ఉత్పత్తి తగ్గాలి.. నాణ్యత పెరగాలి
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:42 PM
ప్రస్తుత సీజన్ పొగాకు మార్కెట్లో నెలకొన్న తీవ్ర సంక్షోభం, రైతులకు ఎదురైన ప్రతికూల పరిస్థితి వచ్చే ఏడాది తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పొగాకు బోర్డు సెక్రటరీ దివి వేణుగోపాల్ తెలిపారు.
వచ్చే సీజన్ పొగాకు మార్కెట్‌పై ఇప్పటి నుంచే దృష్టి
నారుమడుల నుంచే నియంత్రణ చర్యలు
గ్రామస్థాయి వరకు విస్తృత అవగాహన
తక్కువ వ్యవధిలో వేలం పూర్తికి అధ్యయనం
పొగాకు బోర్డు సెక్రటరీ వేణుగోపాల్
ఒంగోలు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత సీజన్ పొగాకు మార్కెట్లో నెలకొన్న తీవ్ర సంక్షోభం, రైతులకు ఎదురైన ప్రతికూల పరిస్థితి వచ్చే ఏడాది తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పొగాకు బోర్డు సెక్రటరీ దివి వేణుగోపాల్ తెలిపారు. దీనిపై ఇప్పటి నుంచే రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తామని చెప్పారు. నారుముడులు పెట్టే సమయం నుంచే పంట సాగు, ఉత్పత్తి నియంత్రణ చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం పొగాకు బోర్డు ప్రాంతీయ మేనేజర్ ప్రసాద్‌తో కలిసి స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేణుగోపాల్ మాట్లాడారు. రాష్ట్రంలో 2025-26 పంట కాలానికి 142 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతిస్తే 236మిలియన్ కిలోలు పండినట్లు అంచనా వేశామన్నారు. ఇప్పటి వరకు 56 మిలియన్ కిలోల పంట కొనుగోలు జరిగిందని తెలిపారు. రైతులకు కిలోకు రూ.213 సగటు ధర లభించిందన్నారు. ప్రారంభించిన నాలుగైదు నెలల్లోనే వేలం పూర్తి కావాల్సి ఉండగా ఈ సీజన్‌లో ఆ పరిస్థితి లేదన్నారు. కచ్చితంగా డిసెంబర్ ఆఖరు వరకూ సాగే అవకాశం కనిపిస్తున్నదని చెప్పారు. గత రెండు మూడు నెలలుగా మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థిని అధిగమించేందుకు ప్రజాప్రతినిధుల చొరవతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బోర్డు తీసుకున్న చర్యలు రైతులకు ఉపకరిస్తున్నాయని వేణుగోపాల్ చెప్పారు.
పంట సాగు, ఉత్పత్తి పెరగకుండా నియంత్రిస్తాం
రానున్న సీజన్‌లో మంచి ధరలు లభించాలంటే పంట ఉత్పత్తి తగ్గింపు, నాణ్యత పెంపు ప్రధానమన్నారు. దీన్ని గుర్తించి రానున్న సీజన్‌కు పంట ఉత్పత్తిని 81 మిలియన్ కిలోలకు పరిమితం చేస్తూ నిర్ణయించామన్నారు. ఆ పరిమాణం పెరగకుండా ఉండేందుకు నారుమడుల నుంచే నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రైతులు అనధికారికంగా సాగు చేయకుండా ఉండేలా వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో కలిసి చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తగా బ్యారన్లు నిర్మించడం, కౌలు రైతులు సాగులోకి రావడం మంచిదికాదన్నారు. రసాయనిక ఎరువుల స్థానంలో పశువుల ద్వారా లభించే ఎరువును ఉపయోగించాలని, పచ్చిరొట్ట పైర్లు సాగు చేయాలని రైతులకు వేణుగోపాల్ సూచించారు. దీంతోపాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీటన్నింటినీ రైతుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వేలం కేంద్రాల వారీ అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కందుకూరులోని రెండు వేలం కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశామన్నారు. గురువారం టంగుటూరు, కొండపిలో నిర్వహించామన్నారు. అలా అన్ని వేలం కేంద్రాల్లో సమావేశాలు పూర్తి చేస్తామన్నారు. అనంతరం గ్రామ స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. నెలల తరబడి వేలం సాగడం ఇబ్బందికరంగా ఉందని ఆయన చెప్పారు. ఈనేపథ్యంలో మరింత మెరుగ్గా, పటిష్టంగా వేలం ప్రక్రియ నిర్వహణపై అధ్యయనం కోసం బోర్డు ప్రత్యేక కమిటీని నియమించిందని చెప్పారు. జోన్‌ల వారీ అధికారులు, రైతులతో ఈ కమిటీ చర్చిస్తుందని తెలిపారు.