ఇలపై ఇంద్రధనస్సు
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:51 AM
ఒంగోలులోని క్విస్ కళాశాల ప్రాంగణం రంగవల్లుల సంబరంతో హోరెత్తింది. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ మంగళవారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. బాలికల నుంచి బామ్మల వరకూ పెద్దఎత్తున తరలివచ్చారు.
ఒంగోలులో రంగవల్లుల సంబరం
ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందన
ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
పుడమితల్లి ముగ్గుల చీర కట్టి మురిసిపోయింది. ఇలపైకి ఇంద్రధనస్సు దిగి వచ్చింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నారీమణులు వేసిన రంగవల్లులు మంత్రముగ్ధుల్ని చేశాయి. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్ బై: సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తీ.. సహకారంతో మంగళవారం ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోటీలకు మహిళలు భారీగా తరలివచ్చారు. ముగ్గుముచ్చట్లకు మనోహర రూపం ఇచ్చారు. క్విస్ విద్యా సంస్థ లోకల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది.
ఒంగోలు కల్చరల్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులోని క్విస్ కళాశాల ప్రాంగణం రంగవల్లుల సంబరంతో హోరెత్తింది. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ మంగళవారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. బాలికల నుంచి బామ్మల వరకూ పెద్దఎత్తున తరలివచ్చారు. ఆకర్షణీయంగా ముగ్గులను తీర్చిదిద్దారు. కొందరు తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు అనేక విషయాలను తెలిజేస్తూ సందేశాత్మకంగా చిత్రీకరించారు. మొత్తం 139 మంది పోటీలో పాల్గొన్నారు. క్విస్ విద్యాసంస్ధల అధినేత డాక్టర్ నిడమానూరి సూర్యకల్యాణ చక్రవర్తి విజేతలకు నగదు బహుమతులను, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ గిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. చీమకుర్తికి చెందిన జి.లక్ష్మి ప్రథమ, కొరిశపాడు మండలం మేదరమెట్లకు చెందిన ఎం.ప్రత్యూష ద్వితీయ, అద్దంకి పట్టణానికి చెందిన కె.సుజాత తృతీయ బహుమతిని సాధించారు. మొదటి బహుమతిగా రూ.10వేలు, రెండో బహుమతిగా రూ.6వేలు, మూడో బహుమతిగా రూ.4వేలను ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, క్విస్ ఇంజనీరింగ్ కళాశాల వైస్‌ప్రెసిడెంట్ డాక్టర్ నిడమా నూరి గాయత్రీదేవి అందజేశారు. పి.సునీతరాణి, ఎస్.శకుంతల, కె.జయలక్ష్మి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.