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. వారంరోజులు ఎండ తీవ్రతతోపాటు వేడిగాలులు వీస్తుండగా.. మరో వారం తీవ్రత తగ్గి ఉక్కపోత ఉంటోంది. ఈ కారణంగానే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని వైద్యులు చెప్తున్నారు.
వెంటాడుతున్న వైద్య పరీక్షల భయం
జిల్లా కేంద్రమైన ఒంగోలులో అర్బన్ ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిపై ప్రజలు పెద్దగా ఆసక్తిచూపించడం లేదు. గతంలో శివారు కాలనీల్లో ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యుల వద్ద రోగులు కిటకిటలాడే వారు. అక్కడ రెండు, మూడు రోజులు వైద్యం అందించి అప్పటికీ నయం కాకపోతే టెస్టులు చేయించుకోవాలని సూచించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితికి భిన్నంగా ల్యాబ్‌ల యజమానులతో కుమ్మక్కయ్యారు. ప్రస్తుతం వారి వద్దకు వచ్చే ఎక్కువ మందిని టెస్టులు చేయించుకోవాలని రాసి ఇస్తుండటంతో ఒక్కొక్కరు వేలల్లో వ్యయం చేయాల్సి వస్తోంది. ఆ ఖర్చును భరించలేక మెడికల్‌షాపుల వైపు మళ్లారు. మరోవైపు ప్రభుత్వం అన్నిరకాల మందులను ప్రభుత్వ వైద్యశాలల్లో అందుబాటులో ఉంచినప్పటికీ ప్రజానీకం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం వైద్యశాఖ లెక్కల ప్రకారం ఒంగోలు నగరంలోని పలు శివారు కాలనీల్లో సీజనల్ వ్యాధులు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.