రబీ అంతంతే!
ABN , Publish Date - Jan 14 , 2026 | 02:42 AM
రబీ సీజన్‌కు ఈ ఏడాది వాతావరణం అంతగా అనుకూలించలేదు. కీలక సమయంలో జిల్లాపై మొంథా తుఫాన్ విరుచుకుపడింది. ఆతర్వాత నవంబరు, డిసెంబరుల్లో తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొని అంతా తారుమారు చేశాయి.
ప్రతికూలంగానే సాగు
సగం కూడా లేని అపరాలు
మూడు రెట్లు పెరిగిన మొక్కజొన్న
ఈఏడాదీ భారీగానే పొగాకు నాట్లు
శనగ, వరిపై ఆసక్తి చూపని రైతులు
మూడొంతుల విస్తీర్ణంలోనే పంటలు
సీజన్‌ను తారుమారు చేసిన మొంథా తుఫాన్
ఆతర్వాత నుంచి వర్షాభావం
రబీ సీజన్‌కు ఈ ఏడాది వాతావరణం అంతగా అనుకూలించలేదు. కీలక సమయంలో జిల్లాపై మొంథా తుఫాన్ విరుచుకుపడింది. ఆతర్వాత నవంబరు, డిసెంబరుల్లో తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొని అంతా తారుమారు చేశాయి. ఫలితంగా సాధారణ రబీ సీజన్ సాగు సమయం ముగింపునకు వస్తున్నా మూడొంతుల విస్తీర్ణంలో మాత్రమే రైతులు పంటలు వేయగలిగారు. వాటిని కాపాడుకునేందుకు అగచాట్లు పడుతున్నారు. ప్రతికూల మార్కెట్ పరిస్థితులతో ప్రధానమైన శనగ, వరి పంటలపై రైతులు అంతగా ఆసక్తి చూపలేదు. పొగాకు ఈ ఏడాది కూడా భారీగానే సాగవుతోంది. అపరాలు సగం విస్తీర్ణంలో కూడా సాగుకు నోచుకోలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొక్కజొన్న సాగు ఏకంగా మూడు రెట్లకుపైన పెరిగింది.
ఒంగోలు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రబీ సీజన్‌లో సుమారు లక్షా 43వేల హెక్టార్లకు పైగా విసీ ్తర్ణంలో వ్యవసాయశాఖ పరిధిలో పలు రకాల పంటలు సాగు చేస్తారు. అందులో అత్యధికంగా 43,973 హెక్టా ర్లలో శనగ, 29,345 హెక్టార్లలో పొగాకు, 26,341 హెక్టార్లలో మినుము, 19,144హెక్టార్లలో వరి, 5,226 హెక్టార్లలో మొక్కజొన్న, 7,849 హెక్టార్లలో అలసంద వేస్తారు. అక్టోబరు నుంచి డిసెంబరు ఆఖరు వరకు 90శాతం విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి. మిగతా పది శాతం జనవరి తొలిపక్షంలో వేస్తారు. అలాంటిది ఈ ఏడాది సీజన్ ముగిసి సంక్రాంతి వచ్చినా ఇంకా 25శాతం విస్తీర్ణంలో పంటలు వేయని పరిస్థితి నెల కొంది. అందుకు వాతావరణం అనుకూలించకపోవ డంతో పాటు శనగ, వరి పంటలకు మార్కెట్ సరిలేక పోవడం కూడా ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
తుఫాన్‌తో బాగా జాప్యం
సాధారణంగా అక్టోబరు తొలిపక్షంలో భూములు సిద్ధం చేసి రెండో పక్షం నుంచి డిసెంబరు తొలిపక్షం వరకు ముమ్మరంగా రబీ పంటలు సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది అక్టోబరు రెండో పక్షంలో వర్షాలు ముంచెత్తాయి. ఆ సమయంలో మొంథా తుఫాన్ జిల్లాపై విరుచుకుపడింది. ఆ సమయంలో ఏకంగా 25 సెం.మీ వర్షం కురిసింది. అలా అక్టోబరులో జిల్లాలో 20.07 సెం.మీ సాధారణ వర్షపాతానికి ఏకంగా 89శాతం అధికంతో 39.20సెం.మీ పడింది. దీంతో పంటల సాగుకు వర్షాల సమయంలో పది రోజులు, తర్వాత భూములు అరక మరో పక్షంరోజులు జాప్యం జరిగాయి. మరోవైపు భూములు ఆరిన తర్వాత సేద్యం చేసి పంటలు సాగుకు ఉపక్రమించిన రైతులను నవంబరు, డిసెంబరు నెలల్లో అనావృష్టి పరిస్థితి దెబ్బతీసింది. నవంబరులో 13.80 సెం.మీ సాధారణ వర్షపాతానికి 91శాతం లోటుతో కేవలం 1.20 సెం.మీ మాత్రమే కురిసింది. డిసెంబరులో 4.40 సెం.మీ వర్షపాతానికి 86శాతం లోటుతో 0.60 సెం.మీ మాత్రమే నమోదైంది. అలా ఆ రెండు నెలలు వర్షాభావంతో పంటల సాగు ముందుకు సాగలేదు.
తగ్గిన శనగ, మినుము సాగు
సాగర్ కాలువల్లో నీటి సరఫరా ఉండటం, తుఫాన్ సమయంలో అన్ని ప్రాంతాల్లో కుంటలు, చెరువులు నిండ టంతో ఆ నీటి ఆధారంగా పంటల సాగును రైతులు చేపట్టారు. అలా పొగాకు, మొక్కజొన్న, శనగ, వరి, అలసంద వంటి వాటిని సాగు చేపట్టినప్పటికీ రెండేళ్లుగా శనగకు ధరలు లేక అవస్థలు పడుతున్న రైతులు ఈసారి ఆ పంట సాగుపై అంతగా ఆసక్తిచూపలేదు. ధాన్యం ధరలు అంతంతమాత్రంగా ఉండటంతోపాటు పెట్టుబడి ఖర్చులు పెరగడంతో వరిపై కూడా విముఖత చూపడంతో ఆ రెండింటి సాగు తగ్గింది. మరో కీలకమైన మినుము సాగుకు వాతావరణం అనుకూలించక గణనీయంగా పడిపోయింది. మొత్తంగా లక్షా 43వేల హెక్టార్ల రబీ సాధారణ సాగు విస్తీర్ణం సంక్రాంతి వస్తున్నా ఇప్పటి వరకు లక్షా ఆరువేల హెక్టార్లు(75శాతం)లో మాత్రమే పంటలు సాగు చేశారు.
అనూహ్యంగా పెరిగిన మొక్కజొన్న సాగు
మొత్తం సాగులో సుమారు 58శాతం విస్తీర్ణంలో శనగ, మినుము, అలసంద వంటి అపరాల పంటలు సాగు చేస్తారు. అలా 80వేల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో ఈ పంటల సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 45శాతంతో 36వేల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ఇక పెద్దగా సాగుకు అవకాశం కనిపించడం లేదు. అదేసమయంలో మొక్కజొన్న 300శాతం, పొగాకు 121శాతం సాగయ్యాయి. వరి 70శాతం విస్తీర్ణానికే పరిమితమైంది. అదేసమయంలో వర్షాభావ పరిస్థితులతో పొగాకు, మొక్కజొన్న అలాగే అక్కడక్కడా శనగ పంటలను రక్షించుకునేందుకు రైతులు అధిక వ్యయప్రయాసలకోర్చి నీటితడులు పెడుతున్నారు.