రాళ్లపాడు ఎండుతోంది!
ABN , Publish Date - Sep 19 , 2026 | 03:16 AM
రాళ్లపాడులో నీరు అడుగంటిపోతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులోకి నీరు చేర లేదు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 5.3 అడుగులకు పడిపోయింది.
అడుగంటుతున్న నీటి మట్టం
రక్షిత పథకాలకు కలుషిత నీరు సరఫరా
సోమశిల జలాలు వెంటనే ఇవ్వాలని సీఎంకు ఎమ్మెల్యే ఇంటూరి వినతిపత్రం
లింగసముద్రం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : రాళ్లపాడులో నీరు అడుగంటిపోతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులోకి నీరు చేర లేదు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 5.3 అడుగులకు పడిపోయింది. రాళ్లపాడు ఆధారంగా గుడ్లూరు, రాళ్లపాడు-రోళ్లపాడు, చుండి- చెర్లోపల్లి మంచినీటి పథకాలు పనిచేస్తున్నాయి. గుడ్లూరు పఽథకం ద్వారా 51 గ్రామాలకు, రాళ్లపాడు-రోళ్లపాడు పథకం ద్వారా 41 గ్రామాలకు, చుండి-చెర్లోపల్లి పథకం ద్వారా 10 గ్రామాలకు ప్రతిరోజూ 5 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నారు. ఆవిరి రూపం, ఇంకి పోవడంలో మరో 7 క్యూసెక్కుల నీరు వృఽథా అవుతోంది.
సోమశిల జలాలు వస్తేనే...
రాళ్లపాడు ఆధారంగా పని చేసే భారీ మంచినీటి పఽథకాలకు నీరు అందాలంటే సోమశిల జలాలను తరలించాలి. సోమశిల ప్రాజెక్టు ప్రారంభం నుంచి 30వ కిలోమీటర్ వరకూ కాలువ వెడల్పు పనులు జరుగుతున్నాయి. ఇవి గత రెండేళ్లుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సోమశిలలో 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు కాలువ పనులను నిలిపివేసి రాళ్లపాడుకు సోమశిల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని అధికారులు కోరుతున్నారు.
సీఎంకు ఎమ్మెల్యే ఇంటూరి వినతి
సోమశిల జలాలను రాళ్లపాడుకు తరలించి ఆదుకోవాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడుకు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టు అధికారులు కూడా సోమశిల నీటిని ఇవ్వాలని జిల్లా ఇరిగేషన్ ఎస్‌ఈ ద్వారా నెల్లూరు ఇరిగేషన్ ఎస్‌ఈకు లేఖ రాశారు.