నేడు పల్స్‌పోలియో
ABN , Publish Date - Jun 28 , 2026 | 02:55 AM
జిల్లావ్యాప్తంగా ఆది వారం పల్స్ పోలియో జరగనుంది. అందుకు వైద్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని 28 మండలాల్లో ఉన్న 65 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లతోపాటు ఒంగోలు అర్బన్, కందుకూరు మునిసిపాలిటీ, చీమకుర్తి, అద్దంకి నగరపంచాయతీల్లో చుక్కల మందుకు ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్లు పూర్తిచేసిన వైద్యారోగ్యశాఖ
వెంగముక్కలపాలెంలో ప్రారంభించనున్న కలెక్టర్
1.56 లక్షల మంది పిల్లలకు చుక్కలు వేయడమే లక్ష్యం
జిల్లావ్యాప్తంగా అవగాహన ర్యాలీల నిర్వహణ
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఆది వారం పల్స్ పోలియో జరగనుంది. అందుకు వైద్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని 28 మండలాల్లో ఉన్న 65 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లతోపాటు ఒంగోలు అర్బన్, కందుకూరు మునిసిపాలిటీ, చీమకుర్తి, అద్దంకి నగరపంచాయతీల్లో చుక్కల మందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 4.72 లక్షల గృహాలు ఉండగా వాటి పరిధిలో జీరో నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులు 1,56,477 మంది ఉన్నట్లు వైద్యశాఖ అధికా రులు ప్రాథమికంగా గుర్తించారు. అందుకోసం అవసరమైన వ్యాక్సిన్‌ను పీహెచ్‌సీలకు సరఫరా చేశారు. ఆదివారం ఉదయం 8గంటల నుంచి పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని వెంగముక్కలపాలెం అర్బన్ కేంద్రంలో కలెక్టర్ రాజాబాబు ప్రారంభిస్తారు. జిల్లాకు 1.95 లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చింది. పోలియో చుక్కలు వేసేందుకు 4,937 మంది వైద్యాధికారులు, సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో చుక్కలు వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. హైవేలతోపాటు మారుమూల ప్రాంతాల్లో కూడా శిబిరాలను ఏర్పాటు చేశారు. సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి చుక్కలు వేసేందుకు వైద్యశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. పల్స్‌పోలియోపై శనివారం ఒంగోలులో అవగాహన ర్యాలీని ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కమలశ్రీ, జిల్లా ఉప వైద్యాఽశాఖాధికారి డాక్టర్ ఎం.రమేష్‌బాబు, మాస్‌మీడియా అధికారులు శ్రీనివాసులు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా శనివారం పీహెచ్‌సీల పరిఽధిలోనూ అవగాహన ర్యాలీలు నిర్వహించారు.