Share News

గాలివాన బీభత్సం

ABN , Publish Date - May 05 , 2026 | 03:14 AM

జిల్లాలో ఆదివారం రాత్రి అకాల వర్షం, ఆపై భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్‌ సరఫరా వ్యవస్థ భారీగా దెబ్బతింది. అనేక ప్రాంతాల్లో స్తంభాలు విరిగిపోయాయి. కరెంటు తీగలు తెగిపోయాయి.

గాలివాన బీభత్సం
బల్లికురవ మండలం అంబడిపూడిలో గాలులకు నేలవాలిన మొక్కజొన్నను చూపుతున్న రైతు శ్రీనివాసరావు (ఇన్‌సెట్‌లో) తాళ్లూరు మండలం బొద్దికూరపాడు చెరువుకట్ట వద్ద విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు

విద్యుత్‌శాఖకు భారీనష్టం

విరిగిపడిన స్తంభాలు

అనేక ప్రాంతాల్లో రాత్రంతా అంధకారం

అవస్థలు పడిన ప్రజానీకం

పిడుగుపడి ఒకరు మృతి... మరికొందరికి గాయాలు

నేలరాలిన మామిడి కాయలు

దెబ్బతిన్న మొక్కజొన్న, అరటి

నష్టపోయిన పలువురు రైతులు

జిల్లాలో ఆదివారం రాత్రి అకాల వర్షం, ఆపై భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్‌ సరఫరా వ్యవస్థ భారీగా దెబ్బతింది. అనేక ప్రాంతాల్లో స్తంభాలు విరిగిపోయాయి. కరెంటు తీగలు తెగిపోయాయి. దీంతో రాత్రంతా సరఫరా లేక ప్రజలు అల్లాడిపోయారు. మరో వైపు మొక్కజొన్న, అరటి, కూరగాయలు, ఇతరత్రా పంటలతోపాటు కోతదశలో ఉన్న మామిడికి అధికంగానే నష్టం వాటిల్లింది. ఒంగోలు సమీపంలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

ఒంగోలు, మే 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాపై ఆదివారం రాత్రి గాలివాన విరుచుకుపడింది. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ భీకర గాలులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. నాగులుప్పలపాడులో అత్యధికంగా 42.27 మి.మీ వర్షపాతం నమోదైంది. ముండ్లమూరు మండలం మారెళ్లలో 42.0, మద్దిపాడులో 41.0, ఒంగోలు రూరల్‌ మండలం కరవదిలో 39.50, అద్దంకిలో 39.25, సంతనూతలపాడు మండలం చిలకపాడులో 35.50 మి.మీ కురిసింది. కొరిశపాడులో 26.50, సంతనూతలపాడులో 21.25, ముండ్లమూరులో 20.75, ఒంగోలులో 20.50 మి.మీ పడింది. పలు ఇతర మండలాల్లోనూ ఒక మోస్తరు జల్లులు కురిశాయి.

భీకరగాలులతో అధిక నష్టం

చాలాచోట్ల వర్షం కన్నా గాలుల తీవ్రత అధికంగా ఉంది. పలు పట్టణాలు, గ్రామాల్లో స్తంభాలు విరిగి, విద్యుత్‌ లైన్లు తెగిపోయాయి ఆశాఖకు దాదాపు రూ.60లక్షల నష్టం వాటి ల్లింది. రాత్రంతా కరెంటు సరఫరా నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడ్డారు. ఆ శాఖ సిబ్బంది రాత్రిపూట కూడా పనిచేసి అధిక ప్రాంతాల్లో సోమవారం ఉదయానికి సరఫరాను పునరుద్ధరించారు. పలుప్రాంతాల్లో పిడుగులు, ఉరుములు వణికించాయి. కొత్తపట్నం మండలం టీవై.కాలనీకి చెందిన పూనూరు కొండయ్య అనే వ్యక్తి పొరుగున ఉన్న చేజర్లలో జరుగుతున్న తిరునాళ్లకు వెళ్తూ పిడుగుపాటుకు మృతి చెందారు. ఒంగోలు నగరంలో చెట్లు విరిగిపోయాయి. హోర్డింగ్‌లు ధ్వంసమయ్యాయి.

