పరిశుభ్రతలో ప్రజా భాగస్వామ్యం
ABN , Publish Date - Apr 19 , 2026 | 03:14 AM
పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా మూడో శనివారం నిర్వహిస్తున్న ప్రజా అవగాహన కార్యక్రమం జిల్లావ్యాప్తంగా శనివారం ఉత్సాహంగా సాగింది.
జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
పలుచోట్ల ప్రదర్శనలు, ప్రతిజ్ఞలు
మర్రిపూడి మండలంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ స్వామి, కలెక్టర్ రాజాబాబు
ఇతరచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు
ఈ విడత నీటి వనరుల వద్ద పారిశుధ్య పనులు
ఒంగోలు, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా మూడో శనివారం నిర్వహిస్తున్న ప్రజా అవగాహన కార్యక్రమం జిల్లావ్యాప్తంగా శనివారం ఉత్సాహంగా సాగింది. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికార యంత్రాంగం పాల్గొంది. పలుచోట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు భాగస్వాములయ్యారు. ప్రతినెలా ఒక్కో అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈనెలలో నీటివనరుల పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యంపై దృష్టి సారించారు. వేసవిలో భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సంరక్షణ లక్ష్యంగా జలధార-జలహారతి పేరుతో ప్రభుత్వం వందరోజుల కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో ఈనెల స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆ అంశాన్ని చేర్చారు. కాగా జిల్లాలో శనివారం వందలాది గ్రామాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతోపాటు అవగాహన ర్యాలీలు, ప్రతిజ్ఞలు వంటివి నిర్వహించారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించారు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, కలెక్టర్ రాజాబాబులు మర్రిపూడి మండలం కెల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతనూతలపాడు చెరువు వద్ద జరిగిన కార్యక్రమానికి అక్కడి ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్ హాజరయ్యారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పట్టణంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శి పట్టణ పరిధిలోని శివరాజ్ నగర వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజీ ట్యాంకు వద్ద నిర్వహించిన కార్యక్రమానికి మునిసిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా ప్రధాన పట్టణాలు, అనేక గ్రామాల్లో కార్యక్రమాలు జరిగాయి. పెద్దసంఖ్యలో ప్రజలు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.