రామాయపాలెంకు పండుగ శోభ
ABN , Publish Date - Jun 30 , 2026 | 02:53 AM
మండలం లోని రామాయపాలెం గ్రామానికి పండుగ వచ్చింది. జిల్లా స్థాయి ఏరువాక ఉత్సవానికి వేదికగా నిలిచింది. రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి, కలెక్టర్ రాజాబాబు, జిల్లాస్థాయి అధికారులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
సంప్రదాయబద్ధంగా ఏరువాక
బోనాలతో పోటెత్తిన మహిళలు
భారీగా తరలివచ్చిన రైతులు
పాల్గొన్న మంత్రి డాక్టర్ స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే ఉగ్ర
మర్రిపూడి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : మండలం లోని రామాయపాలెం గ్రామానికి పండుగ వచ్చింది. జిల్లా స్థాయి ఏరువాక ఉత్సవానికి వేదికగా నిలిచింది. రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి, కలెక్టర్ రాజాబాబు, జిల్లాస్థాయి అధికారులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పొంగళ్లు పెట్టి ప్రతి ఇంటి నుంచి బోనాలతో గ్రామానికి ఈశాన్యంగా ఉన్న ఏరువాక సాగే పొలానికి కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో సైతం తరలివచ్చారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద పుడమి తల్లికి పంటలు సంవృద్ధిగా పండాలని పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. జాతరను తలపించేలా గ్రామంలో అన్నదాతలు పెద్దఎత్తున తరలి ర్యాలీగా ఏరువాక ప్రాంతానికి చేరుకొన్నారు. మంత్రి, కలెక్టర్ స్వయంగా నాగలి పట్టి అరక దున్ని ఏరువాక ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి, కలెక్టర్ రాజబాబు సంప్రదాయ దుస్తుల్లో అందరినీ అలరించారు.