ఉత్పత్తి తగ్గింపు.. వేగంగా వేలం
ABN , Publish Date - Aug 20 , 2026 | 02:19 AM
ప్రస్తుత పొగాకు మార్కెట్ ఒడిదొడుకులకు అధికోత్పత్తే కారణం. అలాగే యుద్ధంతో ఎగుమతులకు ప్రతికూలత, ఇతర దేశాల్లో భారీగా పంట ఉత్పత్తి, జీఎస్టీ పెంపు వంటివి కీలకంగా మారాయని బోర్డు విశ్లేషిస్తోంది.
వచ్చే సీజన్‌పై ఇప్పటి నుంచే పొగాకు బోర్డు కసరత్తు
సాగు, ఉత్పత్తి నియంత్రణ
పంట నాణ్యత పెంపుపై రైతులకు విస్తృత అవగాహన
వేలం కేంద్రాల వారీ రైతు ప్రతినిధులతో సమావేశాలు
ఆతర్వాత ముఖ్యమైన గ్రామాల్లోనూ నిర్వహణ
వేలంలో మార్పుల అధ్యయనంపై కమిటీ ఏర్పాటు
గుంటూరులోని బోర్డు కార్యాలయంలో జరిగిన తొలి భేటీ
రేపు ఒంగోలులో దక్షిణాది రీజియన్ స్థాయి సమావేశం
ప్రస్తుత పొగాకు మార్కెట్ ఒడిదొడుకులకు అధికోత్పత్తే కారణం. అలాగే యుద్ధంతో ఎగుమతులకు ప్రతికూలత, ఇతర దేశాల్లో భారీగా పంట ఉత్పత్తి, జీఎస్టీ పెంపు వంటివి కీలకంగా మారాయని బోర్డు విశ్లేషిస్తోంది. వాటి నుంచి పూర్తిస్థాయిలో రైతులను గట్టెక్కించేందుకు చేపట్టిన చర్యలేవీ లాభం లేకుండాపోయాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యంతో కొన్ని అంశాలను అధిగమించి వారంరోజులుగా మార్కెట్‌ను కొంత గాడిలో పెట్టగలిగింది. తదనుగుణంగా ప్రస్తుత సీజన్ వేలం కొనసాగుతుందని ఆశిస్తున్న బోర్డు యంత్రాంగం వచ్చే సీజన్‌పై దృష్టి సారించింది. పంట సాగును నియంత్రించడం, వేగంగా వేలం నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటి నుంచే కసరత్తు చేపట్టింది.
ఒంగోలు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్ సంక్షోభం నుంచి తేరుకుంటున్న బోర్డు.. రానున్న సీజన్‌లో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించింది. తమ పరిధిలో ఉన్న రెండు అంశాలపై అధికారులు కసరత్తు చేపట్టారు. ప్రధానంగా పంట సాగు నియం త్రణ, నాణ్యత పెంపు, వీలైనంత వేగంగా వేలం ప్రక్రియ పూర్తి, అందుకు అవసరమైన చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ రెండింటిలో తొలుత పంట ఉత్పత్తి తగ్గింపుపై పక్షం క్రితమే బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వేలం కొనసాగుతున్న 2025-26 సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో 142 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతి ఇస్తే సుమారు 236 మిలియన్ కిలోలు పండినట్లు అంచనా వేశారు. మార్కెట్ ప్రతికూలతకు ప్రధాన కారణాలలో ఒకటిగా ఈ అధిక ఉత్పత్తిని గుర్తించిన పొగాకు బోర్డు వచ్చే సీజన్‌కు భారీ కోత విధించింది. ప్రస్తుతం కన్నా ఏకంగా 43శాతం తగ్గించి 81 మిలియన్ కిలోలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే ఆచరణలో అంత తక్కువగా పండించేలా రైతులపై ఒత్తిడి తీసుకురావడం, అలాగే పంటలో నాణ్యత పెంచడం అంత సులభమైన విషయమేమీ కాదు. అదే అంచనాతో ఉన్న బోర్డు అధికారులు వచ్చే సీజన్ సాగుకు నారుమడులు పోసే సమయం రావడంతో నారు మడుల స్థాయి నుంచే నియంత్రణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
అనుమతి లేకుండా నారుమడులు కుదరవు
