పరస్పర సహకారంతో ప్రగతిపథం
ABN , Publish Date - Jan 27 , 2026 | 02:41 AM
గణతంత్ర వేడుకలు జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా జరిగాయి. వాడవాడలా జాతీయ జెండా రెపరెపలాడింది. ఒకవైపు ప్రభుత్వం తరఫున అధికార యంత్రాంగం, మరోవైపు వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు, ఇతరత్రా వందలాది ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు.
రూ.4.27లక్షల తలసరి ఆదాయమే లక్ష్యం
మూడు కీలక రంగాల్లో ఏటా 15శాతం వృద్ధి సాధనకు ప్రణాళికలు
గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్ రాజాబాబు వెల్లడి
ఒంగోలు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ
ఉత్సాహంగా సాగిన వేడుకలు
ఆకర్షణీయంగా శకటాల ప్రదర్శన
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
భారీగా ప్రశంసాపత్రాలు అందజేత
పథకాలను వివరిస్తూ స్టాల్స్ ఏర్పాటు
గణతంత్ర వేడుకలు జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా జరిగాయి. వాడవాడలా జాతీయ జెండా రెపరెపలాడింది. ఒకవైపు ప్రభుత్వం తరఫున అధికార యంత్రాంగం, మరోవైపు వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు, ఇతరత్రా వందలాది ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. విభిన్నవర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రధాన వేడుకల్లో కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. జిల్లా ప్రగతిపథంలో నడిచేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకుంటూ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పాల్గొన్న ప్రముఖులు పిలుపునిచ్చారు.
ఒంగోలు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలి. జిల్లా ప్రగతిపథాన సాగేందుకు అన్నివర్గాలు పరస్పర సహకారం అందించాలి. 2028-29 నాటికి రూ.4.27 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం. వికసిత్ భారత్‌లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 పేరుతో రాష్ట్రప్రభుత్వం ఏటా 15శాతం వృద్ధి రేటు లక్ష్యంతో సాగుతోంది. తదనుగుణంగా జిల్లాలో మూడు కీలక రంగాలలో వృద్ధి సాధించడం ద్వారా తలసరి ఆదాయం పెరిగేలా చేస్తాం’ అని కలెక్టర్ పి.రాజాబాబు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ రాజాబాబు జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వ లక్ష్యాలు, వాటి సాధనకు అమలు చేస్తున్న పథకాలు, ఆయావర్గాల వారికి అందుతున్న ఫలాలు, జిల్లా అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ప్రస్తుతం జిల్లాలో తలసరి ఆదాయం రూ.2.15 లక్షలుగా ఉండగా వ్యవసాయ, పరిశ్రమలు, సర్వీసు రంగాలలో ఏటా 15శాతం వృద్ధి రేటుతో 2028-29 నాటికి రూ.4.27 లక్షలు సాధించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ అమలుకు స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే మండలస్థాయి ప్రణాళికలు రూపొందించి స్వర్ణాంధ్ర కోసం సీఎం ప్రవేశపెట్టిన పది సూత్రాల ద్వారా వృద్ధి రేటు లక్ష్యాన్ని సాధించినట్లు వివరించారు. పేదరిక నిర్మూలన కోసం పీ4 విధానాన్ని ప్రభుత్వం తీసుకరాగా జిల్లాలో 79,099 బంగారు కుటుంబాలను గుర్తించారన్నారు. ఇప్పటివరకు 3,753 మార్గదర్శకుల ద్వారా 26,275 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పథకాల పురోగతిని వివరిస్తూ.. వసతిగృహాల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి ఒక్కొక్క హాస్టల్‌కు ఒక అధికారి పర్యవేక్షణతో వసతులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
మాతాశిశు మరణాల రేటును తగ్గించాం
ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు నీటిట్యాంకులు, వనరులను శుభ్రపర్చామన్నారు. ప్రసూతి ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టిసారించి మాతాశిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించామన్నారు. పదవ తరగతిలో నూరుశాతం ఉత్తీర్ణత లక్ష్యంతో వంద రోజులు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ప్రజాఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తున్నదని తదనుగుణంగా జిల్లా డివిజన్, మండల స్థాయిలో పరిష్కార వేదికలు నిర్వహిస్తున్నామన్నారు. గతేడాది జూన్ నుంచి 30,907 ఫిర్యాదులు అందగా 29,384 పరిష్కారం జరిగాయని మిగతా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ విధానం తీసుకరాగా ఇప్పటివరకు మూడు పర్యాయాలు నిర్వహించగా 424 ఫిర్యాదు వచ్చాయన్నారు. అందులో 400 పరిష్కారం చేశామన్నారు. జిల్లాలో 28 మండలాల్లో 497 గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉండగా 276 గ్రామాల్లో పూర్తయిందని, 85 గ్రామాల్లో పురోగతిలో ఉందని వివరించారు. ఈఏడాది డిసెంబరు ఆఖరుకు మిగిలిన గ్రామాల్లోనూ పూర్తిచేస్తామన్నారు. భూవివాదాలకు తావులేకుండా భూహక్కుల కల్పన లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.
మినరల్ ఫండ్స్‌తో మౌలిక సదుపాయాలు
వ్యవసాయ, ఉద్యాన, మైక్రో ఇరిగేషన్‌శాఖల ద్వారా రైతు సంక్షేమం కోసం వివిధ రాయితీ పథకలు అమలు చేస్తున్నామన్నారు. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ ఏడాది రెండు విడతలుగా సుమారు రూ.253 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. జిల్లా గనులశాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.253.69 కోట్లు రాబడి వచ్చిందన్నారు. మినరల్ ఫండ్ ద్వారా ట్రస్టు ఏర్పాటు జరిగాక రూ.94.64 కోట్లతో 155 మౌలిక సదుపాయాల పనులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అన్ని గ్రామాలకు సురక్షిత నీటిసరఫరా కోసం డీపీఆర్‌లు సిద్ధం అవుతున్నాయని, గుండ్లకమ్మ ప్రాజెక్టు 14 గేట్లు పనులు పూర్తితో ప్రస్తుతం మూడు టీఎంసీల నీరు నిల్వ చేయగలిగామని వెల్లడించారు. వివిఽఽధ పథకాల కింద ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో రూ. 122.98 కోట్లతో 139 పనులు మంజూరు కాగా వివిధ దశల్లో ఉన్నాయని, అలాగే పీఆర్ శాఖ పరిధిలో వివిధ పథకాల ద్వారా రూ.116 కోట్లతో 61 పనులు మంజూరుకాగా ఆ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు
విద్యుత్, డ్వామా, డీఆర్‌డీఎ, విద్య, వైద్యం, ఇతర సంక్షేమశాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలను కలెక్టర్ రాజాబాబు వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పరిధిలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయకుమార్, ఎస్పీ హర్షవర్థన్‌రాజు, జేసీ గోపాలకృష్ణ, డీఆర్వో ఒబులేషు ఇతర అధికారులు పాల్గొనగా వేడుకల సందర్భంగా ప్రదర్శించిన వివిధ శాఖల శకటాలు ఆకర్షణీయంగా సాగగా సాంస్కృతిక ప్రదర్శనలు, ఆయా శాఖల స్టాల్స్ ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధుల వారసులను కలెక్టర్ ఈసందర్భంగా సత్కరించారు.