రాజుపాలెంలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:47 AM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం రాజుపాలెంలోని భారీ విద్యుత్ ప్రాజెక్టు పనులను ఏపీ జెన్‌కోకు ప్రభుత్వం అప్పగించింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ మేరకు తీర్మానం చేశారు.
ఏపీ జెన్‌కోకు పూర్తి నిర్మాణ బాధ్యత అప్పగిస్తూ మంత్రివర్గం తీర్మానం
800 మెగావాట్ల విద్యుత్ ఉత్పతి సామర్థ్యం
ఒంగోలు క్రైం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం రాజుపాలెంలోని భారీ విద్యుత్ ప్రాజెక్టు పనులను ఏపీ జెన్‌కోకు ప్రభుత్వం అప్పగించింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ మేరకు తీర్మానం చేశారు. ప్రస్తుత మార్కాపురం జిల్లాలోని కొమరోలు మండలంలో ఉన్న రాజు పాలెం, నంద్యాల జిల్లా యాగంటిలో ఏర్పాటు చేయనున్న పంప్డ్ సోరేజి విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలు జెన్‌కోకు ఇస్తూ క్యాబి నెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఏపీజెన్‌కో, ఎన్‌హెచ్‌పీసీ జేవీ సంయుక్తంగా చేపట్టాయి. అయితే ప్రస్తుతం పూర్తి బాధ్యతలు జెన్‌కోకి అప్పగించారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ శాఖ అనుమతులు ఇటీవల మంజూరయ్యాయి. ఈ భారీ విద్యుత్ ఉత్పతి ప్రాజెక్టు సామర్థ్యం 800 మెగావాట్లుగా ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికిగాను 334 హెక్టార్ల భూమి అవసరం ఉంది. ఇందులో 73 హెక్టార్లు అటవీ భూమి ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నీటి వనరు తెలుగుగంగ ప్రాజెక్టు. రాష్ట్రప్రభుత్వం మొదటి దశలో పంప్డ్ సోరేజీ ప్రాజెక్టులలో యాగంటి, రాజుపాలెం ఉన్నాయి. పంప్టు స్టోరేజీ అంటే నీటిని ఎగువ, దిగువ రిజర్వాయర్ల మధ్య పంపింగ్ చేస్తూ రీసైకిల్ చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైడ్రాలిక్ పవర్ ఉత్పత్తి అవుతుంది. స్థానికులకు ఉపాధి లభించడంతోపాటు రహదారుల కనెక్టివిటీ పెరుగుతుంది.