Share News

ఆశాజనకంగా ధరలు

ABN , Publish Date - Feb 07 , 2026 | 02:29 AM

రబీ సీజన్‌లో సాగుచేసిన వరి పంట దిగుబడులు అధికంగా వస్తున్నాయి. మార్కెట్‌ కూడా ఆశాజనకంగా ఉండటంతో గిట్టుబాటు ధర లభిస్తోంది. లాభాలు కనిపిస్తుండటంతో మాగాణి రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సాగర్‌ ఆయకట్టు కింద రబీలో సాగు చేసిన వరి కోతలు కోసి ముమ్మరంగా కల్లాలు చేస్తున్నారు.

ఆశాజనకంగా ధరలు
ధాన్యాన్ని గోతాలకు నింపుతున్న కూలీలు

రబీలో పెరిగిన ధాన్యం దిగుబడులు

లాభాల బాటలో రైతులు

దర్శి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : రబీ సీజన్‌లో సాగుచేసిన వరి పంట దిగుబడులు అధికంగా వస్తున్నాయి. మార్కెట్‌ కూడా ఆశాజనకంగా ఉండటంతో గిట్టుబాటు ధర లభిస్తోంది. లాభాలు కనిపిస్తుండటంతో మాగాణి రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సాగర్‌ ఆయకట్టు కింద రబీలో సాగు చేసిన వరి కోతలు కోసి ముమ్మరంగా కల్లాలు చేస్తున్నారు. ఎకరాకు 40 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. రాజంపల్లి, జముకులదిన్నె గ్రామాల్లో కొద్దిమందికి 55 బస్తాల వరకు వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో ధరలు కూడా ప్రస్తుతం బాగానే ఉన్నాయి. రెండునెలల క్రితం ప్రైవేట్‌ వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను దగా చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో మార్పు వచ్చింది. తొలుత ఆ కేంద్రాల్లో మందకొడిగా కొనుగోళ్లు సాగటంతో రైతుల నుంచి విమర్శలు వచ్చాయి. జిల్లా అధికారుల జోక్యంతో కొనుగోళ్లు ముమ్మరం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం గ్రేడ్‌-1 రకం ధాన్యం 70 కేజీ బస్తా రూ.1,792, సాధారణ రకం రూ.1,777కు కేంద్రాల్లో కొంటున్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లో నగదు వారి బ్యాంకు అకౌంట్లకు జమ అవుతోంది. విక్రయించుకునేందుకు కొంత ఆలస్యమైనా రైతులు కేంద్రాల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రైవేట్‌ వ్యాపారులు తప్పనిసరి పరిస్థితిలో ధరలు పెంచి కొనుగోళ్లు చేస్తున్నారు. వారు కూడా గ్రేడ్‌-1 రకం ధాన్యాన్ని 75 కేజీల బస్తాను రూ.1,800కు కొనుగోలు చేస్తున్నారు. 15 రోజులలోపు డబ్బులు చెల్లిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం ఎక్కడ విక్రయించినా రైతులకు సమానంగా రాబడి వస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే ప్రైవేట్‌ వ్యాపారుల చేతుల్లో రైతులు దగా పడేవారు. కూటమి ప్రభుత్వం సమస్యను ముందుగానే గుర్తించి కేంద్రాల నిర్వహణకు అవసరమైన మేరకు నిధులు జమ చేసింది. దీంతో మాగాణి రైతులకు పెట్టుబడులు పోను లాభాలు మిగులుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల్లో కొనుగోలు చేయని ఎంపీయూ 10-10 రకం ధాన్యాన్ని మాత్రం ప్రైవేట్‌ వ్యాపారులు కొంతమేర తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ రకం ధాన్యం దిగుబడి 40 నుంచి 50 బస్తాలు వస్తుండటంతో బీపీటీతో సమానంగా లాభం వస్తుంది. అందువల్ల అన్నిరకాల పంటలు వేసిన ధాన్యం రైతులకు లాభాలు వస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 07 , 2026 | 02:29 AM