Share News

బయట కొనుగోళ్లు ప్రారంభం

ABN , Publish Date - Feb 19 , 2026 | 02:29 AM

రైతులు వేలం కేంద్రాల వెలుపల ప్రైవేటు కంపెనీలు, చిరు వ్యాపారులకు పొగాకు అమ్మకాలు ప్రారంభించారు. ప్రధానంగా అధికంగా పంట సాగుచేసిన పెద్ద, చిన్నకారు రైతులు పొగాకును బయట విక్రయిస్తున్నారు. ఈఏడాది మొత్తంగా మేలు రకం దిగుబడి పెరిగింది.

బయట కొనుగోళ్లు ప్రారంభం
క్యూరింగ్‌ అనంతరం రేఖల్లోని పొగాకు

మేలు రకం పొగాకు క్వింటా రూ.26వేలు

పెట్టుబడుల కోసం తెగనమ్ముకుంటున్న రైతులు

కొండపి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : రైతులు వేలం కేంద్రాల వెలుపల ప్రైవేటు కంపెనీలు, చిరు వ్యాపారులకు పొగాకు అమ్మకాలు ప్రారంభించారు. ప్రధానంగా అధికంగా పంట సాగుచేసిన పెద్ద, చిన్నకారు రైతులు పొగాకును బయట విక్రయిస్తున్నారు. ఈఏడాది మొత్తంగా మేలు రకం దిగుబడి పెరిగింది. ఇప్పటికే లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులకు డబ్బులు అవసరం అవుతుండటంతో పొగాకును అమ్ముకుంటున్నారు. ప్రైవేటు వ్యాపారులు నాణ్యమైన పొగాకును క్వింటా రూ.26 వేలకు పది రోజుల క్రితం కొండపి, జరుగుమల్లి మండలాల్లో పలువురు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది. తిరిగి వ్యాపారులు కర్ణాటక మార్కెట్‌ను చూసుకుని తగ్గించారని సమాచారం. ప్రస్తుతం గ్రేడింగ్‌ చేసిన అనంతరం నాణ్యమైన బ్రైట్‌ రకం పొగాకును క్వింటా రూ.23వేల నుంచి 24 వేల వరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే టంగుటూరుకు చెందిన పలువురు ప్రైవేటు వ్యాపారులు కొండపి, జరుగుమల్లి, టంగుటూరు మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతుల నుంచి మధ్యవర్తుల ద్వారా వందల క్వింటాళ్ల పొగాకును కొనుగోలు చేశారని సమాచారం.

రూ.6వేలు ఆదా

ప్రైవేటుగా విక్రయించుకుంటున్న రైతులు లెక్కలు వేసుకుంటున్నారు. నాణ్యమైన పొగాకును కోల్డ్‌ స్టోరేజీలో భద్రపరిచేందుకు క్వింటాకు రూ.500 ఖర్చవుతుంది. వేలంకేంద్రంలో లైసెన్స్‌పై విక్రయిస్తే క్వింటాకు రూ.2వేల వరకు ఖర్చవుతుంది. ఇవి కాకుండా మూడు నెలల తర్వాత వచ్చే డబ్బులకు వడ్డీలు, ఇతర రవాణా ఖర్చులు మరో రూ.4వేల వరకు అవుతాయని రైతులు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తే వెంటనే డబ్బులు రావడంతోపాటు, ఇప్పుడు పెట్టుబడులకు, అత్యవసరాలకు నగదు అందుతుంది. వేలం కేంద్రాలు ప్రారంభయ్యేసరికి మరో నెలరోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో వేలం కేంద్రం వెలుపల పొగాకు అమ్మకాలు ఊపందుకున్నాయని తెలిసింది.

ప్రైవేటు అమ్మకాలు లేవు... ఐనా అమ్మకోవద్దు

జి.సునీల్‌కుమార్‌, కొండపి పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి

కొండపి పొగాకు వేలం కేంద్రం పరిధిలో ప్రైవేటుగా పొగాకు కొనుగోళ్లు లేవు. అలా జరుగుతున్నట్లు నా దృష్టికి రాలేదు. ఎవరన్నా రైతులు వేలం కేంద్రం వెలుపల పొగాకును అమ్ముకుంటుంటే అటువంటి చర్యలకు పాల్పడవద్దు. వేలంకేంద్రం తెరిచాక అక్కడే పొగాకును లైసెన్స్‌పై విక్రయించుకోవాలి.

Updated Date - Feb 19 , 2026 | 02:30 AM