‘గ్రానైట్’పై రాజస్థాన్ వ్యాపారుల దృష్టి
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:24 PM
గ్రానైట్ పరిశ్రమల్లో వచ్చిన అధునాతన యంత్రాల ద్వారా విపరీతంగా ఉత్పత్తి పెరగడం.. అదే స్థాయిలో డిమాండ్ తగ్గి అమ్మకాలు పడిపోవడం.. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన వ్యాపారులు బల్లికురవ ప్రాంతంలో రాజస్థాన్‌కు చెందిన వారు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడంతో స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
ఫ్యాక్టరీల నిర్మాణాలపై ముందుకు
వేమవరం పరిసరాల్లో భూముల కొనుగోలు
ఇప్పటికే పది మంది పరిశ్రమల ఏర్పాటుకు ఉపక్రమణ
ఆందోళనలో స్థానిక వ్యాపారులు
బల్లికురవ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : గ్రానైట్ పరిశ్రమల్లో వచ్చిన అధునాతన యంత్రాల ద్వారా విపరీతంగా ఉత్పత్తి పెరగడం.. అదే స్థాయిలో డిమాండ్ తగ్గి అమ్మకాలు పడిపోవడం.. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన వ్యాపారులు బల్లికురవ ప్రాంతంలో రాజస్థాన్‌కు చెందిన వారు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడంతో స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌కు చెందిన వ్యాపారులు ఈ ప్రాంతంలో పెద్దఎత్తున భూములను కొనుగోలు చేసి నిర్మాణాలకు ఉపక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఫ్యాక్టరీల యజమానులు కలవరపడుతున్నారు.
బల్లికురవ మండలంలోని వేమవరం, మల్లాయపాలెం, ఉప్పుమాగులూరు గ్రామాల పరిధిలో 150 గ్రానైట్ కటింగ్ యూనిట్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా స్థానికులకే ఉన్నాయి. వాటి నిర్వహణ ఇప్పుడు పెనుభారంగా మారింది. పెరిగిన ఖర్చులు, తగ్గిన ధరలతో వారు నెలవారీ విద్యుత్ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితిలో లేరు. దీనికితోడు ఇప్పుడు రాజస్థాన్ వంటి ప్రాంతాల నుంచి వ్యాపారులు బల్లికురవ మండలానికి వచ్చి భూములను కొనుగోలు చేసి కటింగ్ ఫ్యాక్టరీల ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే ఫ్యాక్టరీలలో స్లాబుల అమ్మకాలు మందగించడంతో పెద్ద ఎత్తున నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా వచ్చి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తుండటంతో స్థానిక వ్యాపారులు వారిని చూసి గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో పోటీ వాతావరణంతో తక్కువ ధరకు గ్రానైట్ శ్లాబ్‌లు అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇతర ప్రాంతాల వారు వస్తుంటే మున్ముందు మార్కెట్ ఇంకా పడిపోయే ప్రమాదం ఉందని స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మల్లాయపాలెం పరిధిలో రాజస్థాన్ వ్యాపారులు పది గ్రానైట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు భూములను కొనుగోలు చేసి ఫ్యాక్టరీల నిర్మాణ పనులు చేస్తున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు ఇప్పటికే సమావేశమై ఫ్యాక్టరీల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరిపారు. తక్కువ ధరకు అమ్మకాలు చేయకుండా ఉండాలని ఇందుకు అందరూ సహకరించాలని నిర్ణయించుకున్నారు.
గ్రానైట్ ఫ్యాక్టరీలలో పెరిగిన ఉత్పత్తి
గ్రానైట్ ఫ్యాక్టరీలలో ఉత్పత్తి శాతం గతం కంటే భారీగా పెరిగింది. గతంలో ఒక సింగిల్ కట్టర్ యంత్రం ద్వారా నెలకు 15 వేల అడుగుల ఉత్పత్తి మాత్రమే వచ్చేది. ఇప్పుడు మల్టీ కట్టర్ యంత్రాలు వచ్చాక ఒకేసారి 15 బ్లేడ్లతో రాళ్లను కట్ చేయటంతో ఒక మల్టీకట్టర్ ద్వారా నెలకు లక్షన్నర అడుగుల ఉత్పత్తి వస్తుంది. ప్రతి ఫ్యాక్టరీలో రెండు మూడు మల్టీ కట్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో స్లాబుల తయారీ పెరగటంతో అమ్మకాలు పూర్తిగా మందగించింది. గతంలో ఎంతో డిమాండ్‌గా అమ్మకాలు చేశామని ఇప్పుడు పోటీ వాతావరణంతో తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుందని వ్యాపారులు అంటున్నారు. ఉత్పత్తి పెరగటంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు కూడా వచ్చి ఫ్యాక్టరీలు కడుతుండటంతో స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ముందు మందు స్లాబుల అమ్మకాలు చేయాలంటే ఇబ్బంది పడే అవకాశం ఉందని వారు అంటున్నారు. ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల వ్యాపారులకు అనుమతులు జారీ చేయవద్దు అని వారు కోరుతున్నారు. గతంలో స్టీల్ గ్రే ఫ్రెష్ రకం అడుగు రూ.80 ఉండగా ఇప్పుడు రూ.60కే అమ్మకాలు చేస్తున్నామని వారు తెలిపారు.