కాలుదువ్వుతున్న పందెం కోళ్లు
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:39 AM
జిల్లాలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. షరామామూలుగానే కోడి పందేల నిర్వహణకు కొందరు సిద్ధమయ్యారు. జిల్లా సరిహద్దుల్లోనూ, మారుమూల ప్రాంతాలలో బరుల ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.
రెచ్చిపోతున్న పందెంరాయుళ్లు
సరిహద్దు ప్రాంతాల్లో బరులు
ఇతర ప్రాంతాల నుంచి రాక
డ్రోన్‌లతో నిఘా ఫలించేనా?
అద్దంకి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. షరామామూలుగానే కోడి పందేల నిర్వహణకు కొందరు సిద్ధమయ్యారు. జిల్లా సరిహద్దుల్లోనూ, మారుమూల ప్రాంతాలలో బరుల ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పందేల కట్టడిపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. అయితే గతంలో చోటుచేకున్న పరిణామాలను బట్టి చూస్తే ఈఏడాది కట్టడి జరిగేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అద్దంకి నియోజకవర్గంలో ఇష్టానుసారంగా కోడిపందేలు జరిగాయి. అదేపంఽథాను గతేడాది కూడా కొనసాగించారు. గతంలో మండలాలు, జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఎక్కువగా జరిగాయి. శివారు ప్రాంతాలు కావ డంతో పోలీసులు కోడిపందేలు జరిగే ప్రదేశాలకు చేరుకునేసరికి పందెంరాయుళ్లు గప్‌చు ప్‌గా వెళ్లిపోతున్నారు. దీనికితోడు పందెంరాయుళ్లు ఎక్కడిక క్కడ గూఢచారులను ఏర్పాటు చేసుకుంటు న్నారు. ఆయా ప్రాంతాలకు వచ్చే దారుల వద్ద కాపాల ఉంచి పందెం వేస్తున్నారు. పోలీసులు, అనుమానా స్పద వ్యక్తులు తారసపడితే వెంటనే పందెంరాయుళ్లకు ఫోన్ ద్వారా సమాచారం అందేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో కోడిపందేలు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తే.. అద్దంకి, దర్శి, చీమకుర్తి, తాళ్ళూరు మండలాల సరిహద్దులో, ధేనువకొండ సమీపంలో తరచూ కోడిపందాలు జరిగేవి. మోదేపల్లి, కుంకుపాడు, కొటికలపూడి, రామాయపాలెం, ఉప్పలపాడు, కొత్తరెడ్డిపాలెం, చినకొత్తపల్లి, ధర్మవరం, బొమ్మనంపాడు, కొరిశపాడు మండలం తమ్మవరం, పమిడిపాడు, పంగులూరు మండలం రామకూరు, బల్లికురవ మండలం మల్లాయపాలెం, కొత్తూరు, కొప్పెరపాలెం, సంతమాగులూరు మండలం కొప్పరం, చవిటిపాలెం తదితర గ్రామాల్లోనూ గతంలో పెద్దఎత్తున బరులు నిర్వహించారు. గతేడాది సంతమాగులూరు, బల్లికురవ మండలాలలో రెండు, మూడు రోజులపాటు కోడిపందేలు జరిగాయి. ఈ రెండు మండలాల్లో జరిగే కోడిపందేలకు స్థానికుల కంటే పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు వస్తుంటారు. ఈ ఏడాది పేకాట శిబిరాలపై పోలీసులు డ్రోన్‌లతో నిఘాపెట్టి దాడులు చేస్తుండటం మంచి ఫలితాలు ఇస్తోంది. అదే ప్రయోగాన్ని కోడిపందేల స్థావరాలపై కూడా ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బరుల కట్టడి జరుగుతుందా? లేక ఏదో మారుమూల ప్రాంతాలలోనైనా పందేలు వేస్తారో? వేచిచూడాల్సి ఉంది.