చినుకు.. చిగురు..
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:06 AM
జిల్లాలో తాజాగా కురుస్తున్న వర్షాలు పంటల సాగుపై రైతుల్లో ఆశలను చిగురింపజేశాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం జిల్లాపై తీవ్రంగా పడి వర్షాలు లేక, ఎండలు పెరిగి సాగు ముందుకు సాగలేదు. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకోగా సాధారణ సాగు విస్తీర్ణంలో 20శాతం మించి పంటలు వేయలేకపో యారు.
వారం నుంచి జిల్లావ్యాప్తంగా వర్షాలు
పలుచోట్ల భారీగా కురిసిన వైనం
వాడుముఖం పట్టిన పైర్లకు మేలు
లేటు ఖరీఫ్, రబీకి అనుకూలం
పంటలపై వ్యవసాయశాఖ ప్రచారం
ఒంగోలులో భారీగా కిసాన్ సమ్మేళనం
పల్లెల్లో వ్యవసాయ పనులపై రైతుల దృష్టి
ఒంగోలు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో తాజాగా కురుస్తున్న వర్షాలు పంటల సాగుపై రైతుల్లో ఆశలను చిగురింపజేశాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం జిల్లాపై తీవ్రంగా పడి వర్షాలు లేక, ఎండలు పెరిగి సాగు ముందుకు సాగలేదు. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకోగా సాధారణ సాగు విస్తీర్ణంలో 20శాతం మించి పంటలు వేయలేకపో యారు. రబీ సీజన్‌పైనా భరోసా కనిపిం చని పరిస్థితి నెలకొంది. అలాంటి సమ యంలో వారంరోజులుగా జిల్లాలో కురుస్తు న్న వానలతో ఒక్కసారిగా వాతావరణం మారింది. ప్రస్తుతం పొలంలో ఎండు ముఖం పట్టిన పైర్లకు తాజా వర్షాలు మేలు చేకూర్చాయి. లేటు ఖరీఫ్, రబీ పంటల సాగుపైనా ఆశలు రేకెత్తించాయి. జిల్లాలో జూన్ నుంచి సెప్టెంబరు ఆఖరు వరకు ఖరీఫ్ సీజన్ కాగా ఈ సమయంలో సుమారు 394 మి.మీ వర్షపాతం నమోద వుతుంది. ఈ సమయానికి ఇంచుమించు 350 మి.మీ కురవాల్సి ఉండగా 161.44 మి.మీ నమోదైంది. అందులోనూ ఈ వారంలోనే కాస్తంత ఎక్కువ వర్షం కురి సింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 56.40 శాతం లోటు వర్షపాతం ఉంది. ఈనెల తొలిపక్షం వరకు కేవలం 105.0 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదై సగటున 75శాతం మేర లోటు ఉండడంతో పంటల సాగు ముందుకు కదల లేదు.
వారంలోనే మారిన పరిస్థితి
జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 55,774 హెక్టార్లు కాగా కేవలం 11వేల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. అవి కూడా చాలాప్రాంతాల్లో ఎండు ముఖం పట్టాయి. ప్రధానంగా దర్శి, అద్దం కి నియోజకవర్గాల్లో బోర్ల కింద వేసిన వరి, మొక్కజొన్న, ఇతర ప్రాంతాల్లో కంది పంట పరిస్థితి అలానే ఉంది. చాలాచోట్ల కనీసం పశుగ్రాస పంటలు కూడా వేయ లేకపోయారు. ఖరీఫ్ పోయినా కనీసం రబీ పంటలు కూడా వేయలేమోనన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమైంది. అలాంటి సమయంలో వారంరోజులుగా జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి పలు మండలాల్లో భారీ వర్షమే కురిసింది. మూడు, నాలుగు రోజులుగా తెరపిలేకుండా ముసురుగా జల్లులు పడుతున్నాయి. అలా ఈవారం రోజుల్లోనే జిల్లాలో సగటున 55 మి.మీ పైన వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో 100 మి.మీపైనే వర్షం కురిసింది. ఈనెలలో సాధారణ వర్షపాతం 140.0 మి.మీ కాగా ఈ సమయానికి 101 మి.మీ కురవాలి. అయితే 85.36 మి.మీ నమోదైంది. అలా చాలాచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షమే కురిసింది.
అద్దంకిలో భారీగా వానలు
మండలాల వారీగా చూస్తే అద్దంకిలో భారీ వర్షమే కురిసింది. ఆ మండలంలో ఈ నెలలో ఇప్పటివరకు 105.0 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా ఏకంగా 236.0 మి.మీ పడింది. బల్లికురవలో 91.30 మి.మీలకు 94.0 మి.మీ, జేపంగులూరులో 86.20 మి.మీలకు 101.80 మి.మీ, జరుగుమల్లి మండలంలో 108.40 మి.మీలకు 142.30 మి.మీ కురిసింది. పలు ఇతర మండలాల్లోనూ ఇంచుమించు సాధారణ వర్షపాతం లేదా కొంత తక్కువగా నమోదైంది. గురువారం ఉదయం 8 గంటలకు ముందు గడిచిన 24 గంటల వ్యవధిలో చూస్తే దర్శిలో 28.0 మి.మీ వర్షపాతం నమోదు కాగా కొండ పిలో 26.50, చీమకుర్తి 26.0, ఎస్‌ఎన్‌పాడులో 18.69, ఉలవపాడులో 18.60, సంతమాగులూరులో 18.50, ఒంగోలులో 16.0, మర్రిపూడిలో 16.0, అద్దంకిలో 13.50, పంగులూరులో 13.0, ముండ్లమూరులో 11.0, టంగుటూరులో 10.30 మీ.మీ వర్షపాతం నమోదైంది. తిరిగి గురువారం పగటిపూట కూడా తెరపి లేకుండా జిల్లా అంతటా జల్లులు పడుతూనే ఉన్నాయి. ఇక ఈ ఏడాది పంటల సాగు సాధ్యం కాదేమో అని రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో ఇలా వర్షాలు కురియడంతో సాగుపై ఆశలు చిగురించాయి. అయితే ఏ పంటలు సాగు అన్న సందిగ్ధ పరిస్థితి నెలకొంది.
సాగుకు సన్నద్ధమే లక్ష్యంగా...
ఎల్‌నినో, తాజా వర్షాల నేపథ్యంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గురువారం ఒంగోలులో వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో భారీగా రైతు సమ్మేళనం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రైతులు ఈ సదస్సుకు హాజరు కాగా జిల్లా మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి సదస్సును ప్రారంభించారు. ప్రస్తుత సమయంలో సాగుకు రైతన్నలను సన్నద్ధం చేయడం, ఏ ప్రాంతంలో ఏ పంటలు సాగుకు అవకాశం ఉంది, పొగాకు అలాగే మాగాణిలో వరికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి పంటలు సాగు చేయాలన్నది వివరించే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహించారు. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు ఆయా ప్రాంతాల్లో సాగుకు అవకాశం ఉన్న పంటలపై వివరించారు. ప్రధానంగా తక్కువ కాలంలో చేతికి వచ్చే అలాగే తక్కువ నీటితో పండే పంటలు సాగును సూచించారు. ప్రధానంగా కంది, మినుము, శనగ పెసర, జొన్న వంటి పంటలను ఎక్కువమంది అధికారులు శాస్త్రవేత్తలు సూచించారు. సంప్రదాయంగా ఎన్నో ఏళ్ల నుంచి వేస్తున్న రకాలు కాకుండా ఇటీవల కాలంలో పరిశోధనలు చేసి రూపొందించిన కొత్త తరహా పంటలు సాగు చేయాలని కోరారు.