Share News

జలధారలో జన భాగస్వామ్యం

ABN , Publish Date - May 14 , 2026 | 03:23 AM

నీటి వనరుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార-జలహారతి కార్యక్రమం జిల్లాలో ఉపయుక్తంగా సాగే విధంగా యంత్రాంగం కృషి చేస్తోంది. లక్ష్యానికి అనుగుణంగా చెరువులు, కుంటల్లో వర్షపు నీరు నిల్వ, తద్వారా భూగర్భ జలాల పెంపు జరగాలంటే పూడికతీత ప్రధానమని గుర్తించింది.

జలధారలో జన భాగస్వామ్యం
దొనకొండలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌, పక్కన ఇరిగేషన్‌ ఎస్‌ఈ వరలక్ష్మి, ఇతర అధికారులు

కీలకమైన చెరువుల్లో పూడికతీత.. ప్రజల ద్వారానే జంగిల్‌ క్లియరెన్స్‌

కలెక్టర్‌ ఆదేశాలతో దృష్టిసారించిన డ్వామా, ఇరిగేషన్‌ అధికారులు

మండలానికి ఒక చెరువులో ప్రయోగాత్మకంగా పనులు

భూగర్భ జలం తక్కువగా ఉండే దొనకొండ మండలంపై ప్రత్యేక దృష్టి

అక్కడ అన్ని చెరువుల్లోనూ పనులు చేపట్టాలని యోచన

నిధుల కొరతను అధిగమించే ప్రయత్నం

కాలువల్లో ఉపాధి కూలీల ద్వారా పనులు

నీటి వనరుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార-జలహారతి కార్యక్రమం జిల్లాలో ఉపయుక్తంగా సాగే విధంగా యంత్రాంగం కృషి చేస్తోంది. లక్ష్యానికి అనుగుణంగా చెరువులు, కుంటల్లో వర్షపు నీరు నిల్వ, తద్వారా భూగర్భ జలాల పెంపు జరగాలంటే పూడికతీత ప్రధానమని గుర్తించింది. ఆ పని చేయాలంటే నీటివనరులు పెద్దఎత్తున ముళ్లచెట్లతో నిండిపోయి ఉన్నాయి. తొలుత వాటిని తొలగించిన తర్వాత పూడికతీత చేపట్టాలి. అయితే ఆ పనులకు ప్రభుత్వం నుంచి నిధులు పెద్దగా వచ్చే అవకాశం లేదు. దీంతో ఉపాధి కూలీలతో కాలువల్లో మట్టిని తొలగించి, జన భాగస్వామ్యంతో చెరువులలో జంగిల్‌ క్లియరెన్స్‌, పూడికతీత చేపట్టాలని యంత్రాంగం నిర్ణయించింది. నిధుల సమస్యను అధిగమించి జలధార కార్యక్రమాన్ని కొనసాగించే దిశగా ప్రయత్నిస్తోంది.

ఒంగోలు, మే 11 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ఆశించిన విధంగా జలధార కార్యక్రమం సాగాలంటే క్షేత్రస్థాయిలోని అధికారులు, స్థానిక ప్రజానీకం భాగస్వామ్యం, సమన్వయం అవసరమని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ఈ మేరకు కలెక్టర్‌ రాజాబాబు నేతృత్వంలో నిర్వహించిన జిల్లాస్థాయి అధికారుల సమావేశాల్లో గుర్తించారు. తొలుత మండలాల వారీ ఉన్న చెరువులు, కుంటలు, ఆ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ద్వారా వచ్చే నీరు, అది ఎంత నిల్వ ఉంటుంది, వృఽథాగా ఎంతపో తుంది తదితరాలను అఽధికారులు పరిశీలించారు. చాలాచోట్ల చెరువులు, కుంటల్లోకి వస్తున్న నీటిలో అధిక భాగం నిల్వ ఉండకుండా వెళ్లిపోతోంది. దీంతో భూగర్భజలం పెరగడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందన్న దానిపై ఇటీవల ఇరిగేషన్‌, భూగర్భ జలవనరుల శాఖ, డ్వామా అధికారులు అధ్యయనం చేశారు. ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలం తక్కువగా ఉన్నది దొనకొండ మండలంలోనే కావడంతో అక్కడ పరిశీలన చేశారు. అంతేకాక అత్యధికంగా 47 చెరువులు ఆ మండలంలోనే ఉన్నాయి.

