Share News

రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్రానికి ప్రతిపాదనలు

ABN , Publish Date - Jul 04 , 2026 | 10:59 PM

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన సూచనలతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డీఎ్‌సబీవీ స్వామి సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్రానికి ప్రతిపాదనలు
మాట్లాడుతున్న మంత్రి స్వామి, పక్కన ఎంపీ మాగుంట

మంత్రి డాక్టర్‌ స్వామి

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన సూచనలతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డీఎ్‌సబీవీ స్వామి సూచించారు. జరుగుమల్లి నుంచి 16వ నెంబర్‌ రహదారిలోకి ప్రవేశించే ప్రదేశంలో ప్రమాదాలను నివారించేందుకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటుకు పరిశీలించి ప్రతిపాదనలు పంపించాలన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని మీ కోసం హాలులో శనివారం సాయంత్రం జరిగిన దిశా సమావేశానికి కమిటీ అధ్యక్షుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి స్వామి మాట్లాడుతూ సాంకేతిక సమస్యలు ఉంటే సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. రామతీర్థం నుంచి నీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలపై తక్షణమే దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎంపీ మాగుంట మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులు దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ ఇతర నియోజకవర్గాల్లో ఉపాధి పథకంలో మ్యాజిక్‌ డ్రైనేజీల పనుల్లో పురోగతి ఉందని, ఒంగోలు నియోజకవర్గంలో కూడా పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మేదరమెట్ల వద్ద ఉన్న మంచినీటి పథకం నుంచి ఒంగోలు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొత్తపట్నంలో జలజీవన్‌ మిషన్‌ పథకం కింద పనులను వేగవంతం చేయాలన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీలకు పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించలేదన్నారు. త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏడుగుండ్లపాడు వద్ద జాతీయ రహదారిపై డ్రైనేజీ సరిగా లేకపోవడం వల్లవర్షపు నీరు నిలిచిపోతుందని, ఆ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో డీజీపేట వద్ద తాగునీటి కాలువకు జాతీయ రహదారి అడ్డుగా వస్తుందన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా దృష్టిసారించాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి సంబంధిత అంశాలపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు పలు అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జాయింట్‌ కలెక్టర్‌ పులి శ్రీనివాసులు, దిశా కమిటీ నామినేటెడ్‌ సభ్యలు కే శ్రీనివాసరావు, బి. మార్క్‌తో పాటు పలుశాఖల అధికారులు ఉన్నారు. అనంతరం ఒంగోలులోని జవహర్‌ నవోదయ విద్యాలయానికి ఎంపీ లాడ్స్‌ నిధుల నుంచి కేటాయించిన రెండు ఓమినీ వాహనాలను ప్రారంభించారు.

Updated Date - Jul 04 , 2026 | 10:59 PM