ప్రజా మరుగుదొడ్లు లేక అవస్థలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:03 AM
వస్త్ర వ్యాపారానికి, కిరాణా వ్యాపారానికి మండలం లోని వలపర్లకు విశేష గుర్తింపు ఉంది. చుట్టు పక్కల 10 గ్రామాలకు వ్యాపార కేంద్రంగా కొనసాగుతోంది.
మార్టూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): వస్త్ర వ్యాపారానికి, కిరాణా వ్యాపారానికి మండలం లోని వలపర్లకు విశేష గుర్తింపు ఉంది. చుట్టు పక్కల 10 గ్రామాలకు వ్యాపార కేంద్రంగా కొనసాగుతోంది. నిత్యం వస్త్రాల కొనుగోలుకు, కిరాణా సరుకులకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వలపర్ల గ్రామానికి ప్రజలు వస్తుం టారు. అంతేగాకుండా గ్రామంలోని స్టేట్ బ్యాంక్‌లో వివిధ పనులు నిమిత్తం, ఇతరత్రా డ్వాక్రా గ్రూపు మహిళలు, ఖాతాదారులు భారీగా వలపర్ల కువస్తుంటారు. అయితే వారికి అత్యవసర సమయంలో వినియోగిం చుకోవడానికి గ్రామంలో ప్రజా మరుగుదొడ్లు లేవు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గత వైసీపీ ప్రభుత్వంలో రెండు మరుగు దొడ్లను నిర్మించారు. అయితే వాటి తలుపులు తాళాలు ఎప్పడూ వేసే ఉంటున్నాయని ప్రజానీకం చెబుతున్నారు. అదిగాకుండా అక్కడ మరుగుదొడ్లు ఉన్నాయన్న సంగతి స్థానికులకు మినహా ఇతర గ్రామాల వారికి తెలియదు. గ్రామం నడిమధ్యలో ఉన్న స్టేట్ బ్యాంక్, వస్త్రదుకాణాల కోసం రోజూ 200 మందికి పైగానే ఇతర గ్రామాలకు చెందిన మహిళలు వస్తుంటారు. వారు అత్యవసరసమయంలో ప్రజా మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ పరిధిలోని ద్వారకపాడు గ్రామానికి చెందిన ప్రజలు సచివాలయాలలో పనులు నిమిత్తం వస్తుంటారు. గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలంలో మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని ప్రజలు పేర్కొన్నారు. దాదాపుగా 12 వేలకు పైగా జనాభా గలిగిన వలపర్ల గ్రామంలో స్థానిక గ్రామ నాయకులు ఈ మరుగుదొడ్లు నిర్మాణంపై శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.