బోర్డు అనుమతి లేకుండా నారుమడులు పెట్టరాదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. నాణ్యమైన నారు కోసం పొగాకు విత్తనాలను నిర్కా (గతంలో సీటీఆర్‌ఐ) పేరుతో ఉన్న పరిశోధన కేంద్రం లేదా ఐటీసీ నుంచి పొందాలని, అది కూడా బోర్డు ద్వారా అనుమతితోనే అని తేల్చేశారు. అలా నారుమడుల నుంచే తీసుకోవాల్సిన చర్యలపై పొగాకు రైతులకు విస్తృత అవగాహనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వేలం కేంద్రాల వారీ రైతు కమిటీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఒంగోలు-2, వెల్లంపల్లి కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలోని విస్తరణ విభాగం ప్రాంతీయ మేనేజర్ కె.సురేఖ, ఒంగోలు ప్రాంతీయ మేనేజర్ జీఎల్‌కే.ప్రసాద్, బోర్డు కార్యాలయ అధికారి రామకృష్ణ, రెండు వేలం కేంద్రాల అధికారులు జె.తులసీ, గిరిరాజ్ పాల్గొన్నారు. పంట సాగు విస్తీర్ణం నియంత్రణ, ఉత్పత్తి తగ్గింపు, నాణ్యత పెంపు కోసం తీసుకోవాల్సిన చర్యలు, బోర్డు సూచనలను ఈ సందర్భంగా తెలియజేశారు. రెండో దశలో పొగాకు అధికంగా పండే గ్రామాల్లో రైతులతో ఈ తరహా సమావేశాలను నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. అలాగే అనుమతి లేకుండా పెట్టే నారుమడులు, పంట సాగు విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఉన్నతస్థాయి కమిటీ నియామకం
పొగాకు వేలాన్ని వేగవంతంగా, మరింత పటి ష్టంగా నిర్వహణ కోసం ఎలాంటి మార్పులు చేయాలి, ఏ తరహా సంస్కరణలు తీసుకురావా లనే దానిపై బోర్డు దృష్టి సారించింది. ఇందు కోసం బోర్డు ఉన్నతాధికారులు, చైర్మన్, రైతుల పట్ల కొంత సానుకూలంగా వ్యవహరించే కంపెనీల ప్రతినిధులు, అలాగే రైతుల్లోనూ విద్యావంతులై సాంకేతికతపై అవగాహన ఉన్న వారితో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ తొలి భేటీ బుధవారం గుంటూరులోని బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగింది. చైర్మన్ యశ్వంత్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమా వేశంలో ఈడీ విశ్వశ్రీ, డైరెక్టర్ బి.శ్రీనివాస్, సెక్రటరీ వేణుగోపాల్, వ్యాపార ప్రతినిధులు వెంకటరామిరెడ్డి, గుత్తా వాసు, కర్ణాటక, ఏపీల నుంచి రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల్లోని అన్ని రీజియన్లలోనూ ఈ కమిటీ పర్యటించి రైతు, వ్యాపార ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించనుంది. అందులోభాగంగా ఈనెల 21న ఒంగోలులో దక్షిణాది రీజియన్‌ల రైతులతో సమావేశం కానుంది.
గ్రేడ్ల నిర్ధారణకు ఏఐ వాడకం
త్వరితగతిన వేలం నిర్వహణ విషయంలో చేపట్టాల్సిన చర్యలపైనా బోర్డు అధికారులు దృష్టి సారించారు. వంద రోజుల్లో వేలం పూర్తి అన్నది బోర్డు లక్ష్యం. అయితే పంట ఉత్పత్తి పెరగడం, మార్కెట్లో ప్రతికూలతలు, రైతుల ఆందోళనలు ఇలా పలు కారణాలతో ఐదారు మాసాలు సాగుతోంది. ప్రత్యేకించి ప్రస్తుత సీజన్‌లో మరింత జాప్యమవుతోంది.రాష్ట్రంలో వేలం ప్రారంభించి ఇప్పటికే ఐదు మాసాలు పూర్తికావస్తున్నా పండిన పంటలో నాల్గోవంతు మించి కొనుగోలు జరగలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే డిసెంబరు ఆఖరు నాటికి అయినా పూర్తవుతుందా? అన్న అనుమాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ధరలు లేక నోబిడ్‌లు పెరగడం, రైతుల ఆందోళనలే కాక వేలానికి తెచ్చిన బేళ్ల గ్రేడ్‌లను నిర్ధారించడంలోనూ పలు లోపాలు ఉంటున్నాయి. దాని వల్ల నాణ్యమైన పంటకు తక్కువ గ్రేడ్, తక్కువ రకం బేళ్లకు ఎక్కువ గ్రేడ్‌లు పెట్టడం జరుగుతూ ధరల విషయంలో వివాదాలు వస్తున్నాయి. అనుభవజ్ఞులైన రెగ్యులర్ బోర్డు ఉద్యోగులు లేక తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని తీసుకుంటున్నారు. దీంతో గ్రేడ్‌ల నిర్ధారణలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కొందరు బోర్డు అధికారులకు వచ్చింది.