Share News

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌

ABN , Publish Date - Feb 07 , 2026 | 02:33 AM

వినియోగదారులకు లోవోల్జేజీ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు అనేక చర్యలు తీసుకున్నామని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఇప్పటికే పలు సంస్కరణలు చేశామని చెప్పారు.

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌
సమావేశంలో అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న మంత్రి రవికుమార్‌

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ వెల్లడి

నియోజకవర్గంలో రూ.11కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

అధికారులతో సమీక్షా సమావేశం

పాల్గొన్న కలెక్టర్‌ రాజాబాబు, ఎమ్మెల్యే ముత్తుముల

గిద్దలూరు టౌన్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు లోవోల్జేజీ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు అనేక చర్యలు తీసుకున్నామని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఇప్పటికే పలు సంస్కరణలు చేశామని చెప్పారు. శుక్రవారం ఆయన గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించారు. రూ.11 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, కలెక్టర్‌ రాజాబాబుతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాప నలు చేశారు. పట్టణంలోని ఒంగోలు-నంద్యాల జాతీయ రహదారి వద్ద 132కేవీ సబ్‌స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గిద్దలూరు ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మంత్రిని కోరారు. దీనిపై డీఈఈ మేకల రవిశంకర్‌ యాదవ్‌ను మంత్రి ప్రశ్నించగా కొమరోలు మండలం అల్లినగరం ప్రాంతంలో అవసరమైన స్థలం అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. గిద్దలూరు పట్టణంలో సీపీడీసీఎల్‌ డివిజనల్‌ కార్యాలయం ఆవశ్యకతను అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ప్రతిపాదనలు పంపించాలని వారికి సూచించారు. వ్యవసాయానికి ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ కన్‌స్ట్రక్షన్స్‌ ఎస్‌ఈ రాజగోపాల్‌నాయుడు, అధికారులు కిశోర్‌కుమార్‌, కె.సత్యప్రసాద్‌, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 02:33 AM