చకచకా
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:08 AM
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడుతోంది. దీంతో పెండింగ్ పనులను అధికారులు చకచకా చేస్తున్నారు. బుధవారం నాటికి అన్నింటినీ పూర్తి చేయనున్నారు. ముఖ్యంగా ఫీడర్ కాలువపై సీఎం చంద్రబాబు ఈనెల 31న జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేసేందుకు వీలుగా అమర్చిన గేట్ల వద్ద కాలువ లోపలి భాగంలో కాంక్రీట్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు.
వెలిగొండ వద్ద పెండింగ్ పనులన్నీ నేటితో పూర్తి
రేయింబవళ్లూ కొనసాగుతున్న వైనం
నిర్వాసితుల వినతులు కూడా పరిష్కారం
నేడో, రేపో మిగిలిన వారి ఖాతాల్లో పరిహారం
మార్కాపురం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడుతోంది. దీంతో పెండింగ్ పనులను అధికారులు చకచకా చేస్తున్నారు. బుధవారం నాటికి అన్నింటినీ పూర్తి చేయనున్నారు. ముఖ్యంగా ఫీడర్ కాలువపై సీఎం చంద్రబాబు ఈనెల 31న జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేసేందుకు వీలుగా అమర్చిన గేట్ల వద్ద కాలువ లోపలి భాగంలో కాంక్రీట్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. రాత్రి సమయంలో కూడా లైనింగ్ పనులు కొనసాగిస్తున్నారు. మరోవైపు నిర్వాసితుల్లో మిగిలిన వారికి బుధ, గురువారాల్లో పరిహారం అందనుంది. అనంతరం ప్రత్యేక గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీల్లో అర్హులకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. పెండింగ్ పనులను యుద్దప్రాతిపదికన చేస్తున్నారు. సోమవారం రాత్రి మంత్రులు డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో బుధవారం నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. ఆ దిశగా ముమ్మరంగా జరుగుతున్నాయి. టన్నెల్-2లో కేవలం 20మీటర్ల లైనింగ్ మాత్రమే మిగిలి ఉందని దానిని పూర్తి చేస్తున్నామని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఫీడర్ కాలువపై సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చి నీటి విడుదలకు వీలుగా అమర్చిన గేట్ల వద్ద 100 మీటర్లకు పైగా లైనింగ్ పనులు కూడా చకచకా పూర్తి చేస్తున్నారు. రాత్రి సమయంలో కూడా లైనింగ్ పనులను కొనసాగిస్తున్నారు. అదే ప్రాంతంలో ఫీడర్ కాలువ కట్ట ఎత్తు తగ్గించి సీఎం జలహారతి ఇచ్చేచోట మెట్లదారిలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంమీద సీఎం జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేసే ఫీడర్ కాలువపై గేట్లు అమర్చడం, ఇతర పనులన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. ముంపు గ్రామాల నుంచి తమకు పరిహారం అందలేదని వచ్చే గ్రీవెన్స్ అర్జీలను కూడా త్వరగా పరిష్కరించి నీటి విడుదలకు ముందే అందరికీ పరిహారం అందించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రత్యేక గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలపై విచారణ కోసం జిల్లాస్థాయి అధికారుల ఆధ్వర్యంలో 11 బృందాలను ఏర్పాటు చేశారు. పేర్లు తప్పుగా నమోదయ్యాయని, సరైన ఆధారాలు లేని కారణంగా నిలిపివేశారని, 18 ఏళ్లు నిండిన వారు అన్నీ కలిపి 1,863 అర్జీలు నిర్వాసితుల నుంచి వచ్చాయి. వాటిలో ఇప్పటికే 1,818 అర్జీలను ఆయా బృందాలు విచారించాయి. కేవలం 45 మాత్రమే ఇక విచారణ చేయాల్సి ఉంది. విచారణ పూర్తి చేసిన వాటిలో 758 మందికి సంబంధించిన అర్జీలు మాత్రమే అర్హత కలిగినవిగా అధికారులు నిర్ధారించారు. 977 అర్హత లేనివిగా తేల్చారు. 83 అర్జీలపై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచారు. ఇవన్నీ పూర్తి చేసినట్లయితే ఇప్పటికే ఇచ్చిన రూ.768 కోట్ల పరిహారంతోపాటు ఇవ్వాల్సిన మిగిలిన దాదాపు రూ.112 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు అవసరం అవుతాయని అధికారులు నివేదిక తయారు చేశారు. ముందుగా ప్రకటించిన పరిహారాన్ని వెంటనే ఇచ్చిన తరువాత గ్రీవెన్స్‌పై నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పరిహారం ఇస్తామని ప్రభుత్వం భరోసా ఇవ్వడంతో నిర్వాసితులు గ్రామాలను ఖాళీ చేసి బయటకు వస్తున్నారు.