రబీ కదిలింది!
ABN , Publish Date - Nov 18 , 2026 | 02:40 AM
రబీ సీజన్ పంటల సాగుకు మురసు తుఫాన్ ఊపిరిపోసింది. జిల్లాలోని తీరప్రాంతాలను ధ్వంసం చేసినప్పటికీ చినుకు లేక పంటలు సాగు కాక తల్లడిల్లుతున్న వ్యవసాయ రంగానికి మాత్రం కలిసొచ్చింది. ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని మండలాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.
కరువు నుంచి తేరుకున్న రైతులు
మురసు తుఫాన్‌తో భారీ వర్షాలు
ముమ్మరమైన పొలం పనులు
పొగాకు, శనగ, మిర్చి, మొక్కజొన్న,
సామాజిక వనాలపై దృష్టి
కందుకూరుతోపాటు మరికొన్ని
చోట్ల కొంత బెట్ట వాతావరణం
రబీ సీజన్ పంటల సాగుకు మురసు తుఫాన్ ఊపిరిపోసింది. జిల్లాలోని తీరప్రాంతాలను ధ్వంసం చేసినప్పటికీ చినుకు లేక పంటలు సాగు కాక తల్లడిల్లుతున్న వ్యవసాయ రంగానికి మాత్రం కలిసొచ్చింది. ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని మండలాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. కొండపి, కందు కూరు, దర్శి నియోజకవర్గాల్లోని తూర్పు ప్రాంత మండలాల్లోనూ మంచి వర్షాలు కురిశాయి. దీంతో రైతులు ఒక్కసారిగా పంటల సాగుకు ఉపక్రమించారు. అప్పటికే దుక్కులు దున్ని ఉన్న పొలాల్లో రబీలో ప్రధాన పంటలైన పొగాకు, శనగ, మిర్చి, మొక్కజొన్నలతో పాటు సామాజికవనాల సాగు ఊపందుకుంది.
ఒంగోలు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో పొలం పనులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రైతులంతా రబీ పంటల సాగులో నిమగ్నమయ్యారు. పొగాకు, మిర్చి, మొక్కజొన్న, శనగ వంటి ప్రధాన పంటలపై దృష్టి సారించారు. ఖరీఫ్‌లో ఈ ఏడాది తీవ్ర ప్రతికూల వాతావరణం కొనసాగిన విషయం విదితమే. ఎల్‌నినో ప్రభావంతో ఆ సీజన్లో వర్షం జాడలేకుండా పోయింది. ఖరీఫ్ సాగు చేసే జూన్ నుంచి సెప్టెంబరు ఆఖరు వరకు జిల్లాలో సగటున 394.10 మి.మీ వర్షపాతం నమోదు కావాలి. అలాంటిది 58.40శాతం లోటుతో కేవలం 163.90 మి.మీ మాత్రమే కురిసింది. కీలక మెట్ట పంటలు సాగు చేసే జూలై, ఆగస్టుల్లో 80శాతానికిపైగా వర్షపాతం లోటు నెలకొంది. దానికితోడు సాగర్ నీటి సరఫరా జరగలేదు. దీంతో ఖరీఫ్ సాగు తీవ్ర ప్రతికూలంగా సాగింది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 55,774 వేల హెక్టార్లు కాగా అతికష్టంపై సీజన్ ఆఖరుకు 65శాతం విస్తీర్ణంలో మాత్రమే సాగైంది. అందులోనూ 20శాతం వరకు సెప్టెంబరు ఆఖరులో కురిసిన వర్షాలతోనే సాధ్యమైంది.
వ్యవసాయరంగాన్ని ఆదుకున్న మురసు
రబీ సీజన్లోనైనా పరిస్థితి మారు తుందని ఆశించిన రైతులను అక్టోబరు తీవ్ర నిరాశపర్చింది. ఆ నెలలో జిల్లాలో 236.30 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 70.9 మి.మీ మాత్రమే కురిసింది. దీంతో రబీకి కూడా కరువు తప్పదని రైతులు ఆందోళన చెందారు. ఆ తరుణంలో ఈ నెల ప్రారంభంలో బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. కొత్తపట్నం సమీపంలోనే తీరం దాటిన తుఫాన్ తీవ్రగాలులతో విద్యుత్ ఇతర రంగాలను ధ్వంసం చేసినా చినుకు లేక పంటలు సాగు కాక తల్లడిల్లుతున్న వ్యవసాయ రంగానికి మాత్రం ఊపిరిపోసింది. మూడు రోజుల వ్యవధిలో జిల్లాలో సుమారు 114.80 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని మండలాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. అలాగే కొండపి, కందుకూరు, దర్శి నియోజకవర్గాల్లోని తూర్పుప్రాంత మండలాల్లోనూ మంచి వర్షాలు కురిశాయి. పంటల సాగుకు అనుకూల పరిస్థితిని కల్పించాయి. దీంతో ఊపిరిపీల్చుకున్న రైతులు పంటల సాగుకు ఉపక్రమించారు. సాగర్ నీటి సరఫరా లేదన్న విషయం స్పష్టం కావడంతో వర్షాలు పడిన ప్రాంతాల్లో మెట్ట పైర్ల సాగుకు కదిలారు. అప్పటికే దుక్కులు దున్ని ఉన్న ప్రాంత రైతులు రబీలో ప్రధాన పంటలైన పొగాకు, శనగ అలాగే మిర్చి, మొక్కజొన్నలతోపాటు సామాజిక వనాల సాగును చేపట్టారు. ఈ సీజన్లో జిల్లాలో సుమారు లక్షా 17వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. అందులో అత్యధికంగా 32,729 హెక్టార్లలో శనగ, మరో 37,776 హెక్టార్లలో పొగాకు, 22,818 హెక్టార్లలో వరి, పదివేల హెక్టార్లల్లో మొక్కజొన్న, ఆరువేల హెక్టార్లలో మినుము వంటివి వ్యవసాయశాఖ పరిధిలో వేస్తారు. అలాగే సుమారు 15వేల హెక్టార్లలో మిర్చివంటి ఉద్యాన పైర్లు సాగు చేస్తారు. వాటన్నింటికీ ప్రస్తుతం మురసు తుఫాన్‌తో కురిసిన వర్షం ఉపకరించింది.
జోరుగా సామాజికవనాల సాగు
కొండపి, సంతనూలపాడు, అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు ప్రస్తుతం మెట్ట పైర్లతోపాటు సామాజికవనాల సాగు చేపట్టారు. మరింత విస్తారంగా ఆ పంటలు సాగుకు భూములను సిద్ధం చేస్తున్నారు. తుఫాన్ వల్ల అతి భారీవర్షం కురిసిన కొత్తపట్నం, ఒంగోలు రూరల్, ఎన్జీపాడు మండలాలతోపాటు పలు ఇతర చోట్ల ఇప్పుడిప్పుడే భూములు ఆరుతుండటంతో పంటలు సాగు చేసే యోచనలో రైతులు ఉన్నారు. ఇదిలాఉండగా కొన్ని ప్రాంతాల్లో మురసు తుఫాన్ తాకిడి అంతగా తగలక పెద్దగా వర్షాలు కురవలేదు. కందుకూరు పరిసర మండలాలతోపాటు కొండపి, దర్శి నియోజకవరాల్లోని ఎగువప్రాంత మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. దీంతో ఆ ప్రాంత రైతులు మాత్రం పంటల సాగుపై సందిగ్ధంలో కనిపిస్తున్నారు.