మత్స్యకారుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Aug 11 , 2026 | 11:14 PM
రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. సింగరాయకొండ మత్స్యశాఖ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ఆ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాన్స్‌పాండర్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వామి మాట్లాడారు
మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి
సింగరాయకొండ మత్స్యశాఖ కార్యాలయంలో వేటకు వెళ్లే వారికి ట్రాన్స్‌పాండర్లు పంపిణీ
సింగరాయకొండ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. సింగరాయకొండ మత్స్యశాఖ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ఆ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాన్స్‌పాండర్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వామి మాట్లాడుతూ సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌పాండర్లను పంపిణీ చేస్తోందన్నారు. మత్స్యకారులకు రూ.73 లక్షల విలువ గల ట్రాన్స్‌పాండర్లను అందజేస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో ప్రమాదాల్లో చిక్కుకున్న సమయంలో పడవ ఎక్కడుందో గుర్తించడానికి, అత్యవసర సమయాల్లో ఎస్‌వోఎస్ సందేశాలు పంపడానికి అవకాశం ఉంటుందని వివరించారు. వేట నిషేధ భృతిని రూ.10వేల నుంచి రూ. 20వేలు పెంచి గంగపుత్రులకు ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తుచేశారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందన్నారు. 40శాతం సబ్సిడీతో వేట సామగ్రిని అందజేస్తున్నామని తెలిపారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు లైఫ్‌జాకెట్లు అందజేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్ అందజేత బంకు పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి రవికుమార్, తహసీల్దార్ ఎన్‌వీబీ రాజేష్, ఇన్‌చార్జి ఎంపీడీవో వెంకట్రావు, మండల మత్స్యశాఖ అధికారిణి వర్షిణి, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య, నేతలు షేక్ సందానీబాషా, కూనపరెడ్డి సుబ్బారావు, కృష్ణ, చంటి, మండల జనసేన అధ్యక్షుడు రాజేష్ పాల్గొన్నారు.