బారులు.. రద్దీ
ABN , Publish Date - Apr 28 , 2026 | 01:55 AM
జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత సమస్య కొనసాగుతూనే ఉంది. పలుచోట్ల అసలు ఆయిల్ అందుబాటులో లేక బంకులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉన్నచోట ఆయిల్ కోసం భారీగా వాహనాలు బారులు తీరుతున్నాయి.
కొనసాగుతున్న పెట్రోలు, డీజిల్ ఇక్కట్లు
పలుచోట్ల బంకులు ఖాళీ, ఉన్నచోట్ల రేషన్
గంటల కొద్దీ ఆయిల్ కోసం నిరీక్షణ
అయినా అరకొర పంపిణీతో అవస్థలు
గామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణం
గ్రానైట్ క్వారీల్లో సాగని పనులు
జిల్లావ్యాప్తంగా అధికారుల పర్యవేక్షణ
ఒంగోలు ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత సమస్య కొనసాగుతూనే ఉంది. పలుచోట్ల అసలు ఆయిల్ అందుబాటులో లేక బంకులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉన్నచోట ఆయిల్ కోసం భారీగా వాహనాలు బారులు తీరుతున్నాయి. జిల్లాలోని ఏప్రాంతంలో చూసినా సోమవారం ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఫలితంగా సాధారణ ద్విచక్రవాహనదారుల నుంచి భారీ వాహనాల వారి వరకు ఆయిల్ కోసం తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు. పట్టణాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జిల్లాలో అధికారిక సమాచారం ప్రకారం 196 ఆయిల్ బంకులు ఉన్నాయి. ప్రధాన కంపెనీలైన భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తోపాటు మరికొన్ని చిన్నచిన్న కంపెనీల ద్వారా డీజిల్, పెట్రోల్ సరఫరా అవుతోంది. వారంరోజులుగా సరఫరా తగ్గిపోయింది. ఆది, సోమవారాల్లో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఫలితంగా జిల్లాలో ఆదివారం తెల్లవారుజాము నుంచి డీజిల్ పంపిణీ నిలిచిపోయింది. సాయంత్రానికి పెట్రోల్ కొరత కూడా ఏర్పడింది. సోమవారం కూడా అదే పరిస్థితి కొనసాగింది.
రంగంలోకి అధికార యంత్రాంగం
జిల్లాలోని దాదాపు 40శాతం బంకులు ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోలు, డీజిల్ సరఫరా లేక నిలిచిపోయాయి. కొన్ని బంకుల వారు నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేయగా, మరికొందరు బంకుల బయట తాళ్లు కట్టి ఆయిల్ లేదని అర్థమయ్యేలా చేశారు. ఈ పరిస్థితి పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో అధికంగా కనిపించింది. మిగిలిన బంకులలో కొన్నిచోట్ల డీజిల్ లేకుండా పెట్రోలు మాత్రమే అందుబాటులో ఉండగా ఇతరచోట్ల రెండూ ఉన్నాయి. అలాంటి చోట్ల కూడా డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేకపోవడంతో ఆయిల్ కోసం చిన్న, పెద్ద వాహనాలు బారులు తీరి రద్దీ నెలకొంది. జిల్లా యంత్రాంగం జోక్యంతో రేషన్ విధించి పంపిణీ చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే జిల్లాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలో జేసీ కల్పనాకుమారి, ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఈ వ్యవహారంపై దృష్టిసారించారు. జిల్లాకు సరఫరా అయ్యే ఆయిల్ పక్కదారి పట్టకుండా బంకుల యజమానులు కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు చేపట్టారు. సోమవారం కూడా జిల్లాలో పలు బంకులు ఖాళీగా ఉండటం, ఆయిల్ ఉన్నచోట్ల వాహనాలు బారులు తీరి రద్దీ నెలకొనడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు నివారించడంపై దృష్టి సారించారు.
పోలీసు, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణ
జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ క్షేత్రస్థాయిలో ఇక్కట్లు తీర్చేందుకు బంకుల వద్ద పోలీస్, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణలో ఆయిల్ పంపిణీ చేసేలా ఏర్పాటు చేశారు. బంకులలో నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో చీమకుర్తిలో బంకులను ఎస్పీ హర్షవర్థన్‌రాజు తనిఖీ చేయగా, అద్దంకి, ఒంగోలు ప్రాంతాల్లో జేసీ కల్పనాకుమారి స్వయంగా పరిశీలించారు. అలా ఆయిల్ పక్కదారి పట్టకుండా యంత్రాంగం చర్యలు చేపడుతున్నా అసలు సరఫరా సరిలేక చాలా బంకులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అరకొరగా సరఫరా జరిగిన బంకుల వద్ద రాత్రింబవళ్లు వాహనాలు బారులు తీరి రద్దీ కనిపిస్తున్నాయి. ఎండతీవ్రత అధికంగా ఉంటున్న మధ్యాహ్నం వేళ కూడా బంకుల వద్ద గంటల తరబడి వాహనదారులు వేచి ఉండటం ఆయిల్ ఇక్కట్లను పట్టిచూపుతోంది. ఇదిలాఉండగా సగటున రోజుకు 2లక్షల లీటర్ల డీజిల్ వాడకం జరిగే చీమకుర్తి, బల్లికురవ ప్రాంతాల్లోని గ్రానైట్ క్వారీలు సోమవారం కూడా సరిగా పనిచేయలేదు. బల్లికురవ ప్రాంతంలో దాదాపు అన్ని క్వారీలు మూతపడ్డాయి. చీమకుర్తి ప్రాంతంలో అరకొరగా సాగాయి. సీఎం స్వయంగా జోక్యం చేసుకొని పరిస్థితిని సమీక్షించి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం పరిస్థితి మెరుగవుతుందని అధికారవర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఇంధన కొరత లేదు : కలెక్టర్
జిల్లాలో ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. సోమ వారం కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో జేసీ కల్పనాకుమారితో కలిసి ఏర్పాటుచేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్ కొరతపై సోషల్ మీడియాలో వదంతులు వచ్చి ప్రజలు బల్క్‌గా తీసుకెళ్లడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లాలో 195 పెట్రోలు బంకులు ఉన్నాయ న్నారు. ప్రతిచోటా కానిస్టేబుల్, వీఆర్వోను నియమించి పూర్తిస్థాయిలో పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా మండలాల పరిధిలోని పెట్రోలు బంకులను పర్యవేక్షించేలా తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేశామన్నారు. ఎస్పీ, జేసీ సోమవారం ఉదయం నుంచి జిల్లాలోని అన్ని బంకుల వద్ద సరఫరా, వినియోగంపై డేటాను తెప్పించుకొని పర్యవేక్షించడంతో పాటు కొన్నింటిని స్వయంగా సందర్శించి పరిస్థితులను పరిశీలించారన్నారు. జిల్లాలో నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. క్యాన్ల ద్వారా ఇంధనాన్ని తీసుకెళ్లరాదన్నారు. బల్క్‌గా ఇంధనం కావాల్సిన వారి వివరాలు సేకరించి ఆ మేరకు సరఫరా చేస్తామని తెలిపారు. అధికారుల ఆదేశాలను పాటించకుండా ఎక్కువ మొత్తం ఇంధనం అమ్మితే బంకుల యజమానులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజాబాబు హెచ్చరించారు.