పూడికతీస్తేనే లక్ష్యం నెరవేరేది..

అధికారుల అధ్యయనంలో వర్షపు నీరు నిల్వ ఉండకపోవడానికి, భూగర్భ జలంగా మారకపోవడా నికి చెరువులు, కుంటల్లో దీర్ఘకాలంగా పూడికతీత చేపట్టకపోవడమే కారణమని తేల్చారు. చెరువుల్లో మట్టి పైభాగం కాంక్రీటు తరహాలో గట్టిపడి భూమి కింద పొరల్లోకి నీరు వెళ్లడం లేదని గుర్తించారు. ఒకస్థాయి వరకు ఆ మట్టిని తీస్తే తప్ప నీరు నిలిచే అవకాశం లేకపోగా చాలా చెరువుల్లో లోపలి ప్రాంతమంతా ముళ్ల చెట్లతో నిండిపోయి ఉంది. దీంతో ముళ్లచెట్లు తొలగించి పూడికతీస్తేనే జలధార లక్ష్యం నెరవేరదన్న నిర్ణయానికి కలెక్టర్‌ నిర్వహించిన సమీక్షలో గుర్తించారు. అయితే ప్రభుత్వం జలధార కింద ప్రత్యేకంగా నిధులకు అవకాశం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. ఉపాధి కూలీల ద్వారా ప్రధానంగా ఆ పనులు చేయించాలని, అవసరమైన చోట స్థానికంగా నిఽధులు సమకూర్చుకోవాలని కలెక్టర్లకు సూచించింది.

జనంతో పనులు చేపట్టాలి

జిల్లాలో పరిస్థితిని పరిశీలిస్తే.. స్థానికంగా నిధులు పెద్దగా సమకూరే అవకాశం లేకపోగా ఉపాధి కూలీలతో చెరువుల్లో జంగిల్‌ క్లియరెన్స్‌, పూడికతీతలకు అవకాశం లేదన్న నిర్ధారణకు అధికారులు వచ్చారు. దీంతో చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు ఇతరత్రాలు వచ్చే కాలువల్లో పనులను ఉపాధి కూలీల ద్వారా చేయించేలా ప్రతిపాదించారు. జిల్లాలో అలాంటి పనులు 3,805 గుర్తించగా వాటిలో 2,245 పనులను కలెక్టర్‌ మంజూరు చేయగా 781 ఇప్పటికే చేపట్టారు. అయితే ఈ పనులతో కూలీలకు పనుల కల్పన తప్ప జలధార లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. దీంతో జన భాగస్వామ్యంతో చెరువులు, కుంటల్లో జంగిల్‌ క్లియరెన్స్‌, పూడికతీత పనులు చేపట్టాలని సోమవారం రాత్రి ఈ కార్యక్రమంపై నిర్వహించిన కీలక సమీక్షలో కలెక్టర్‌ రాజాబాబు సంబంధిత జిల్లా అధికారులకు సూచించారు.

ప్రతి మండలానికి ఒక గ్రామం

ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని అక్కడ ఉన్న చెరువుల్లో పనులు తక్షణం చేపట్టాలని, జిల్లాలో భూగర్భ జలం అతి తక్కువగా ఉన్న దొనకొండ మండలంలోని అన్ని గ్రామాల్లో పనులు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. తదనుగుణంగా దొనకొండలో మంగళవారం కీలక సమావేశాన్ని నిర్వహించారు. మండల స్థాయిలోని ముఖ్యమైన అధికారులు, డ్వామా క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు ఆ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులతో నిర్వహించిన ఈ సమావేశంలో డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌, జలవనరుల శాఖ ఎస్‌ఈ వరలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. జలధార విజయవంతంపై జిల్లా యంత్రాంగం ఆలోచనను వారికి వివరించి ముందుకు రావాలని కోరారు. అలాగే మండలానికి ఒక చెరువులో ఈ తరహా పనులు చేసేందుకు గ్రామాలను ఎంపిక చేసే పనిలో ఇతర మండలాల అధికారులు ఉన్నారు. ఆచరణలో అనేక ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నా జలధార సక్సెస్‌కు ఇంతకు మించి మార్గం లేదన్న అభిప్రాయంలో జిల్లా యంత్రాంగం ఉన్నట్లు సమాచారం.

Updated Date - May 14 , 2026 | 03:23 AM