Share News

నాణ్యత ప్రధానం

ABN , Publish Date - Feb 07 , 2026 | 02:31 AM

రానున్న పొగాకు సీజన్‌లో ధరలు ప్రతికూలంగా ఉంటాయన్న సంకేతాలు ఇటు రైతులు, అటు బోర్డు అధికారుల్లో ఒకింత ఆందోళన కలిగిస్తోంది. సిగరెట్ల విక్రయాలపై జీఎస్టీ 40శాతానికి పెంపు, సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం విధింపు తీవ్ర ప్రభావం చూపనుంది.

నాణ్యత ప్రధానం
పొగతోటను పరిశీలిస్తున్న బోర్డు ఈడీ విశ్వశ్రీ

పొగాకు బోర్డు అధికారుల విస్తృత ప్రచారం

రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన

తాజాగా పొగాకుపై ఎక్సైజ్‌ సుంకం రద్దుతో కొంత ఊరట

ఆందోళనకరంగానే సిగరెట్లపై జీఎస్టీ పెంపు

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన కీలక నేతలు

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని వినతి

కర్ణాటకలో వేలం పునఃప్రారంభం, తగ్గిన గరిష్ఠ ధరలు

రానున్న ఆంధ్ర మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం

ఒంగోలు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : రానున్న పొగాకు సీజన్‌లో ధరలు ప్రతికూలంగా ఉంటాయన్న సంకేతాలు ఇటు రైతులు, అటు బోర్డు అధికారుల్లో ఒకింత ఆందోళన కలిగిస్తోంది. సిగరెట్ల విక్రయాలపై జీఎస్టీ 40శాతానికి పెంపు, సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం విధింపు తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ కారణంగా కర్ణాటకలో గతనెలఖరు నుంచి పొగాకు కొనుగోళ్లను వ్యాపా రులు నిలిపివేశారు. ఆ ప్రభావం మరో నెలలో ప్రారంభంకానున్న ఆంధ్ర మార్కెట్‌పై తీవ్రంగానే ఉండే అవ కాశం ఉంది. దీనిని ముందే గుర్తించిన పొగాకు బోర్డు అధికారులు గతం కన్నా ఎక్కువగా ఈసారి పంట నాణ్యతపై దృష్టి సారించారు. మొక్కలు నాటడం నుంచి తోటల పెంపకం, ఆకు రెలుపు, ఎరువుల వినియోగం, బ్యారన్‌లలో కాల్పు, గ్రేడింగ్‌ తదితర సమయాల్లో తీసుకోవాల్సిన మెలకువలపై విస్తృతంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

పెరిగిన పొగాకు ఉత్పత్తి

సాధారణంగా ప్రపంచ దేశాల్లో ఈసారి పొగాకు ఉత్పత్తి పెరిగింది. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈసారి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయన్న చర్చ సాగుతోంది. ఈక్రమంలో కేంద్రం విధించిన అదనపు పన్నులతో మరింత ప్రతికూలత ఎదురవడం ఖాయమని ఆ రంగంపై అవగాహన ఉన్న వారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో కొనుగోళ్లు జరుగుతుండగా కేంద్రం పన్నుల పెంపు నేపథ్యంలో గతనెల 24నుంచి వ్యాపారులు అక్కడ కొనుగోళ్లను నిలిపేశారు. అయితే ముడి పొగాకుపై విధించిన 18శాతం పన్నును రద్దు చేస్తూ కేంద్రం గెజిట్‌ ఇచ్చింది. దాని వల్ల కొంత ఊరట లభించింది. ఈ నేపథ్యంలో ఈనెల 4న కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ను టీడీపీ పార్లమెంట్‌ ప్రతిపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయులు నేతృత్వంలో ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, రైతు ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సిగరెట్లపై అటు సెంట్రల్‌ ఎక్సైజ్‌, ఇటు జీఎస్టీ 40శాతం విధింపు అంశాన్ని పునఃపరిశీలించాలని కోరారు. రెండు పన్నులు లేకుండా ఒకటిగా ఉంచే అంశాన్ని పరిశీలిస్తామని ఆమె హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈనెల 5నుంచి కర్ణాటకలో వ్యాపారులు కొనుగోళ్లను పునఃప్రారంభించారు.

కర్ణాటకలో ధరలు తగ్గించిన వ్యాపారులు

కర్ణాటకలో తొలి నుంచి కిలో రూ.320పైన గరిష్ఠ ధర నిలకడగా సాగుతుండగా ప్రస్తుత పరిణామాలతో గురు, శుక్రవారాల్లో వ్యాపారులు కిలోకు పది రూపాయలు తగ్గించారు. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఆంధ్ర మార్కెట్‌ మరింత గందరగోళంగా ఉంటుందన్న అంచనాకు బోర్డు అధికారులు వచ్చారు. నాణ్యమైన పంట ఉత్పత్తి ద్వారా కొంతమేర ధరలు లభించేలా చూడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరింత అప్రమత్తం చేసేందుకు ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో బోర్డు ఈడీ విశ్వశ్రీ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. వెల్లంపల్లి, ఒంగోలు-2 కేంద్రాల పరిధిలో పలు గ్రామాల్లో పొగాకు తోటలను, కాల్పు చేసిన పొగాకును పరిశీలించారు. రైతులతో భేటీ అయ్యారు. నాణ్యమైన పంట ఉ్పత్తితోనే ఈ ఏడాది మంచి ధరలు లభిస్తాయన్న సంకేతాలను ఇచ్చారు. గ్రేడింగ్‌తోపాటు ఇతర అంశాలపై మరింతగా రైతులకు అవగాహన కల్పించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఆమె వెంట బోర్డు ఉన్నతాధికారులు రామాంజనేయులు, రామారావు, రైతు ప్రతినిధులు ఉన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 02:31 AM