మామిడి రైతుకు కోలుకోలేని దెబ్బ

ఉలవపాడు, గుడ్లూరు, కందుకూరు ప్రాంతాల్లోని మామిడి తోటల్లో అధికభాగం కోత దశలో ఉండగా గాలుల తీవ్రతతో వందలాది ఎకరాల్లో కాయలు రాలిపోయాయి. దీంతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. బల్లికురవ, పంగులూరు, దర్శి తదితర ప్రాంతాల్లో మొక్కజొన్న, అరటి నేలవాలి నష్టం వాటిల్లింది. కొత్తపట్నం మండలంలో ఉప్పు కొఠార్లు నీట మునిగాయి.

వణికించిన పిడుగులు

ఒంగోలు క్రైం, మే 4 (ఆంధ్రజ్యోతి) : గాలివానకు తోడు ఉరుములు, పిడుగులు వణికించాయి. ఆదివారం రాత్రి ఒంగోలు సమీపంలోని చేజర్లమ్మ తిరునాళ్లకు వెళుతూ కొప్పోలు- కరవది మధ్య ముదిగొండి వాగు సమీపంలో చెట్టు కిందకు పలువు చేరారు. ఆ సమయంలో అక్కడ పిడుగు పడింది. పూనూరి కొండయ్య (23) మృతి చెందాడు. అతనితోపాటు ఉన్న మరికొంతమంది స్పృహ కోల్పోయారు. వివరాలలోకి వెళితే.. ఒంగోలు రూరల్‌ మండలంలో చేజర్లలోని చేజర్లమ్మ తిరునాళ్లకు కొప్పోలు వైపు నుంచి దగ్గరకావడంతో ఒంగోలు నుంచి వెళ్లేవారు అంతా ద్విచక్రవాహనాలపై ఆదివారం రాత్రి బయల్దేరారు. ఒక్కసారిగా గాలివాన ప్రారంభం కావడంతో బైకులపై వెళ్లే సుమారు 20 మంది మధ్యలోని ఓ చెట్టు కింద ఆగారు. ఆ సమ యంలో పెళపెళమని శబ్దం తో ఒక్కసారిగా ఆ చెట్టుపై పిడుగుపడింది. అక్కడ ఉన్న వారంతా షాక్‌కు గురై పడి పోయారు. కొందరు తేరుకొని బైకులను వదిలేసి ఆటోలు ఎక్కి ఇళ్లకు చేరుకున్నారు. గాయాలపాలైన మరికొందరు తమ బంధువులను పిలుచుకొని కార్లలో ఇంటికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అల్లూరు యానాది కాలనీలో నివా సం ఉంటున్న కొండయ్య మృతి చెందాడు. కొండయ్య పెళ్లూరులో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ట్రాక్టర్‌ యజమాని బైక్‌ తీసుకొని చేజర్ల తిరు నాళ్లకు బయల్దేరి మార్గమధ్యలో పిడుగుపాటుతో మృతిచెందాడు. ఒంగోలు కేశవరాజు కుంటకు చెందిన పెద్దసింగు ఆలీ, బాలాజీనగర్‌కు చెందిన దేవరమణి, పెద్దఆగ్రహారానికి చెందిన గొల్ల విష్ణులు గాయపడ్డారు. కొండయ్య మృతిచెందిన విషయాన్ని సోమవారం ఉదయం గుర్తించారు. చెట్టు కింద మోటార్‌సైకిళ్లు అలాగే ఉన్నాయి. తాలూకా ఎస్సై ఫణిభూషణ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 05 , 2026 | 03:14 AM